కుప్ప కూలిన సైనిక హెలికాప్టర్
అల్జీర్స్: ఒక సైనిక హెలికాప్టర్ కూలీ పన్నెండు మంది అల్జీరియన్ సైనికులు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ఘటన అల్జీర్స్ లోని రెగానే అనే ప్రాంతానికి దక్షిణంగా ఆదివారం సాయంత్రం చోటుచేసుకున్నట్లు మిలటరీ అధికారులు తెలిపారు. ' అల్జీరియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన మిగ్-171 హెలికాప్టర్ అద్రార్ ప్రావిన్స్‌లో కుప్పకూలిపోయింది.
సాంకేతిక లోపం కారణంగా ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా తెలుస్తోంది' అని ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే, మరిన్ని కారణాలు తెలుసుకునేందుకు దర్యాప్తు ప్రారంభించామని చెప్పారు. అల్జీరియా స్వాతంత్ర్యం పొందిన 1962 నుంచి నేటి వరకు మొత్తం 15 సార్లు ప్లేన్ క్రాష్ ఘటనలు చవిచూసింది. ఈ దేశంలో 2003లో జరిగిన ప్రమాదమే అతి పెద్దది. ఈ ఘటనలో అప్పుడు 97 మంది ప్రాణాలుకోల్పోయారు.