ఐదుగురు ఉపాధ్యాయుల సస్పెన్షన్
అనంతపురం ఎడ్యుకేషన్/బత్తలపల్లి, న్యూస్‌లైన్ : పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుల్లో కొందరు క్రమశిక్షణ తప్పుతున్నారు. పాఠశాలలకు ఇష్టారాజ్యంగా వెళుతున్నారు. స్వయాన డీఈఓ మధుసూదన్ రావు ఆకస్మిక తనిఖీలో ఈ విషయం వెలుగుచూసింది. దీంతో ఆయన ఐదుగురిని సస్పెండ్ చేశారు.
డీఈఓ సోమవారం ఉదయం బత్తలపల్లి మండలం సంజీవపురం మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలను తనిఖీ చేశారు. ఆయన సరిగ్గా ఉదయం 8.55 గంటలకు పాఠశాలకు చేరుకున్నారు. అప్పటికి ఒక్క ఉపాధ్యాయుడూ రాలేదు. నిబంధనల మేరకు 8.45 గంటలకే రావాలి. డీఈఓ తొమ్మిది వరకు ఎదురు చూసినా ఒక్కరూ రాలేదు. చేసేదిలేక ఆయనే పిల్లలతో ప్రార్థన చేయించారు. 9.20 గంటలకు ఒకరు, 9.26కు మరొకరు, 9.40కి ఇద్దరు ఉపాధ్యాయులు పాఠశాలకు చేరుకున్నారు.
ఈ పాఠశాలలో మొత్తం 40 మంది విద్యార్థులున్నారు. ఖాసీం, నాగిరెడ్డి, మారుతీప్రసాద్, పావనరేఖ అనే నలుగురు ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంగా ఆ నలుగురినీ సస్పెండ్ చేశారు. అనంతరం డీఈఓ పక్కనే ఉన్న ఈదుల ముష్టూరు ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు. హెచ్ఎం వెంకటయ్య ఆలస్యంగా ఉదయం 10.30కి రావడంతో ఆయ న్నూ సస్పెండ్ చేస్తున్నట్లు డీఈఓ ప్రకటించారు. సంజీవపురం గ్రామం అనంతపురం-ధర్మవరం ప్రధాన రహదారి పక్కనే ఉంది. ఈ ఊరికి ప్రతి ఐదు నిమిషాలకో బస్సు ఉంది. ఇలాంటి పాఠశాలకే ఉపాధ్యాయులు సమయానికి వెళ్లడం లేదు. దీన్నిబట్టి రవాణా సౌకర్యాలు అంతగా లేని పాఠశాలలకు ఏమాత్రం వెళ్తుంటారో అర్థం చేసుకోవచ్చు. డీఈఓ ఇదే తరహాలో ఆకస్మిక తనిఖీలు కొనసాగిస్తే చాలామంది ఉపాధ్యాయులపై స స్పెన్షన్ వేటు పడే అవకాశముందని విద్యార్థుల తల్లిదండ్రులు చెబు తున్నారు.