Mercedes Cup Tennis Tournament
-
రన్నరప్ బోపన్న జంట
స్టుట్గార్ట్: మెర్సిడెస్ కప్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నమెంట్లో రోహన్ బోపన్న (భారత్)–డెనిస్ షపోవలోవ్ (కెనడా) జోడీ రన్నరప్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో బోపన్న–షపోవలోవ్ ద్వయం 5–7, 3–6తో టాప్ సీడ్ బ్రూనో సొరెస్ (బ్రెజిల్)–జాన్ పీర్స్ (ఆస్ట్రేలియా) జంట చేతిలో ఓడిపోయింది. 68 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న ద్వయం ఐదు ఏస్‌లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తమ సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయింది. రన్నరప్‌గా నిలిచిన బోపన్న జోడీకి 19,680 యూరోల (రూ. 15 లక్షల 43 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 150 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
ప్రిక్వార్టర్స్‌లో ప్రజ్నేశ్ ఓటమి
స్టట్గార్ట్ (జర్మనీ): మెర్సిడెస్ కప్ టెన్నిస్ టోర్నీ తొలి రౌండ్లో సంచలన ప్రదర్శనతో ప్రిక్వార్టర్స్‌కు చేరిన భారత ఆటగాడు ప్రజ్నేశ్ గుణేశ్వరన్ రెండో రౌండ్లో ఓటమి పాలయ్యాడు. తొలి మ్యాచ్‌లో ప్రపంచ 23వ ర్యాంకర్‌ను మట్టికరిపించిన ప్రజ్నేశ్ ప్రిక్వార్టర్స్‌లో ప్రపంచ 75వ ర్యాంకర్ గిడో పెల్లా (అర్జెంటీనా) చేతిలో ఓటమి పాలయ్యాడు. గురువారం జరిగిన ఈ పోరులో ప్రజ్నేశ్ 6–7, 4–6తో గిడో పెట్టా చేతిలో ఓడాడు. కీలక సమయాల్లో పట్టు కోల్పోయిన ప్రజ్నేశ్ తిరిగి కోలుకోలేకపోయాడు. దీంతో క్వార్టర్స్‌లో టెన్నిస్ దిగ్గజం ఫెడరర్‌తో తలపడే అవకాశాన్ని కోల్పోయాడు. -
ఫెడరర్‌కు షాక్
స్టట్గార్ట్ (జర్మనీ): మెర్సిడెస్ కప్ టెన్నిస్ టోర్నమెంట్లో టాప్ సీడ్ రోజర్ ఫెడరర్‌కు అనూహ్య ఓటమి ఎదురైంది. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ఫెడరర్ (స్విట్జర్లాండ్) 6–2, 6–7 (8/10), 4–6తో 39 ఏళ్ల టామీ హాస్ (జర్మనీ) చేతిలో ఓడిపోయాడు. గ్రాస్‌కోర్టు సీజన్లో మెరుగైన ప్రదర్శన చేయాలనే ఉద్దేశంతో క్లే కోర్టు సీజన్‌కు దూరంగా ఉన్న ఫెడరర్ ఈ మ్యాచ్‌లో రెండో సెట్లో రెండు మ్యాచ్ పాయింట్లను వదులుకున్నాడు.