మున్సిపల్ ఫలితాల ప్రకటనపై ఉత్కంఠ
సాక్షి, నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫలితాల తరహాలోనే మున్సిపల్ ఎన్నికల ఫలితాలపైనా టెన్షన్ నెలకొంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలను మే 7 తర్వాత ప్రకటించాలని ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. తాజాగా మున్సిపల్ ఎన్నికల ఫలితాలపైనా ఈ ప్రభావం పడింది. మున్సిపల్ ఎన్నికల ఫలితాల ప్రకటనపై హైకోర్టులో శుక్రవారం వాదనలు జరిగాయి. కోర్టు తీర్పును ఏప్రిల్ 1కి వాయిదా వేసింది.
ఈ క్రమంలో ముందుగా ప్రకటించినట్లు 2వ తేదీ ఓట్లు లెక్కిస్తారా..లేదా అనే ఉత్కంఠ అందరిలో మొదలైంది. షెడ్యూల్ ప్రకారం ఆదివారం నెల్లూరు కార్పొరేషన్తో పాటు గూడూరు, కావలి, వెంకటగిరి, ఆత్మకూరు, సూళ్లూరుపేట, నాయుడుపేట మున్సిపాలీట్లో ఎన్నికలు జరుగుతున్నాయి. అవసరమైన చోట్ల 31న రీపోలింగ్ నిర్వహిస్తారు. ఓట్ల లెక్కింపు మాత్రం ఒకటో తేదీన కోర్టు వెల్లడించే తీర్పుపై ఆధారపడి జరగనుంది.