వరి కోతలు వాయిదా వేసుకోండి
రైతులకు ఎన్జీరంగా విశ్వవిద్యాలయం సూచన
సాక్షి, హైదరాబాద్: రాబోయే 5 రోజుల్లో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం సూచించిన నేపథ్యంలో వరికోతలను వాయిదా వేసుకోవాలని ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం రైతులను కోరింది. తాజాగా కురిసిన వర్షాల కారణంగా నీరు నిల్వ ఉన్న పొలాల్లో ఇప్పటికే కోసిన పనలను గట్ల మీదకు చేర్చి ఐదుశాతం ఉప్పు ద్రావణాన్ని పిచికారీ చేసుకోవాలని, పనలు ఆరిన తర్వాత తిరగవేయాలని సూచించింది. మామిడి, బత్తాయి, కూరగాయల సంరక్షణకు సంబంధించి కూడా సూచనలిచ్చింది. ఆ వివరాలివీ.. మామిడిలో పండు ఈగ నివారణకోసం ప్లాస్టిక్ పళ్లెంలో 2 మి.లీ. మిథైల్ యూజినాల్, 3 గ్రాముల కార్బోప్యూరాన్ 3జీ గుళికలను లీటరు నీటిలో కలిపి తోటలో వేలాడదీసినట్లయితే పురుగులు మందు నీటిలో పడి చనిపోతాయి. బత్తాయిలో నల్లి నివారణకు 3 గ్రాములు నీటిలో కరిగే గంధకం లేదా 5 మి.లీ.డైకోఫాల్ను లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.