పెట్టుబడులు వెల్లువెత్తుతాయి: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: నూతన పారిశ్రామిక విధానంతో తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తే అవకాశముందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అభిప్రాయపడ్డారు. కొత్త విధానంతో రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి సంబంధించి కంటున్న కలలు నిజమవుతాయని.. తనకు ఆ నమ్మకం ఉందని చెప్పారు. ఈ నెల 12న కొత్త పారిశ్రామిక విధానాన్ని లాంఛనంగా ప్రారంభిస్తామన్నారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ విద్యార్థులు, వివిధ కార్పొరేట్ కంపెనీల ప్రతినిధులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో శుక్రవారం హైదరాబాద్‌లోని ఎంసీహెచ్‌ఆర్‌డీలో ఏర్పాటు చేసిన సదస్సులో ముఖ్యమంత్రి మాట్లాడారు.
సింగిల్ విండో విధానం, ఆన్‌లైన్ దరఖాస్తులు, సీఎం కార్యాలయంలో ఛేజింగ్ సెల్ ఏర్పాటు, పది పన్నెండు రోజుల్లోనే పరిశీలన, స్వయంగా ముఖ్యమంత్రి అధ్వర్యంలో అన్ని విభాగాల అనుమతుల ప్యాకేజీని అందించేలా నూతన పారిశ్రామిక విధానంలో ఉన్న ప్రత్యేకతలను సీఎం వారికి వివరించారు. సదస్సులో పాల్గొన్న విద్యార్థులు ఈ సందర్భంగా ప్రభుత్వం చేపడుతున్న వాటర్‌గ్రిడ్, ఫార్మా సిటీ, స్మార్ట్ సిటీ, వైఫై సిటీ, గూగుల్ ప్రాజెక్టులన్నీ దేశవ్యాప్తంగా అందరినీ ఆకర్షిస్తున్నాయని ప్రశంసించారు.