మంత్రి నారాయణపై చర్యలు తీసుకోవాలి: రోజా
తిరుపతి : తిరుపతిలో పదో తరగతి విద్యార్థి మోహన్ కృష్ణారెడ్డి అమమానాస్పద స్థితిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురువారం ధర్నా చేపట్టింది. మోహన్ కృష్ణారెడ్డి మృతిపై చాలా అనుమానాలు ఉన్నాయని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. తక్షణమే న్యాయ విచారణ జరిపించాలన్నారు. మంత్రి నారాయణపై చర్యలు తీసుకోవాలని రోజా డిమాండ్ చేశారు.
కర్నాల వీధికి చెందిన పరంధామరెడ్డి, లక్ష్మీ దంపతుల కుమారుడు మోహన్ కృష్ణారెడ్డి(15) ఓ కార్పొరేట్ స్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. గత గురువారం స్కూల్ యాజమాన్యం ఆ బాలుని తల్లిదండ్రులకు ఫోన్ చేసి ప్రమాదవశాత్తూ అద్దంపై పడడంతో గాయపడ్డాడని ఆస్పత్రిలో చేర్పించినట్లు సమాచారం అందించారు. అప్పటికే మోహన్ కృష్ణారెడ్డి మృతి చెందటంపై తల్లిదండ్రులు దిగ్భ్రాంతికి గురయ్యారు. కాగా విద్యార్థులు మధ్య ఘర్షణ వల్లే ఈ ఘటన జరిగినట్లు సమాచారం.
మరోవైపు మృతి చెందిన విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయడానికి స్కూల్ యాజమాన్యం నిరాకరిస్తోంది. దీంతో మృతుడి కుటుంబ సభ్యులు స్కూల్ ఎదుట ఆందోళనకు దిగారు. బాధితుల ఆందోళనకు వైసిపిసీపీ ఎమ్మెల్యేలు రోజా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మద్దతు తెలిపారు. కొడుకును కోల్పోయిన తమకు స్కూల్ యాజమాన్యం న్యాయంచేయడం లేదని, పోలీసులు కూడా కేసును పట్టించుకోవడంలేదని ఆందోళనకు దిగారు. స్కూల్ యాజమాన్యం వెంటనే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.