ప్రేమజంట ఆత్మహత్యాయత్నం
విశాఖపట్నం, కొత్తవలస: ఇందిరాగాంధీ జూ పార్కులో గురువారం ఓ ప్రేమజంట ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. జూ క్యూరేటర్ తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లా కొత్తవలస కొత్త సుంకరిపాలెం గ్రామానికి చెందిన పెదిరెడ్ల రావాలు, లెంక అనూష కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమకు పెద్దలు అంగీకరించర నే అనుమానంతో గురువారం విశాఖపట్నం జూ పార్కుకు వెళ్లి జూ సాగర్ ద్వారం సమీపంలో ముసళ్ల కొలను వద్ద కూల్‌డ్రింక్‌లో పురుగు మం దు కలుపుకొని తాగేశారు. దీంతో అనూష అక్కడికక్కడే స్పృహ కోల్పోయింది.
రావాలు మాత్రం స్పృహలో ఉండి సాయంత్రం 5.30 గంటలకు 108కి ఫోన్ చేశాడు. 108 సిబ్బంది వచ్చిన తర్వాత జూ పార్కు సిబ్బందికి విషయం తెలిసింది. దీంతో క్యూరేటర్ జి.రామలింగం అక్కడికి చేరుకొని పీఎం పాలెం పోలీసులకు సమాచారం అందించారు. సీఐ తిరుపతిరావు వారిని చికిత్స కోసం కేజీహెచ్‌కు తరలించారు. రావాలు గాజువాకలోని ఓ ప్రైవేటు కళాశాలలో అధ్యాపకునిగా పని చేస్తున్నారు. అనూష కొత్తవలసలోని ఓ ప్రైవేటు కళాశాలలో బీఎస్సీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది.