ఎన్ఎస్ఎస్లో ఏం జరుగుతోందో ?
జాతీయ అవార్డులపై వివరాలు లేవు
తూతూ మంత్రంగానే కార్యక్రమాలు
విభాగం పనితీరుపై అసంతృప్తి
విశాఖపట్నం : ఆంధ్ర విశ్వవిద్యాలయం జాతీయ సేవా పథకం విభాగంలో ఏమి జరుగుతోందో ఎవరికీ అంతుబట్టడం లేదు. అడుగడుగుగా గోప్యత కనిపిస్తోంది. ఎన్ఎస్ఎస్లో అత్యుత్తమ అవార్డులుగా పరిగణించే ఇందిరాగాంధీ జాతీయ సేవా పురస్కారాలపై సమాచారం చివరి వరకు గోప్యంగా ఉంచారు. ఏయూ పరిధిలో ముగ్గురికి (ఎన్ఎస్ఎస్ యూనిట్ ప్రోగ్రాం అధికారి ఇ.పి.ఎస్.భాగ్యలక్ష్మి, వలంటీర్లు ఎస్.ఇంద్రజ, ఎం.చంటి) జాతీయ స్థాయి అవార్డులు లభిం చాయి. గురువారం రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో వీరు అవార్డులను స్వీకరించారు. దీనికి సంబంధించిన సమాచారం అక్టోబర్ చివరి వారంలోనే ఏయూ ఎన్ఎస్ఎస్ అధికారులకు అందినప్పటికీ బయటకు వెలువరించలేదు.
అభినందనలు లేవు: జాతీయ స్థాయిలో వర్సిటీకి పేరుతీసుకువచ్చే ఈ అవార్డులు సాధించినపుడు ఉన్నతాధికారులకు తెలియజేయడం, వారి ద్వారా అవార్డు సాధించిన వారిని అభినందించి పంపడం రివాజుగా వస్తోంది. దీనికి భిన్నంగా ఈ సంవత్సరం ఎవరికి అవార్డులు లభించాయనే విషయాన్ని ఎన్ఎస్ఎస్ అధికారులు వెల్లడించలేదు.
ఎందుకీ గోప్యత: అవార్డుల విషయంలో ఈ సంవత్సరం అధికారులు గోప్యంగా వ్యవహరించడం వెనుక కారణాలు తెలియాల్సి ఉంది. గతేడాది వివరాలను వర్సిటీ అధికారులు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. అవార్డులు తీసుకున్న తరువాత ఢిల్లీ ఏపీ భవన్లో విలేకరుల సమావేశంలో విజేతలను వీసీ రాజు స్వయంగా అభినందించారు. అటువంటిది ఈ సంవత్సరం ఎందుకిలా చేశారో? ఎన్ఎస్ఎస్ విభాగమే సమాధానం చెప్పాల్సి ఉంది.
ఇందిరను మరిచారు: ఇందిరాగాంధీ పేరుతో ప్రతీ సంవత్సరం అవార్డులు స్వీకరించడం ఏయూ ఎన్ఎస్ఎస్కు పరిపాటిగా మారింది. అటువంటి ఆమెకు నివాళి అర్పించడాన్ని ఎన్ఎస్ఎస్ అధికారులు విస్మరించారు. అవార్డులు తీసుకుంటున్నామనే సమాచారం ఉన్నప్పటికీ కార్యాలయంలో కనీసం ఇందిర చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించలేదు. ఎన్నో కార్యక్రమాలను అలవోకగా నిర్వహిస్తున్న ఎన్ఎస్ఎస్ విభాగానికి ఇందిర చిత్రపటానికి పూలమాల వేయడం పెద్ద విషయం కాదు. గురువారం ఇందిరమ్మ జయంతి రోజున ఎన్ఎస్ఎస్ అధికారులంతా వర్సిటీ ప్రాంగణంలో ఉన్నప్పటికీ కార్యక్రమం నిర్వహించక పోవడం విడ్డూరం.
అవగాహన కల్పించలేరా?
ఎన్ఎస్ఎస్ వలంటీర్లకు ఇందిరాగాంధీ అవార్డుపై చెప్పే సమయంలోనైనా ఆమె గురించి తెలపాల్సిన అవసరం ఉంది. జయంతి, వర్ధంతులు నిర్వహించడం ద్వారా వలంటీర్లలో ఇందిరాగాంధీ కార్యదక్షత, సేవా నిరతి, పట్టుదలను అలవరచడం సాధ్యమవుతోంది. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులకే శిక్షణ అందించే ఏయూ ఎన్ఎస్ఎస్ విభాగం ఇటువంటి విషయాలను ఎందుకు విస్మరిస్తున్నారు.
తూతూ మంత్రంగా కార్యక్రమాలు
ఏయూ ఎన్ఎస్ఎస్ విభాగం తూతూ మంత్రంగా కార్యక్రమాలను నిర్వహిస్తోందని వర్సిటీ ఆచార్యులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల మెప్పు కోసమే కొన్ని కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని బాహాటంగా విమర్శలు చేస్తున్నారు. కొన్నాళ్లగా చెప్పుకోద గ్గ కార్యక్రమాలు నిర్వహించిన దాఖలాలు లేవని చెబుతున్నారు. విభాగం పనితీరుపై విద్యార్థులు సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.