ఈక్విటీ ఫండ్స్ అదే జోరు
న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఆగస్ట్‌లోనూ తమ జోరు చూపించాయి. నికరంగా రూ.38,239 కోట్లను ఆకర్షించాయి. ముఖ్యంగా థీమ్యాటిక్ ఫండ్స్, కొత్త పథకాల (న్యూ ఫండ్ ఆఫర్లు/ఎన్‌ఎఫ్‌వోలు) రూపంలో ఎక్కువ పెట్టుబడులను సమీకరించాయి. ఈ ఏడాది జూలైలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లోకి వచి్చన రూ.37,113 కోట్లతో పోల్చి చూస్తే 3.3 శాతం మేర ఆగస్ట్‌లో వృద్ధి నమోదైంది. జూన్‌లో వచి్చన రూ.40,608 కోట్ల పెట్టుబడులు ఇప్పటి వరకు నెలవారీ గరిష్ట రికార్డు కాగా, ఆగస్ట్‌లో పెట్టుబడులు రెండో గరిష్ట రికార్డుగా ఉన్నాయి. ఈ గణాంకాలను మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) విడుదల చేసింది. మొత్తం మీద మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ వ్యాప్తంగా అన్ని రకాల పథకాల్లోకి కలిపి ఆగస్ట్‌లో రూ.1.08 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. జూలైలో ఇవి రూ.1.9 లక్షల కోట్లుగా ఉన్నాయి. దీంతో మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ నిర్వహణలోని మొత్తం ఆస్తుల విలువ జూలై చివరికి ఉన్న రూ.65 లక్షల కోట్ల నుంచి ఆగస్ట్ చివరికి రూ.66.7 లక్షల కోట్లకు చేరింది. కొత్త గరిష్టానికి సిప్ పెట్టుబడులు సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) ద్వారా వచ్చే పెట్టుబడులు ఆల్‌టైమ్ గరిష్ట స్థాయిలో రూ.23,547 కోట్లుగా నమోదయ్యాయి. జూలైలో ఇవి రూ.23,332 కోట్లుగా ఉన్నాయి. విభాగాల వారీగా పెట్టుబడులు.. → థీమ్యాటిక్ ఫండ్స్ (రంగాలు/ప్రత్యేక థీమ్‌లలో ఇన్వెస్ట్ చేసేవి) పథకాల్లోకి అత్యధికంగా రూ.18,117 కోట్లు వచ్చాయి. ఈ తరహా పథకాలు జూలైలో రూ.18,336 కోట్లు, జూన్‌లో రూ.22,352 కోట్ల చొప్పున ఆకర్షించడం గమనార్హం. → ఆగస్ట్‌లో ఆరు కొత్త పథకాలు ప్రారంభం కాగా, అందులో ఐదు సెక్టోరల్/థీమ్యాటిక్ ఫండ్స్ ఉన్నాయి. ఇవి రూ.10,202 కోట్లను సమీకరించాయి. → లార్జ్‌క్యాప్ పథకాల్లోకి రూ.2,637 కోట్లు వచ్చాయి. మిడ్‌క్యాప్ పథకాలు రూ.3,055 కోట్లు, స్మాల్‌క్యాప్ ఫండ్స్ రూ.3,209 కోట్ల చొప్పున ఆకర్షించాయి. అన్ని రకాల పథకాల్లోకి పెట్టుబడుల రాక ఇన్వెస్టర్లలో మార్కెట్ల పట్ల ఉన్న సానుకూల ధోరణిని తెలియజేస్తోందని నిపుణులు పేర్కొంటున్నారు. → ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల రాక రూ.3,513 కోట్లుగా ఉంది. → కేవలం ఫోకస్డ్ ఫండ్స్, ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ నికరంగా పెట్టుబడులను కోల్పోయాయి. → డెట్ పథకాల్లోకి నికరంగా రూ.45,169 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. జూలైలో వచ్చిన రూ.1.2 లక్షల కోట్ల కంటే 62 శాతం తక్కువ. → డెట్‌లో ఓవర్‌నైట్ ఫండ్స్ అత్యధికంగా రూ.15,106 కోట్లను ఆకర్షించాయి. ఆ తర్వాత లిక్విడ్ ఫండ్స్, మనీ మార్కెట్ ఫండ్స్ పట్ల ఇన్వెస్టర్లు మొగ్గు చూపించారు. మొత్తం పెట్టుబడుల్లో 86 శాతం ఈ మూడు విభాగాల్లోని పథకాల్లోకే వచ్చాయి. → గోల్డ్ ఈటీఎఫ్‌లు రూ.1,611 కోట్లను ఆకర్షించాయి. జూలైలో వచ్చిన రూ.1,337 కోట్లతో పోల్చి చూస్తే 20 శాతానికి పైగా వృద్ధి కనిపిస్తోంది. → మొత్తం ఫోలియోలు (ఇన్వెస్టర్ల పెట్టుబడి ఖాతాలు) జూలై చివరకి ఉన్న 19.84 కోట్ల నుంచి ఆగస్ట్ చివరికి 20 కోట్ల మార్క్‌ను అధిగమించాయి.