వేలిముద్రలు పడని వారికి 24 గంటల్లో రేషన్
ఏలూరు (మెట్రో) : వేలిముద్రలు పడక రేషన్ సరుకులు పొందలేని వారందరికీ 24 గంటల్లో సరుకులు అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ పులిపాటి కోటేశ్వరరావు అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన నా రేషన్ కార్యక్రమంలో ప్రజల నుంచి ఫోన్లో ఫిర్యాదులు స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి 18 మంది తమ సమస్యలను జేసీకి తెలిపారు.
- నల్లజర్ల మండలం పోతవరానికి చెందిన భాస్కరరావు, ఇరగవరం మండలం కాకిలేరుకు చెందిన ఫణిబాబు మాట్లాడుతూ వేలిముద్రలు పడక సరుకులు అందక వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారని ఫిర్యాదు చేశారు.
- కుకునూరు మండలం వెంకటాపురానికి చెందిన పి.చందన్‌కుమార్, నరసింహారావు మాట్లాడుతూ తమకు రేషన్ కార్డులు మంజూరైనా కొత్తకార్డులు ఇవ్వడం లేదన్నారు.
- భీమవరానికి చెందిన జె.వరలక్ష్మి మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లా మండపాకలో తమకు రేషన్‌కార్డు ఉందని, బతుకుదెరువు కోసం భీమవరం వచ్చామని, ఇక్కడ సరుకులు తీసుకునే వెసులుబాటు కల్పించాలని కోరింది. దీనిపై స్పందించిన జేసీ తక్షణమే ఇంటి సమీపంలో రేషన్ తీసుకునే వెసులుబాటు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డీఎస్వో యాసిన్, పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ గణపతి పాల్గొన్నారు.