జిల్లాలో రెండో టోల్‌ప్లాజా
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : నేషనల్ హైవే-44 పై మరో కొత్త టోల్‌ప్లాజా రాబోతోంది. భిక్కనూర్ సమీపంలో ఈ ప్లాజాను నిర్మించేందుకు నేషనల్ హైవేస్ అథారిటీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ హైవేపై జిల్లాలోని ఇందల్వాయి వద్ద ఒక టోల్‌ప్లాజా ఉంది. తదుపరి ప్లాజా మెదక్ జిల్లాలోని తూఫ్రాన్ వద్ద ఉంది. ఆదిలాబాద్-నిజామాబాద్ జిల్లాల సరిహద్దులోని గంజాల్ వద్ద మరొక టోల్ ప్లాజా ఉంది. నిజామాబాద్ నుంచి హైదరాబాద్‌కు వెళ్లే వాహనదారులు త్వరలోనే జిల్లాలోని రెండో టోల్‌ప్లాజాలో పన్ను చెల్లించాలి.
భిక్కనూర్ సమీపంలో నిర్మించే టోల్‌ప్లాజా నమూనాతోపాటు, టోల్గేట్ ఏర్పాటు ఆవశ్యకతను వివరిస్తూ రిపోర్టు పంపించినట్లు నేషనల్ హైవేస్ అథారిటీ అధికారవర్గాల ద్వారా తెలిసింది. నాగపూర్ నుంచి హైదరాబాద్ వరకు నాలుగు లేన్లతో నేషనల్ హైవే-44 విస్తరణ తర్వాత ఈ మార్గం ద్వారా వెళ్లే వాహనాల నుంచి ట్యాక్స్ వసూలు చేసేం దుకు టోల్‌ప్లాజాలు ఏర్పాటు చేశారు. ఇపుడు మరో టోల్‌ప్లాజాతో హైదరాబాద్‌కు వెళ్లేవారిపై మరింత అదనపు భారం పడుతుందని వాహనదారులలో ఆం దోళన వ్యక్తం అవుతోంది.
నిబంధనలు ఎన్నో
సాధారణంగా జాతీయ రహదారులపై ఒక టోల్గేట్ నుంచి కనీసం 60 కిలోమీటర్ల వ్యత్యాసం ఉంటేనే కొత్తగా మరో ప్లాజాను ఏర్పాటు చేస్తారు. ఎన్హెచ్ఏ అధికారులు మాత్రం అలాంటిదేమీ లేదంటున్నారు. నిబంధనల ప్రకారం జాతీయ రహదారి వెడల్పు, విస్తరణ సమయంలో జరిగిన వ్యయాన్ని బట్టి కూడ టోల్‌ప్లాజాలు ఏర్పాటు చేయవచ్చంటున్నారు.
పెట్టుబడి వంటి ఇతర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకు నే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఎన్‌హెచ్-44 పై భిక్కనూర్ సమీపంలో త్వరలోనే టోల్‌ప్లాజా ఏర్పాటు చే సేందుకు తొందరపడుతున్నారు. సుదూర ప్రాంతాలకు వెళ్లే వాహనాల పరిస్థితి ఎలా ఉన్నా, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, డిచ్ పల్లి, భిక్కనూర్ తదితర ప్రాంతాల వాహనదారులకు ఒక రకం గా ఇబ్బందికరమే.
అదనపు భారం
భిక్కనూర్ సమీపంలో నేషనల్ హైవేపై టోల్ ప్లాజా ఏర్పాటు జరిగితే హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలపై ఏటా రూ.36.93 కోట్ల అదనపు భారం పడనుంది. ఇది నేషనల్ హైవేస్ అథారిటీకి అదనపు ఆదాయం గా సమకూరునుంది. ఇప్పటికే ఇందల్వాయి వద్ద ఉన్న టోల్‌ప్లాజాలో నమోదవుతున్న లెక్కల ప్రకారం ప్రతిరోజు 5,2 50 చిన్న, పెద్ద, భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. సగటున రోజుకు రూ.10,25,850 టోల్‌ట్యాక్స్ వసూలు అవుతోంది. ఈ లెక్కన నెలకు రూ.3 కోట్ల 7 లక్షల 75 వేల 500 వస్తుండగా, ఏడాదికి రూ.36 కోట్ల 93 లక్షల 6 వేలు వాహనాల నుంచి టోల్గేట్ నిర్వాహకులు వసూలు చేస్తున్నారు.
ఇందల్వాయి టోల్‌ప్లాజాలో నెలలో సగటున 34,961 కార్లు, జీపులు, వ్యాన్లు ట్యాక్స్‌లు చెల్లిస్తున్నట్ల్లు రికార్డులు చెబుతున్నాయి. మినీబస్సులు, తేలికపాటి వాణిజ్య వాహనాలు 15,279, బస్సులు, ట్రక్కులు 34,152 వెళ్తుండగా హెవీ కన్స్ట్రక్షన్ మెషినరీ, ఎర్త్‌మూవింగ్ యంత్రాలతో పాటు మొత్తం కలిపితే 1,30,842 వాహనాలు జాతీయ రహదారిపై టోల్ట్యాక్స్లు చెల్లిస్తున్నాయి. భిక్కనూర్ సమీపంలో ఏర్పాటు చేసే టోల్‌ప్లాజాకు టెండర్లు నిర్వహిస్తారా? లేదా నేషనల్ హైవేస్ అథారిటీ నిర్వహణ కొనసాగిస్తుందా? అనేది తేలాల్సి ఉంది.