...ఇట్లు గారెలు
రోజూ మబ్బుపడుతోంది
సాయంత్రానికి నాలుగు చినుకులు పడనే పడతాయి
పిల్లలు ఇంటికొచ్చేటప్పటికి ఏం చేస్తే బావుంటుంది?
నానపోయండి... రుబ్బండి... నూనెలో వేయండి!
మేము రెడీ!!
మినపగారె
కావలసినవి
మినప్పప్పు - రెండు కప్పులు
ఉల్లిపాయ ముక్కలు- అర కప్పు
పచ్చిమిర్చి- రెండు (తరగాలి)
అల్లం- అంగుళం ముక్క (సన్నగా తరగాలి)
ఉప్పు - తగినంత
నూనె - వేయించడానికి సరిపడినంత
తయారీ: మినప్పప్పును కడిగి కనీసం నాలుగు గంటల సేపు నానబెట్టాలి. నీటిని మితంగా వేస్తూ రుబ్బాలి. ఇందులో ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం కలపాలి. బాణలిలో నూనె కాగిన తర్వాత పై మిశ్రమాన్ని గారెల్లా చేసి నూనెలో వేయాలి. రెండు వైపులా దోరగా కాలిన తర్వాత తీసి వేడిగా వడ్డించాలి.
గమనిక: గారెకు మధ్యలో చిల్లు పెడితే పిండి మొత్తం సమంగా కాలుతుంది. చిల్లు లేకపోతే కొన్నిసార్లు మధ్యలో పిండి పచ్చిగా ఉంటుంది.
సగ్గుబియ్యం గారెలు
కావలసినవి
సగ్గుబియ్యం- ఒకటిన్నర కప్పు
ఉడికించిన బంగాళదుంపలు- మూడు (తొక్క తీసి చిదమాలి)
వేయించిన వేరుశనగపప్పు - ఒక కప్పు (పలుకుగా పొడి చేసుకోవాలి)
పచ్చిమిర్చి- మూడు (సన్నగా తరగాలి)
కొత్తిమీర తరుగు- రెండు టేబుల్ స్పూన్లు
నిమ్మరసం - ఒక టేబుల్‌స్పూన్
ఉప్పు - తగినంత; నూనె - వేయించడానికి సరిపడినంత
తయారీ: సగ్గుబియ్యాన్ని రెండు గంటల సేపు నానబెట్టి నీటిని వడపోయాలి. సగ్గుబియ్యం, ఉడికించి చిదిమిన బంగాళదుంప, వేరుశనగపప్పు పొడి, పచ్చిమిర్చి తరుగు, కొత్తిమీర, నిమ్మరసం, ఉప్పు కలపాలి. బాణలిలో నూనె పోసి కాగిన తర్వాత పై మిశ్రమాన్ని గారెల్లా వత్తి నూనెలో రెండు వైపులా కాల్చాలి.
క్యాబేజ్ గారెలు
కావలసినవి: పచ్చి శనగపప్పు- అర కప్పు
మినప్పప్పు - అర కప్పు
క్యాబేజ్ తరుగు - రెండు కప్పులు
పచ్చిమిర్చి- రెండు (తరగాలి)
అల్లం - అంగుళం ముక్క (సన్నగా తరగాలి)
కొత్తిమీర తరుగు - అర కప్పు
కరివేపాకు - రెండు రెమ్మలు
సోంఫు, జీలకర్ర - ఒక్కోటి అర టీ స్పూన్
మిరియాలు - అర టీ స్పూన్
ఇంగువ - చిటికెడు; ఉప్పు - తగినంత
వెల్లుల్లి - రెండు రేకలు (తరగాలి)
నూనె - వేయించడానికి సరిపడినంత
తయారీ: మినప్పప్పు, శనగపప్పును కడిగి రాత్రంతా నానబెట్టాలి లేదా కనీసం ఐదు గంటల సేపు నాననివ్వాలి. నీటిని వంపేసి పప్పులలో మిరియాలు, సోంఫు, జీలకర్ర, ఇంగువ, ఉప్పు వేసి తక్కువ నీటిని వేస్తూ గట్టిగా రుబ్బాలి. ఈ మిశ్రమంలో క్యాబేజ్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, అల్లం, వెల్లుల్లి వేసి బాగా కలపాలి. బాణలిలో నూనె పోసి కాగిన తర్వాత పై మిశ్రమాన్ని గారెల్లా వత్తి నూనెలో వేయాలి. రెండు వైపులా దోరగా కాలిన తర్వాత తీసి వేడిగా వడ్డించాలి.
మొక్కజొన్న గారెలు
కావలసినవి: మొక్కజొన్న గింజలు- 150 గ్రా (పచ్చివి)
పచ్చి శనగ పప్పు - 50 గ్రా (గంట సేపు నానబెట్టాలి)
పచ్చిమిర్చి తరుగు - టీస్పూన్, ఉల్లిపాయ ముక్కలు-కప్పు
అల్లం - అంగుళం ముక్క (సన్నగా తరగాలి)
జీలకర్ర - అర టీ స్పూన్; ఉప్పు- తగినంత
కొత్తిమీర తరుగు - ఒక టేబుల్ స్పూన్
నూనె - వేయించడానికి సరిపడినంత
తయారీ: మొక్కజొన్న గింజలు, శనగపప్పు కలిపి కాస్త పలుకుగా రుబ్బాలి. పిండిలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, జీలకర్ర, కొత్తిమీర, ఉప్పు వేసి బాగా కలపాలి. బాణలిలో నూనె వేడి చేసి పై మిశ్రమాన్ని కొద్దిగా తీసుకుని అరచేతిలో ఉంచి గారెల ఆకారంలో వత్తి నూనెలో వేయాలి. రెండు వైపులా దోరగా కాలిన తర్వాత తీసి వేడిగా వడ్డించాలి. దీనికి కొబ్బరి కారం లేదా చికెన్ కర్రీ చక్కటి కాంబినేషన్.
గమనిక: పిండిలో నీరు ఎక్కువై మరీ జారుడుగా ఉంటే కార్న్‌ఫ్లోర్ కలుపుకోవాలి.