మదర్‌డెయిరీ ఆదాయాన్ని రైతులకు పంచుతున్నాం
హయత్‌నగర్, న్యూస్‌లైన్: మదర్‌డెయిరీ ఆదాయంలో 80 శాతం నిధులను రైతుల శ్రేయస్సు కోసం ఖర్చు చేస్తున్నామని, నష్టాల్లో ఉన్న డెయిరీని లాభాల బాటలోకి తీసుకొచ్చామని నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల పాల ఉత్పత్తిదారుల సమాఖ్య (నార్మాక్) చైర్మన్ గుత్తా జితేందర్‌రెడ్డి అన్నారు. గురువారం వనస్థలిపురంలోని స్వరుషి గార్డెన్స్‌లో జరిగిన సమాఖ్య 14వ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులు ప్రైవేటు డెయిరీల ప్రలోభాలకు లొంగకుండా సమాఖ్యలో చేరాలని అన్నారు. మార్కెటింగ్‌లో ప్రైవేటు డెయిరీలు ఏజెంట్లకు ఎక్కువ కమీషన్లు ఇవ్వడంవల్ల పాల అమ్మకాలను తగిన స్థాయిలో పెంచలేకపోతున్నామని అన్నారు. అనేక ప్రైవేటు డెయిరీలు రాజకీయ నాయకుల చేతుల్లో ఉండడంవల్ల ప్రభుత్వం డెయిరీలకు సబ్సిడీ ఇవ్వలేకపోతుందని ఈ విషయమై ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.
ఆల్డా చైర్మన్ బొందుగుల నర్సింహారెడ్డి మాట్లాడుతూ మదర్‌డెయిరీ పాల నాణ్యతలో శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉందని అధికంగా ఆవుపాలు వస్తుండడంతో పాల నాణ్యత పడిపోతుందని అన్నారు. రైతులను అధికారులు చులకన భావంతో చూస్తున్నారని ఎన్నికల అధికారికి జవాబుదారీతనం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం కొత్తగా ఎన్నికైన డెరైక్టర్లు శ్రీనివాసరావు, భిక్షపతి, ప్రవీణ్‌కుమార్‌లను సన్మానించారు. అధికంగా పాలఉత్పత్తి సాధించిన రైతులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎండీ సురేష్‌బాబు, అధికారులు యుగంధర్‌రెడ్డి, రమేష్, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.