అమాయకులే టార్గెట్
రెచ్చిపోతున్న అపరిచిత వ్యక్తులు
ఏటీఎం కార్డు ఏమార్చి నగదు డ్రా
ధర్మవరం అర్బన్ : అమాయకులను లక్ష్యంగా చేసుకుని అపరిచిత వ్యక్తులు రెచ్చిపోతున్నారు. డబ్బు డ్రా చేయిస్తామని నమ్మబలికి వారి పిన్ నంబర్ తెలుసుకుని, అనంతరం ఏటీఎం కార్డులు మార్చేసి.. తాపీగా ఖాతాలోంచి నగదును కొల్లగొడుతున్నారు. ఇటీవల బత్తలపల్లిలో జరిగిన సంఘటనను మరువకముందే మరొకటి ధర్మవరంలో వెలుగు చూసింది. ఆలస్యంగా గుర్తించిన బాధిత మహిళలు న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించారు. ధర్మవరం పట్టణంలోని రామ్‌నగర్‌కు చెందిన స్వరూపరాణి తన తల్లి అంజినమ్మతో కలిసి ఈ నెల 13న కళాజ్యోతి సర్కిల్లోనున్న ఎస్బీఐ ఏటీఎం వద్దకు డబ్బు డ్రా చేసేందుకు వెళ్లారు. అక్కడ ఏటీఎంలో డబ్బు రాకపోవడంతో చాలాసేపు ఇబ్బంది పడ్డారు.
పక్కనే ఉన్న ఓ అపరిచిత వ్యక్తి తాను డ్రా చేసిస్తాను అని వీరివద్దనుంచి ఏటీఎం కార్డు తీసుకుని, పిన్ నంబర్ కనుగొన్నాడు. అనంతరం ఈ ఏటీఎంలో డబ్బు లేదు.. మరొకదాని వద్దకు వెళ్లండని సూచిస్తూ.. వారి ఏటీఎం కార్డును మార్చి మరొకటి ఇచ్చాడు. ఆ మహిళలు కార్డును గమనించకుండా తీసుకుని, నేరుగా ఇంటికి వెళ్లిపోయారు. బుధవారం బ్యాంకుకు వెళ్లి పాస్‌బుక్‌లో వివరాలు నమోదు చేయించగా రూ.58 వేల వరకు తమకు తెలియకుండానే నగదు డ్రా చేసినట్లు వచ్చింది. తాము మోసపోయామని గుర్తించిన మహిళలిద్దరూ వెంటనే పట్టణ సీఐ హరినాథ్‌కు ఫిర్యాదు చేశారు. అపరిచిత వ్యక్తి గుంటూరు జిల్లాలోని ఓ ఏటీఎంలోను, ఆ తర్వాత పెట్రోల్ బంకుల్లోను స్వైప్ మిషన్ ద్వారా ఈ నగదు డ్రా చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.