పుర్సత్‌లో పుస్తకం బట్టుడే!
సాహిత్య అకాడెమీ అనువాద పురస్కారం
వరుణుడు ఆకాశ విహారి. కురిసిన ప్రాంతాన్ని బట్టి నదీ రూపం-నామం సంతరించుకుంటాడు. పన్నెండు జీవనదుల్లో ఏటా ఒకో నదిలో ప్రవేశించి వరుణుడు పుష్కరుడవుతాడట! నదుల్లో పుష్కరునిలా భారతీయ భాషాస్రవంతుల్లో ప్రవేశించినవారెవరైనా ఉన్నారా? ఉన్నారు! నలిమెల భాస్కర్‌ను భారతీయ భాషలలో ఓలలాడిన పుష్కరుడు అనడం అతిశయోక్తి కానేరదు! ‘మంద’ అనే తెలుగుకథను రాసి, మరో 13 భాషల కథలను మూలభాషల నుంచి అనువదించి ‘భారతీయ కథలు’గా పాఠకులకు బహూకరించారు భాస్కర్. ప్రముఖ మలయాళ రచయిత పునతిల్ కున్హబ్దుల్లా నవల ‘స్మారక శిలగళ్’ను ‘స్మారక శిలలు’గా తెలుగులోకి అనువదించి ఉత్తమ అనువాదకునిగా కేంద్రసాహిత్య అకాడెమీ పురస్కారానికి ఎంపికయ్యారు. భాషాశాస్త్రాలకు సంబంధించి అకడమిక్ చదువులు లేకుండానే ఈ ‘మిరకిల్’ ఎలా సాధించారు? ‘పుర్సతుంటే(తీరికుంటే) పుస్తకం పట్టుడే’ అని చెవి(ఫోన్)లో చెప్పిన నలిమెల భాస్కర్ సాహితీ ప్రస్తానం :
వేదన విశ్వభాష!
‘పుట్టగానే ఎవరైనా/ ఏడ్చేది కేర్‌మని/ అదొక్కటే విశ్వభాష’ అనే హైకూ ద్వారా భాస్కర్ తన ఫార్ములాను చెప్పేశారు. వేదనను ఆలకించే హృదయం ఉంటే ఏ భాష అయినా తనంత తానే తర్జుమా అవుతుంది. ‘గిదేంది’? అని ప్రశ్న రాగానే, కరీంనగర్ జిల్లాలోని నారాయణ్‌పూర్ గ్రామపు శ్రీరామ గ్రంథాలయం ‘అట్లన్నట్లు’ అని సమాధానం చెప్పేది. నేల అంచులను ఆకాశపు అంచులను ఊయలలో శిశువు తాకినట్లుగా ఆ గ్రంధాలయపు ఒడి విశ్వసారస్వతాన్ని చెంతకు చేర్చింది. ఒక భాషలో చదివిన పుస్తకం మూలభాషలో ఎలా ఉందో తెలుసుకునేందుకు హైస్కూల్ చదువుల రోజుల్లోనే భాస్కర్ తనదైన చిట్కాను కనుగొన్నారు.
ప్రభుత్వప్రకటనలు, ప్రముఖ వాణిజ్య సంస్థల ప్రకటనలు అన్ని భారతీయ భాషలలో విడుదలవుతాయి కదా! తెలుగు ప్రకటన ఆధారంగా అన్ని భాషల సారాంశంలోకి వెళ్లేవారు. ఆ తర్వాత బహుళ భాషల సామెతల పుస్తకాల ద్వారా! నాసికా త్రయంబకంలో బిందురూపంలో మొదలైన గోదావరిలా నారాయణపూర్ గ్రంథాలయంలో మొదలైన భాస్కర్ బహుళభాషల జిజ్ఞాస కాలం గడిచేకొద్దీ దశాధిక గ్రంథకర్తను చేసింది. మలయాళం, కన్నడం, తమిళంలో హ్యాట్రిక్ చేసిన డాక్టరేట్‌గా మలచింది! 27 సంవత్సరాల బోధనావృత్తి నుంచి అనారోగ్యం కారణంగా పదవీ విరమణ చేసిన భాస్కర్ అఖిలభారత తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షుడిగా- నేషనల్‌బుక్ ట్రస్ట్ సలహామండలి సభ్యునిగా- సాహిత్య అకాడెమి గ్రంథ సమీక్షకునిగా పూర్తికాలం సాహిత్యజీవితం గడుపుతున్నారు.
సహజభాషను ఈసడించవద్దు!
ప్రతి ముప్పైమైళ్లకు భాష మారుతుందంటారు. ఏ ప్రాంతం వారికైనా తమదైన సహజభాష ఉంటుంది.
తమ్మీ మంచిగున్నవా? వారీ ఎటు పోతివిరా! లాంటి వాక్యాలు తెలంగాణ పదాల్లో రమణీయతను, సొగసును చాటుతాయి. తమదైన సహజభాషను ఈసడించుకుని కృత్రిమత్వాన్ని చేర్చుకుని తమదే ప్రామాణికత అనే కృత్రిమ ధోరణులు హృదయాన్ని గాయపరుస్తాయి. ఈ నేపథ్యంలో నిఘంటువులలో లేని జనజీవితాల నుంచి సేకరించిన పదాలతో తాను రూపొందించిన ‘తెలంగాణ పదకోశా’న్ని కొన్ని పరిమితుల్లో చూడాలని భాస్కర్ సవినయంగా కోరుకుతున్నారు.
మాండలికాలు రాజకీయ సరిహద్దులకు అతీతమైనవని గుర్తు చేస్తూ కరీంనగర్ ప్రాంతంలో వాడుకలో ఉన్న పదాలతో తాను పదకోశాన్ని రూపొందించానన్నారు. మహబూబ్‌నగర్, దక్షిణ తెలంగాణ ప్రాంతపు పదాలు కరీంనగర్ మాండలికానికి భిన్నంగా ఉంటాయని, ఆయా మాండలీకాలలో నిపుణులైన ఆయా ప్రాంతాల వారినుంచి పదకోశాలు రావాలసి ఉన్నదన్నారు. పధ్నాలుగు భాషలు తెలియడం వేరు, మాతృభాషలో మాండలీకాలు తెలియడం వేరు అని చమత్కరించారు!
మలయాళం తెలుగు ‘తత్సమం’!
ప్రముఖ మలయాళ రచయిత పునతిల్ కున్హబ్దుల్లా నవల ‘స్మారక శిలగళ్’ మలయాళంలో ఏభైకి పైగా ముద్రణలు పొందింది. పుంఖానుపుంఖాలుగా సాహిత్యాన్ని సృజించిన పునతిల్ తాను రాసిన ఒకే ఒక్క నవల ‘స్మారక శిలగళ్’ అంటారు. మిగిలిందంతా మరోరూపంలో ఆ నవలకు కొనసాగింపేనంటారు. ఈ నవలను అనువదించవలసినదిగా భాస్కర్‌ను కేంద్రసాహిత్య అకాడెమీ సూచించింది. ‘అనువాదంలో సమస్యలు రాలేదు.
ఎందుకంటే మూల రచయిత మలయాళంలో ఆ నవలను ‘ప్రామాణిక’ భాషలో రాశారు. నేనూ అదే సూత్రాన్ని పాటించాను. ‘రెండు జిల్లాల ప్రామాణిక భాష’లో అనువదించాను. మలయాళంలో తెలుగులో వలె సంస్కృత పదాలు ముప్ఫైశాతం పైగా ఉంటాయి. ‘తత్సమాల’ విషయంలో రెండూ ఒకటే. నవలలో ముస్లిం సమాజం ఎక్కువగా ఉంటుంది. తెలుగు వారికి, ముఖ్యంగా తెలంగాణలోవారికి ఆ తరహా సమాజం సుపరిచితమే. కాబట్టి మూల రచయితతో మాట్లాడాల్సిన అవసరమూ ఏర్పడలేదు. రెండు భాషలూ తెలిసిన పాఠకుల కితాబే అనువాదానికి సాహిత్యఅకాడెమీ పురస్కారాన్ని తెచ్చిందని భావిస్తాను’ అన్నారాయన.
- పున్నా కృష్ణమూర్తి