పర్యావరణ హిత ప్రయాణం
‘గో బెంగళూరు’ యాప్‌ను రూపొందించిన ‘జిరాక్స్’
నగర వాసులకు అందుబాటులోకి సరికొత్త యాప్
దేశంలోనే బెంగళూరులో మొదటిసారిగా అమలులోకి
బెంగళూరు: మనం ప్రయాణించే దూరం..ఆ సమయంలో వినియోగించే వాహనం..అది విడుదల చేసే కాలుష్యం..ఇలా లెక్కగట్టి పర్యావరణ హితంగా ఎలా ప్రయాణించాలనే విషయంపై సూచనలు ఇచ్చేందుకు ఓ సరికొత్త యాప్ అందుబాటులోకి వచ్చింది. ‘గో బెంగళూరు’ పేరిట ఈ మల్టీ మోడల్ అర్బన్ ట్రాన్స్‌పోర్ట్‌ను అమెరికాకు చెందిన ‘జిరాక్స్’ సంస్థ రూపొందించింది. ఇటీవల ఈ యాప్‌ను నగరంలో అందుబాటులోకి తీసుకొచ్చింది. బెంగళూరు నగరంలో ఒక చోట నుంచి మరొక చోటకు చేరుకోవడానికి దారి చూపే యాప్‌లు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో‘గో బెంగళూరు’ యాప్ ప్రత్యేకత ఏమిటనే ప్రశ్న తలెత్తవచ్చు. అయితే ఇప్పటి వరకు ఉన్న యాప్‌లలో లేని ఒక విభిన్నత ఈ యాప్‌లో ఉంది. అదే ప్రయాణికుడికి దారి చూపడంతో పాటు పర్యావరణ హితమైన ప్రయాణాన్ని గురించి కూడా తెలియజేయడం.
ఈ యాప్ ద్వారా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి చేరుకోవడానికి ఉన్న మార్గాలు బస్సు రూట్, ఆయా బస్సు నంబర్లు, మెట్రో కనెక్టివిటీ, ఆటో, క్యాబ్‌లలో వెళ్లాలంటే ఎంత సమయం పడుతుంది, ఆటో, క్యాబ్‌లు ఎంత మొత్తాన్ని వసూలు చేస్తాయి అన్న వివరాలన్నీ తెలుసుకోవచ్చు. ఇదే సందర్భంలో బస్సు, ఆటో, క్యాబ్, ద్విచక్ర వాహనం వీటి ప్రయాణం ద్వారా ఎంత మోతాదులో కాలుష్య కారక వాయువులు వెలవడతాయి అన్న వివరాలను సైతం ఈ యాప్ తెలియజేస్తుంది. చిన్నపాటి దూరం మనం ప్రయాణం చేయాల్సి వచ్చినపుడు అక్కడి నడుచుకుంటూ లేదంటే సైక్లింగ్ చేస్తూ వెళ్లడం ఉత్తమమని సలహా ఇవ్వడమే కాక తద్వారా ఎన్ని కేలరీలను కరిగించవచ్చో కూడా తెలియజేయడమే ఈ యాప్ ప్రత్యేకత.
బీఎంటీసీ, ఓలాలతో ఇప్పటికే ఒప్పందం.....
ఎంటీసీ ‘స్మార్ట్’ విధానంలో ముందుకు సాగుతూ ఇటీవలే ఇంటలిజెంట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్(ఐటీఎస్)ను అందుబాటులోకి తీసుకొచ్చిన నేపథ్యంలో బీఎంటీసీతో తాము ఒప్పందం కుదుర్చుకున్నామని జిరాక్స్ రీసర్స్ సెంటర్ భారత శాఖ డెరైక్టర్ మనీష్ గుప్తా వెల్లడించారు. ఏయే మార్గాల్లో ఏయే బస్సులు అందుబాటులో ఉన్నాయి, ఎంత సేపట్లో మనకు కావాల్సిన బస్సు వస్తుంది తదితర వివరాలన్నింటితో పాటు సమీపంలోని ఓలా క్యాబ్‌ల వివరాలు సైతం ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. కాగా, ఇప్పటికే తమ సంస్థ లాస్ ఏజింల్స్ నగరంలో ‘గో లాస్ ఏంజిల్స్’, పేరిట, డెన్వర్ నగరంలో ‘గో డెన్వర్’ పేరిట ఈ యాప్‌లను అందుబాటులోకి తీసుకురాగా అక్కడి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని చెప్పారు. ఈ నేపథ్యంలో దేశంలోనే మొట్టమొదటి సారిగా బెంగళూరు నగంలో ‘గో బెంగళూరు’ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వెల్లడించారు. ఈ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుండి ఉచితంగానే డౌన్లోడ్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు.
ఉదాహరణకు ఇలా.....
మనం బెంగళూరులోని వసంతనగర నుంచి మల్లేశ్వరం ప్రాంతానికి వెళ్లాలనుకుంటే ఈ యాప్‌ను ఉపయోగించి ద్విచక్ర వాహనంలో 20 నిమిషాల్లో చేరుకోవచ్చు. ఇందుకు 0.8కేజీ కార్బన్‌డై ఆక్సైడ్ విడుదలవుతుంది. 14 కేలరీలు ఖర్చవుతాయి. అదే కారులో అయితే 26 నిమిషాల సమయం పడుతుంది. 1.6 కేజీల కార్బన్ డై ఆక్సైడ్ విడుదలవుతుంది. 11కేలరీలు ఖర్చవుతాయి. సైకిల్ అయితే కార్బన్ డై ఆక్సైడ్ విడుదలయ్యే పరిమాణం 0.0కేజీలు. ఖర్చయ్యే కేలరీలు 101. ఇలా బస్సు, ఆటో అన్నింటికి సంబంధించిన వివరాలు ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు.