Murgi Chowk
-
Hyderabad: చారిత్రక సంపదకు నయా నగిషీలు
సాక్షి, హైదరాబాద్: చారిత్రక, సాంస్కృతిక వారసత్వ కట్టడాల పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. నిజాం హయాంలో నిర్మించిన ఆనేక కట్టడాలకు నగిషీలు చెక్కడం ద్వారా భావితరాలకు చారిత్రక వైభవాన్ని తెలియజెప్పే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా ఆయా కట్టడాలను పునరుద్ధరిస్తోంది. ఇప్పటికే మొజంజాహీ మార్కెట్, క్లాక్‌టవర్లు, బన్సీలాల్‌పేట బావిని పునరుద్ధరించిన పురపాలక శాఖ.. తాజాగా ముర్గీ చౌక్, మీరాలం మండి, సర్దార్ మహల్‌లకు నయా సొబగులను అద్దాలని నిర్ణయించింది. అంతర్జాతీయ పర్యాటక స్థలాల్లో ఒక్కటిగా చెప్పుకునే చార్మినార్, దాని పరిసరాలను అందంగా తీర్చిదిద్దడంలో భాగంగా ఈ మూడింటిని పునరుద్ధరించే పనులను చకచకా చేస్తోంది. కులీ కుతుబ్‌షా పట్టణాభివృద్ధి సంస్థ వీటిని పర్యవేక్షిస్తోంది. వడివడిగా మీరాలంమండి పనులు నగర ప్రజల కూరగాయ అవసరాలను తీర్చడానికి 1805లో అప్పటి ప్రధాని నవాబ్ మీర్ అలం యార్జంగ్ మీరాలం మండిని ప్రారంభించారు. హైదరాబాద్ తొలి మార్కెట్‌గా చెప్పుకొనే ఈ మండి.. ప్రస్తుతం కూడా కొనసాగుతున్నప్పటికీ దయనీయ పరిస్థితిలో ఉంది. కనీస సౌకర్యాల్లేక.. సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. ఈ మార్కెట్‌ను అభివృద్ధి చేసేందుకు రూ.16.45 కోట్లను కేటాయించారు. మార్కెట్‌ను మూడు విభాగాలు విభజించి.. దశలవారీగా అభివృద్ధి చేయనున్నారు. సర్దార్ మహల్ పునరుద్ధరణ.. 1900లో యూరోపియన్ నిర్మాణ శైలిలో నిర్మించిన సర్దార్ మహల్ చారిత్రక కట్టడం. నిర్వహణ లేక భవనం పూర్తిగా దెబ్బతిన్నది. పూర్వ వైభవం తేవడానికి జీహెచ్ఎంసీ ప్రత్యేక నిధులను కేటాయించి పనులను ‘కుడా’ ఆధ్వర్యంలో ప్రారంభించనుంది. భవనం శైలి దెబ్బ తినకుండా ఆధునికీకరించనున్నారు. ఈ భవనంలో సాంస్కృతిక కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించిన పురపాలకశాఖ.. అభివృద్ధి పనులకు రూ.30 కోట్లు కేటాయించింది. చదవండి: ప్రసవం మధ్యలో వెళ్లిపోయిన వైద్యురాలు.. పసికందు మృతి శిథిలావస్థలో ముర్గీచౌక్.. 125 ఏళ్ల చరిత్ర కలిగిన కోళ్ల మండి (ముర్గీ చౌక్)ని ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీ హయాంలో ఏర్పడింది. చికెన్‌తో పాటు మాంసాన్ని సైతం ఇక్కడ విక్రయించేలా మార్కెట్‌ను అభివృద్ధి చేశారు. కాల గమనంలో ఈ మండి శిథిలావస్థకు చేరింది. పురాతన కట్టడాలు పెచ్చులు ఊడిపోయి, రేకుల షెడ్డు ఎగిరిపోవడంతో ముర్గీచౌక్ అధ్వానంగా తయారైంది. ఈ మార్కెట్‌ను ఆధునికీకరించాలని ‘కుడా’ కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. ఈ మేరకు రూ.36 కోట్ల నిధులను విడుదల చేసింది. గ్రౌండ్ ప్లస్ భవనాన్ని నిర్మించాలని, దిగువన మార్కెట్.. పై అంతస్తులో రెస్టారెంట్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీనికి అనుగుణంగా మార్కెట్‌ను అక్కడి నుంచి సమీపంలోని మైదానంలోకి షిఫ్ట్ చేసింది. దీన్ని ఏడాదిన్నరలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. పూర్వ వైభవం తెస్తాం.. నిజాం పాలన హయాంలో నిర్మించిన కట్టడాలకు పూర్వ వైభవం తేవడానికి ప్రణాళిక రూపొంచింది. చారిత్రక కట్టడాల వారసత్వ సంపద పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. నిపుణుల సలహాలు, సూచనలతో ఆధునికీకరణ పనులు చేపడుతున్నాం. తొలుత ముర్గీచౌక్ నిర్మాణ పనులు ప్రారంభించాం. మీరాలంమండి, సర్దార్ మహల్ పనులు కూడా త్వరలోనే పూర్తి చేస్తాం. – బాదావత్ సంతోష్, కుడా అడ్మినిస్ట్రేటర్ గడువులోగా పనులు పూర్తి చేస్తాం.. ముర్గీచౌక్ మార్కెట్ పనులు ప్రాంభమయ్యాయి. ప్రస్తుతం కొనసాగుతున్న మార్కెట్లోని వ్యాపారులను సమీప మైదానంలోకి తరలించాం. టెండర్ ప్రక్రియ ద్వారా పనులను కేటాయించాం. ఉన్నత అధికారుల ఆదేశాలు.. ప్లాన్ ప్రకారం పనులు అయ్యే విధంగా ప్రణాళికాబద్ధంగా పనులు చేయిస్తున్నాం. నిర్మాణాలు గడువులోగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు సూచించాం. – జి.గురువీర, కుడా సెక్రటరీ, చీఫ్ ఇంజినీర్ చదవండి: తెలంగాణ ఆర్టీసీ బస్సులు డొక్కుడొక్కు.. అద్దె బస్సులపై కన్ను? -
వందేళ్లుగా దాహం తీరుస్తూ...
చార్మినార్: నగరంలో దాహం తీర్చడానికి పలు ప్రాంతాలలో చలివేంద్రం కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ఆయా ప్రాంతాలలోని స్వచ్ఛంద సంస్థలు ముందుకు వసుంటాయి. ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా దాహంతో ఉన్న ప్రజలకు మంచినీరు అందజేయడానికి చేస్తున్న కృషి అందరికి తెలిసిందే. ముఖ్యంగా వేసవి కాలంలో స్వచ్చందంగా మంచినీటిని అందజేస్తుండడం ప్రశంసనీయం. మంచినీటి సౌకర్యం కల్పించే ప్రక్రియ దాదాపు నిజాం కాలం నుంచి కొనసాగుతూ వస్తోంది. అయితే, పాతబస్తీలో రౌండ్ ది క్లాక్ మంచినీరు అందజేస్తున్న చలివేంద్రాలు కూడా ఉన్నాయి. ఏడాది పొడవునా మంచినీరు అందుబాటులో ఉంటుంది. పాతబస్తీలోని ముర్గీచౌక్ వద్ద ఉన్న చలి వేంద్రం 100 ఏళ్లుగా దాహం తీరుస్తోంది. 1919లో ఖిల్వత్ చౌరస్తా సమీపంలోని ముర్గీచౌక్ వద్ద... 1919లో ఖిల్వత్ చౌరస్తా సమీపంలోని ముర్గీచౌక్ వద్ద నిజాం కాలంలో నీటి కేంద్రం నిర్మాణం జరిగింది. అప్పట్లో జల్‌శాల అనే వారు. జల్‌శాల అంటే నీటి కేంద్రం..అని. అప్పటి నుంచి ఈ జల్‌శాల ద్వారా ఇక్కడి ప్రజలకు మంచినీరు అందుతోంది. కాగా 1965లో అప్పటి హైదరాబాద్ మేయర్ దీనిని హైదరాబాద్ జనతా జల్శాలగా నామకరణం చేసి ఆధునీకరించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడ మంచినీటి కేంద్రం నిరంతరం పని చేస్తుంది. ఎప్పుడైనా ఇక్కడ నీరు అందుబాటులో ఉంటుంది. వేసవి కాలంలో ఈ జలశాలకు మరింత ఆదరణ ఉంటుంది. పాదచారులు,వాహన దారులతో పాటు స్థానిక వ్యాపారుల దాహార్తిని తీరుస్తోంది. -
చిడియా చౌక్
చార్మినార్ సమీపంలోని ముర్గీ చౌక్... పేరుకే ముర్గీ చౌక్ కానీ అక్కడ దొరకని పక్షి లేదంటే అతిశయోక్తి కాదు. పక్షులు, జంతువులపై కొందరికి ఉన్న ప్రేమ... ఇంకొందరి నమ్మకం... పాతబస్తీలో కొన్ని వందల కుటుంబాలకు జీవనాధారమవుతోంది. 150 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ముర్గీచౌక్ గురించి క్లుప్తంగా... - శిరీష చల్లపల్లి ముర్గీచౌక్‌లో కోళ్లతోపాటు రామచిలుకలు, పావురాలు, కుందేళ్లు, బాతులు, పిల్లులు, కాకులు, పిచ్చుకలు, కోతులు, రకరకాల కుక్కలు, మేకలు, గిన్నెకోళ్లు... ఇలా రకరకాల పక్షులు, జంతువులు దొరుకుతాయి. పక్షులకు నిలయమైన ముర్గీ చౌక్‌ను చిడియా బజార్ అని కూడా పిలుస్తారు. ఇందులో దాదాపు 150 దుకాణాల్లో 20 వేల పక్షులు అందుబాటులో ఉంటాయి. ఈ బజార్‌ను నమ్ముకుని దాదాపు 270 కుటుంబాలు జీవిస్తున్నాయి. వీరంతా వాళ్ల తాతల కాలం నుంచే పక్షులు, జంతువులను నమ్ముకుని బతుకుతున్నారు. స్వేచ్ఛనిస్తే... కేవలం పెంచుకోవడానికే కాదు... సినిమాల్లో పాటల షూటింగ్‌కు కూడా ఇక్కడినుంచే పక్షులను తీసుకెళ్తుంటారు. అంతేకాదు... ఇక్కడ కాకులను కూడా ఎక్కువగా కొంటుంటారు. కాకులను పెంచుకుంటారా? అని ఆశ్చర్యపోకండి! కాకులను గాల్లోకి వదిలితే తమ కీడు కూడా అలా గాలికి పోతుందని కొందరి నమ్మకం. అందుకే పక్షి ప్రేమికులే కాదు... ఆరోగ్యం, పెళ్లి, వివాదాలు, ఇతర కష్టమేదైనా ఉన్నవారు వచ్చి... రూ.50నుంచి రూ.80లకు కాకిని ఖరీదు చేసి... వాటి కి స్వేచ్ఛనిస్తారు. ‘42 ఏళ్లుగా పక్షులను అమ్ముతూ బతుకుతున్నాం. మా నాన్నగారికి పక్షులంటే చాలా ఇష్టం. అప్పట్లో ఆయన పక్షులను పెంచుకునేవారు. ఒకానొక దశలో ఆ పక్షులను అమ్ముకునే కడుపునింపుకోవాల్సిన పరిస్థతి ఏర్పడింది. అప్పటినుంచి ఇదే ఉపాధిగా బతుకుతున్నాం. మా దగ్గర 28 రకాల ఫ్యాన్సీ చిలుకలు, పావురాలు, కోళ్లు, బాతులు, లవ్‌బర్డ్స్, ఇంపోర్టెడ్ బర్డ్స్ కూడా దొరుకుతాయి’ అని చెబుతున్నారు బర్డ్ సెల్లర్ మహమ్మద్ హబీబ్. బోనుల పనిలో... పక్షుల నివాసాలైన పంజరాలు... కొన్ని జీవితాలకు ఆవాసాన్నిస్తున్నాయి. ‘35ఏళ్లుగా మేం కేజెస్ తయారు చేస్తున్నాం. నేనో ప్రొఫెషనల్ ఆర్టిస్టును. పోర్టరైట్స్, పెయింటింగ్స్, సైన్‌బోర్డ్స్, హోర్డింగ్స్ ఇలా రకరకాల పనులు చేసేవాడిని. టెక్నాలజీ డెవలప్మెంట్ పుణ్యమా అని అన్నీ కంప్యూటరైజ్డ్ అయిపోయాయి. మాకు ఉపాధి లేకుండా పోయింది. అందుకే ఈ వృత్తిని ఎంచుకున్నాం. రోజుకు పన్నెండు గంటలు పనిచేసి 10 బోనులు తయారు చేస్తాం. రోజుకు కనీసం మూడు నుంచి నాలుగు అమ్ముడు పోతాయి. ఐదువేల రూపాయల షాప్ రెంట్‌కు పోగా... మిగిలిన డబ్బుతో కుటుంబం గడుస్తోంది’ అని చెబుతున్నాడు బోనులు తయారుచేసే మహమ్మద్ జకీర్! జీవనాధారంగా దానా.. ఇక పక్షుల దానా దుకాణాలు ఇక్కడ కొన్ని కుటుంబాల పొట్ట నింపుతున్నాయి. పక్షులకు ఆహారంగా వేసే... పొద్దు తిరుగుడు గింజలు, రాగులు, సజ్జలు, గోధుమలు, మొక్కజొన్నలు కేజీల చొప్పున దొరుకుతాయి. ‘57ఏళ్లుగా సీడ్స్ బిజినెస్ చేసుకుంటూ బతుకుతున్నాం. ఉదయం ఎనిమిదిగంటలనుంచి రాత్రి పది గంటల వరకు ఇక్కడే గడిచిపోతుంది. గతంలో సైకిల్ ట్యాక్సీ బిజినెస్ చేసేవాళ్లం. కానీ సైకిల్ ట్యాక్సీలకు కాలం చెల్లిపోయింది. పూట గడవని పరిస్థితి ఏర్పడింది. ఆ తరువాత ఈ బిజినెస్ స్టార్ట్ చేశాం. పక్షులను కొన్నవాళ్లు వాటికి ఆహారం కొనక మానరు కదా! పక్షుల పుణ్యమా అని దాదాపు 60 ఏళ్లుగా మాకు ఏ సమస్య లేకుండా, మా పిల్లల భవిష్యత్‌కు డోకా లేకుండా సాగిపోతోంది’ అని అంటున్నాడు ఫీడ్ అమ్మకందారు సయ్యద్ ఖలీలుల్లా.