సగం తమిళం సగం కన్నడం
తమిళసినిమా: నటి అంజలి సగం తమిళం, సగం కన్నడం అట. ఈ సగం సగం గొడవేమిటీ, అసలు అంజలి పదహారణాల తెలుగమ్మాయి కదా! అనేగా మీ ప్రశ్న. కట్రదు తమిళ్ చిత్రం ద్వారా తమిళ చిత్రరంగంలోకి ప్రవేశించిన ఈ తెలుగమ్మాయి, అంగాడితెరు, ఎంగేయుమ్ ఎప్పోదుమ్ వంటి చిత్రాలతో కోలీవుడ్ ప్రేక్షకుల మనసులను దోచుకున్నారు. అదే విధంగా తెలుగులోనూ కథానాయకిగా మంచి పేరు సంపాదించుకున్న అంజలి మలయాళంలో తన అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పటికే ఒక చిత్రం ద్వారా మాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయిన అంజలి తాజాగా మరో అవకాశాన్ని అందుకున్నారు.
ఈ సారి జనరంజకమైన పాత్రలో అలరించడానికి సిద్ధం అయ్యారు. ఇండియన్ హాస్యభరిత కథా చిత్రాలలో మలయాళ చిత్రాలలో కామెడీ సహజత్వంగా ఉంటుందని చెప్పవచ్చు. అలాంటి వినోదాత్మక కథా చిత్రంగా రోసాపూ అనే చిత్రం రూపొందుతోంది. వినూ జోసప్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బిజూ మీనన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈయన ఇంతకు ముందు నటించిన మూడు చిత్రాలు 100 రోజులు ప్రదర్శింపబడ్డాయన్నది గమనార్హం. ఈ రోసాపూ చిత్రంలో ఆయనతో పాటు నీరజ్ యాదవ్, శోభన్ షభీర్, దీలీప్పోతన్, అంజలి, శిల్పా మంజునాథ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్ర షూటింగ్ ఈ నెల 23వ తేదీన ప్రారంభమైంది. చిత్రంలో నటి అంజలిని ఎంపిక చేయడం గురించి దర్శకుడు వివరిస్తూ, రోసాపూ చిత్రంలో కథానాయకి సగం తమిళం, సగం కన్నడం భాషలు తెలిసిన అమ్మాయి అని తెలిపారు. ఈ పాత్రకు నటి అంజలి అయితే బాగుంటుందపి ఆమెను ఎంపిక చేశామన్నారు. ఈ పాత్ర చాలా వినోదభరితంగా ఉంటూ కథానాయకునికి పక్కా బలాన్నిచ్చేదిగా ఉంటుందని చెప్పారు. ఇది అంజలి కేరీర్లో ఒక మకుటంగా నిలిచిపోతుందని అన్నారు. కాగా ఇప్పుడు మలయాళం చిత్రాలు కోలీవుడ్, టాలీవుడ్ల్లోనూ అనువాదం అవుతున్నాయి కా బట్టి ఈ రోసాపూ చిత్రాన్ని తమిళం, తెలుగు ప్రేక్షకులు చూసే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు.