కృష్ణా నదిపై మరో నీటి పథకం
కర్ణాటక సన్నాహాలు!
రాయచూర్ జిల్లాలో మినీ బ్యారేజీ నిర్మాణానికి ఏర్పాట్లు
అప్రమత్తమైన నీటిపారుదలశాఖ
జూరాల: కృష్ణానదిపై కర్ణాటక ప్రభుత్వం మరో నీటి మళ్లింపు పథకానికి సన్నాహాలు చేస్తోంది. కొత్తగా రాయచూర్ జిల్లాలో కృష్ణానదిపై మినీ బ్యారేజీని నిర్మించాలని యోచిస్తోంది. ఈ మేరకు ఇక్కడి నీటి పారుదల శాఖ అధికారులకు సమాచారం అందింది. ఇప్పటికే నారాయణపూర్ నుంచి రాయచూర్ జిల్లా చివరి వరకు దాదాపు 80కి పైగా అక్రమ మినీ పథకాలు ఉన్నట్లు గుర్తించిన నీటిపారుదల శాఖ.. కొత్తగా ఈ బ్యారేజీని నిర్మిస్తే అసలుకే ముప్పు వాటిల్లుతోందని ఆందోళన చెందుతోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు కర్ణాటకలో కృష్ణానదిపై ఉన్న అక్రమ మినీ నీటి పథకాల నిగ్గు తేల్చాలని నిర్ణయించారు.
కర్ణాటకలోని నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి మన రాష్ట్రంలోని జూరాల ప్రాజెక్టు రిజర్వాయర్ వరకు, తుంగభద్ర ప్రాజెక్టు నుంచి ఆర్డీఎస్ హెడ్‌వర్క్స్ వరకు నదిలో వచ్చే నీటిని కాజేస్తున్న మినీ పథకాలు, నీటి మళ్లింపు బ్యారేజీలను గుర్తించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని నీటి పారుదలశాఖ అధికారుల బృందం నిర్ణయించింది. త్వరలోనే ఈ బృందం కర్నాటకలో పర్యటించనుంది. కాగా, అక్రమ ఎత్తిపోతల పథకాల ద్వారా చుక్క నీటిని దిగువకు వదలకుండా తోడేస్తుండడంతో తెలంగాణ రాష్ట్రంలోని కృష్ణానది పరీవాహక ప్రాంతాల్లోని ఆయకట్టు బీడుగా మారుతోంది.