చిడియా చౌక్
చార్మినార్ సమీపంలోని ముర్గీ చౌక్... పేరుకే ముర్గీ చౌక్ కానీ అక్కడ దొరకని పక్షి లేదంటే అతిశయోక్తి కాదు. పక్షులు, జంతువులపై
కొందరికి ఉన్న ప్రేమ... ఇంకొందరి నమ్మకం... పాతబస్తీలో కొన్ని వందల కుటుంబాలకు జీవనాధారమవుతోంది. 150 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ముర్గీచౌక్ గురించి క్లుప్తంగా...
- శిరీష చల్లపల్లి
ముర్గీచౌక్‌లో కోళ్లతోపాటు రామచిలుకలు, పావురాలు, కుందేళ్లు, బాతులు, పిల్లులు, కాకులు, పిచ్చుకలు, కోతులు, రకరకాల కుక్కలు, మేకలు, గిన్నెకోళ్లు... ఇలా రకరకాల పక్షులు, జంతువులు దొరుకుతాయి. పక్షులకు నిలయమైన ముర్గీ చౌక్‌ను చిడియా బజార్ అని కూడా పిలుస్తారు. ఇందులో దాదాపు 150 దుకాణాల్లో 20 వేల పక్షులు అందుబాటులో ఉంటాయి. ఈ బజార్‌ను నమ్ముకుని దాదాపు 270 కుటుంబాలు జీవిస్తున్నాయి. వీరంతా వాళ్ల తాతల కాలం నుంచే పక్షులు, జంతువులను నమ్ముకుని బతుకుతున్నారు.
స్వేచ్ఛనిస్తే...
కేవలం పెంచుకోవడానికే కాదు... సినిమాల్లో పాటల షూటింగ్‌కు కూడా ఇక్కడినుంచే పక్షులను తీసుకెళ్తుంటారు. అంతేకాదు... ఇక్కడ కాకులను కూడా ఎక్కువగా కొంటుంటారు. కాకులను పెంచుకుంటారా? అని ఆశ్చర్యపోకండి! కాకులను గాల్లోకి వదిలితే తమ కీడు కూడా అలా గాలికి పోతుందని కొందరి నమ్మకం. అందుకే పక్షి ప్రేమికులే కాదు... ఆరోగ్యం, పెళ్లి, వివాదాలు, ఇతర కష్టమేదైనా ఉన్నవారు వచ్చి... రూ.50నుంచి రూ.80లకు కాకిని ఖరీదు చేసి... వాటి కి స్వేచ్ఛనిస్తారు. ‘42 ఏళ్లుగా పక్షులను అమ్ముతూ బతుకుతున్నాం. మా నాన్నగారికి పక్షులంటే చాలా ఇష్టం. అప్పట్లో ఆయన పక్షులను పెంచుకునేవారు. ఒకానొక దశలో ఆ పక్షులను అమ్ముకునే కడుపునింపుకోవాల్సిన పరిస్థతి ఏర్పడింది. అప్పటినుంచి ఇదే ఉపాధిగా బతుకుతున్నాం. మా దగ్గర 28 రకాల ఫ్యాన్సీ చిలుకలు, పావురాలు, కోళ్లు, బాతులు, లవ్‌బర్డ్స్, ఇంపోర్టెడ్ బర్డ్స్ కూడా దొరుకుతాయి’ అని చెబుతున్నారు బర్డ్ సెల్లర్ మహమ్మద్ హబీబ్.
బోనుల పనిలో...
పక్షుల నివాసాలైన పంజరాలు... కొన్ని జీవితాలకు ఆవాసాన్నిస్తున్నాయి. ‘35ఏళ్లుగా మేం కేజెస్ తయారు చేస్తున్నాం. నేనో ప్రొఫెషనల్ ఆర్టిస్టును. పోర్టరైట్స్, పెయింటింగ్స్, సైన్‌బోర్డ్స్, హోర్డింగ్స్ ఇలా రకరకాల పనులు చేసేవాడిని. టెక్నాలజీ డెవలప్‌మెంట్ పుణ్యమా అని అన్నీ కంప్యూటరైజ్‌డ్ అయిపోయాయి. మాకు ఉపాధి లేకుండా పోయింది. అందుకే ఈ వృత్తిని ఎంచుకున్నాం. రోజుకు పన్నెండు గంటలు పనిచేసి 10 బోనులు తయారు చేస్తాం. రోజుకు కనీసం మూడు నుంచి నాలుగు అమ్ముడు పోతాయి. ఐదువేల రూపాయల షాప్ రెంట్‌కు పోగా... మిగిలిన డబ్బుతో కుటుంబం గడుస్తోంది’ అని చెబుతున్నాడు బోనులు తయారుచేసే మహమ్మద్ జకీర్!
జీవనాధారంగా దానా..
ఇక పక్షుల దానా దుకాణాలు ఇక్కడ కొన్ని కుటుంబాల పొట్ట నింపుతున్నాయి. పక్షులకు ఆహారంగా వేసే... పొద్దు తిరుగుడు గింజలు, రాగులు, సజ్జలు, గోధుమలు, మొక్కజొన్నలు కేజీల చొప్పున దొరుకుతాయి. ‘57ఏళ్లుగా సీడ్స్ బిజినెస్ చేసుకుంటూ బతుకుతున్నాం. ఉదయం ఎనిమిదిగంటలనుంచి రాత్రి పది గంటల వరకు ఇక్కడే గడిచిపోతుంది. గతంలో సైకిల్ ట్యాక్సీ బిజినెస్ చేసేవాళ్లం. కానీ సైకిల్ ట్యాక్సీలకు కాలం చెల్లిపోయింది. పూట గడవని పరిస్థితి ఏర్పడింది. ఆ తరువాత ఈ బిజినెస్ స్టార్ట్ చేశాం. పక్షులను కొన్నవాళ్లు వాటికి ఆహారం కొనక మానరు కదా! పక్షుల పుణ్యమా అని దాదాపు 60 ఏళ్లుగా మాకు ఏ సమస్య లేకుండా, మా పిల్లల భవిష్యత్‌కు డోకా లేకుండా సాగిపోతోంది’ అని అంటున్నాడు ఫీడ్ అమ్మకందారు సయ్యద్ ఖలీలుల్లా.