మహిళను కావడమే నా తప్పు
నెస్వాడియాపై తన ఫిర్యాదు పనికిమాలిన లేదా అపరిపక్వ చర్య కాదని బాలీవుడ్ నటి ప్రీతీజింటా పేర్కొంది. కేవలం మహిళను కావడమే తన తప్పు అని, అనేకమార్లు అవమానాలు, బెదిరింపులు, వేధింపులకు గురైన మీదటనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని స్పష్టం చేసింది. తనను లైంగిక వేధింపులకు గురి చేశాడంటూ తన మాజీ ప్రియుడిపై ప్రీతి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెల్సిందే. వాస్తవాలు బయటకు వచ్చేంత వరకు ప్రజలు కాస్త ఓపిక పట్టాలని సూచించింది. తాను గతంలో ఎప్పుడూ అబద్ధాలు చెప్పలేదని, ఇక ముందు కూడా చెప్పలేనని బుధవారం తన ఫేస్బుక్ పేజ్లో పోస్ట్ చేసింది. తాను ఈ దేశంలో బాధ్యతాయుతమైన పౌరురాలినని, కేవలం మహిళను కావడమే తన తప్పు అని పురుద్ఘాటించింది. ఒకప్పుడు తనకు సన్నిహితునిగా ఉన్న వ్యక్తి పని ప్రదేశంలో తనను తీవ్రంగా వేధింపులకు, అవమానాలకు గురిచేసినందునే ఈ స్థితికి చేరానని చెప్పింది.
మహిళలపై హింస, ఆధిపత్యం సహించరానివని, అయినప్పటికీ ప్రజలు మహిళల వైపు వేలెత్తి చూపుతుంటారని వాపోయింది. వేధింపులకు వ్యతిరేకంగా గళమెత్తిన వారిని ‘పనికిమాలిన, దురుద్దేశ చర్య’గా అభివర్ణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.ఇది తనకోసం తాను జరుపుతున్న పోరాటమని, ఓ వ్యక్తికి లేదా కుటుంబానికి వ్యతిరేకంగా జరుపుతున్నది కాదని స్పష్టం చేసింది. తాను చేసిన ఫిర్యాదును మీడియా కనుగొని పెద్దదిగా చేస్తే తాను చేయగలిగిందేమిటని ప్రశ్నిం చింది. తాను మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఎవరికీ ఏమీ చెప్పలేదని పేర్కొంది. ఎవరికీ హాని చేయడం తన ఉద్దేశం కాదని, కేవలం తనను తాను రక్షించుకోవడమేనని మరోమారు ప్రీతీజింటా స్పష్టం చేసింది.