రైల్వేస్టేషన్లలో క్లీన్‌నెస్ డ్రైవ్
సాక్షి, ముంబై : ప్రధాని నరేంద్ర మోదీ‘క్లీనర్ ఇండియా’ పిలుపునకు నగర రైల్వే శాఖ స్పందించింది. సెంట్రల్, వెస్టర్న్ రైల్వే అధికారులు తమ పరిధిలోని రైల్వే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచే పన్నుల్లో నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా ఛత్రపతి శివాజీ టర్మినస్, ఠాణే, కల్యాణ్, ముంబై సెంట్రల్, బాంద్రా టర్మినస్, బోరివలి, విరార్ రైల్వే స్టేషన్లలో ‘క్లీన్‌నెస్ డ్రైవ్’ను ప్రారంభించారు. ఆయా స్టేషన్లలో సుమారు 15 ట్రక్కుల చెత్తను తరలించారు. ఈ ప్రత్యేక డ్రైవ్‌లో అందరు అధికారులు భాగస్వాములయ్యారని సెంట్రల్ రైల్వే చీఫ్ పీఆర్వో నరేంద్ర పాటిల్ పేర్కొన్నారు.
చర్చ్‌గేట్‌లో సదస్సు
చర్చ్‌గేట్‌లో మంగళవారం పరిసరాలు- పరిశుభ్రతపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో రైల్వే ఆవరణను పరిశుభ్రంగా ఉంచాల్సిన అవశ్యకత, బాధ్యతను ప్రయాణికులకు వివరించామని పీఆర్వో శరత్ చంద్రాయన్ పేర్కొన్నారు. పశ్చిమ రైల్వేలో అధికారుల బృందం చర్చ్‌గేట్ భవనానంలో పారిశుద్ధ్య చర్యలను పరిశీలించారు. ఇటీవల వెస్టర్న్ రైల్వే హెడ్‌క్వార్టర్స్‌కు కనెక్ట్ అయి ఉన్న స్కైవాక్, కొత్త భవనం మొదటి అంతస్తును పరిశీలించారు. ప్రయాణికుల అవసరాల నిమిత్తం వాటర్ కూలర్లను ఏర్పాటు చేశారు. నిర్మాణంలో ఉన్న మరుగు దొడ్లు, మెట్ల పరిసరాల్లో పారిశద్ధ్య చర్యలను పర్యవేక్షించారు.
చెత్తతొలగింపు
సెంట్రల్ రైల్వే పరిధిలోని కారు షెడ్లు, వర్క్‌షాపుల్లో , టికెట్ బుకింగ్ కార్యాలయాల సమీపంలో పేరుకొనిపోయిన చెత్తను తొలగించారు. గోడలపై అంటించిన అక్రమ బిల్లులు, తదితర అవుట్‌డేటెడ్ కాగితాలను తీసేయించారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జి మెట్లు, స్టేషన్ పరిసరాలను శుభ్రం చేయించారు. రైల్వే పరిసరాలల్లో పాన్‌మసాల, గుట్కా ఇతర త్రా ఉమ్మేసిన వారికి రూ.500 జరిమానా విధిస్తున్నట్లు అధికారి తెలిపారు. దీని వల్ల పరిసరాలు శుభ్రంగా ఉంటాయని అధికారులు పేర్కొన్నారు.