లోక్సభలో ‘ఆహార భద్రత’
న్యూఢిల్లీ: రాష్ట్రాల హక్కులను హరిస్తుందనే వ్యతిరేక ఆరోపణలు, పలు పార్టీల వ్యతిరేకత మధ్య ప్రతిష్టాత్మక ‘ఆహార భద్రత బిల్లు’ను కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టింది. గతంలోనే ఆహార భద్రత బిల్లును ప్రవేశపెట్టినా.. ప్రతిపక్షాలతో పాటు పలు మిత్రపక్షాలు కూడా వ్యతిరేకించడంతో ఆమోదం పొందలేకపోయింది. దాంతో ఇటీవలే కేంద్రం పలు మార్పులతో ‘ఆహార భద్రత’పై ఆర్డినెన్సును తీసుకువచ్చింది. తాజాగా ఆ ఆర్డినెన్సుకు చట్టరూపం కల్పించేందుకు ‘జాతీయ ఆహార భద్రత బిల్లు-2013’ను బుధవారం కేంద్ర ఆహార మంత్రి కేవీ థామస్ లోక్సభలో ప్రవేశపెట్టారు. ఈ పథకం రాష్ట్రాల హక్కులకు భంగం కలిగించదని, రాజ్యాంగాన్ని కాపాడుతుందని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.
మరోవైపు.. ప్రస్తుత రూపంలో ‘ఆహార భద్రత’ బిల్లును ఆమోదించేది లేదని, అది రాష్ట్రాల హక్కులను దెబ్బతీస్తుందని డీఎంకే ఎంపీ టీఆర్ బాలు పేర్కొన్నారు. కాగా.. పార్లమెంటు ప్రస్తుత సమావేశాల్లోనే ‘ఆహార భద్రత’ బిల్లు ఆమోదం పొందుతుందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ బిల్లు దేశంలో సామాజిక, వ్యవసాయ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందన్నారు. మరోవైపు.. రాజకీయ కారణాలతో ‘ఆహార భద్రత’ ఆర్డినెన్సును తెచ్చారని, దానిని రద్దు చేయాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. దానిపై పార్లమెంటు నిర్ణయం తీసుకుంటుందని పేర్కొంది.