NHAI Land Acquisition
-
ఆర్ఆర్ఆర్ అలైన్మెంట్ ఖరారు.. పాతరోడ్లను కలుపుతూ 189 కి.మీలతో..
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగు రోడ్డు(ఆర్ఆర్ఆర్) దక్షిణ భాగం 189.23 కి.మీ. నిడివితో నిర్మాణం కానుంది. ఈ మేరకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్హెచ్ఏఐ) అలైన్‌మెంట్‌ను ఖరారు చేసింది. ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగానికి కన్సల్టెంట్‌గా వ్యవహరిస్తున్న ఢిల్లీకి చెందిన ఇంటర్ కాంటినెంటల్ టెక్నోక్రాట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూపొందించిన మూడు అలైన్మెంట్లలో 189.23 కి.మీ. నిడివి ఉన్న అలైన్‌మెంట్‌ను ఎంపిక చేసింది. దీనికి ఈ వారంలో అధికారిక ఆమోదం లభించనుంది. అనంతరం అధికారులు డిటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు(డీపీఆర్) రూపొందించనున్నారు. జలాశయాలు.. చెరువులు.. గుట్టలను తప్పిస్తూ.. రీజినల్ రింగురోడ్డును ప్రతిపాదించిన సమయంలో రాష్ట్ర ప్రభుత్వ అధీనంలోని జాతీయ రహదారుల విభాగం ఓ కన్సల్టెన్సీని నియమించిన విషయం తెలిసిందే. ఆ సంస్థ ప్రాథమికంగా 182 కి.మీ. నిడివితో ఓ అలైన్‌మెంట్‌ను రూపొందించింది. ఆ తర్వాత ప్రాజెక్టు కొంత డోలాయమానంలో పడింది. అంతగా వాహనాల రాకపోకలు లేని మార్గం కావటంతో దక్షిణ భాగానికి నాలుగు వరసల ఎక్స్‌ప్రెస్ వే అవసరం లేదన్న అభిప్రాయం వ్యక్తమైంది. కానీ, ఆ తర్వాత కేంద్రప్రభుత్వం దక్షిణ భాగానికి ఆమోదిస్తూ గత ఆగస్టులో ఢిల్లీకి చెందిన కన్సల్టెన్సీని నియమించింది. ప్రాథమిక అలైన్మెంట్ ఆధారంగానే ఈ సంస్థ క్షేత్రస్థాయిలో పర్యటించి దానికి మార్పుచేర్పులతో మూడు వేరు వేరు అలైన్మెంట్లను రూపొందించింది. ప్రస్తుతం ఉన్న షాద్‌నగర్, కంది, ఆమన్‌గల్.. తదితర రోడ్లలో కొంత భాగాన్ని ఆర్ఆర్ఆర్లోకి చేరుస్తూ రెండు అలైన్మెంట్లను రూపొందించింది. పాత ఎన్సల్టెన్సీ సంస్థ ప్రాథమికంగా రూపొందించిన పూర్తి గ్రీన్‌ఫీల్డ్ అలైన్‌మెంట్‌ను సరిదిద్దుతూ మూడో అలైన్‌మెంటును సిద్ధం చేసింది. ప్రాథమిక అలైన్మెంట్ నిడివిని పెంచనప్పటికీ, దానికి అడ్డుగా ఉన్న చెరువులు, గుట్టలను తప్పిస్తూ మార్పులు చేశారు. భవిష్యత్తులో నిర్మించే పాలమూరు ప్రాజెక్టు కాలువలను దృష్టిలో పెట్టుకుని చిన్న, చిన్న మార్పులు చేశారు. దీంతో పాత అలైన్మెంట్ కంటే దాదాపు ఏడు కి.మీ. అదనపు నిడివితో కొత్త అలైన్మెంట్ ఏర్పడింది. పాత రోడ్లను జత చేస్తూ రూపొందించిన రెండు అలైన్మెంట్లు ఆచరణ సాధ్యం కాదని ఎన్హెచ్ఏఐ తిరస్కరించింది. పూర్తి గ్రీన్‌ఫీల్డ్ మార్గంగా ఏర్పడ్డ మూడో అలైన్‌మెంట్‌ను ఎంపిక చేసింది. రూ.15 వేల కోట్ల వ్యయం? ఉత్తర భాగం నిర్మాణానికి దాదాపు రూ.9,500 కోట్లు ఖర్చవుతాయన్న ప్రాథమిక అంచనా ఉండగా, ఇటీవల కేంద్రం రూ.13 వేల కోట్లతో దానికి బడ్జెట్ రూపొందించింది. రోడ్డు నిర్మాణానికి రూ.8 వేల కోట్లు, భూసేకరణకు రూ.5,200 కోట్లు అవసరమవుతాయని పేర్కొంది. ఈ లెక్కన దక్షిణ భాగానికి రూ.15 వేల కోట్ల వ్యయం అవుతుందని అధికారిక వర్గాల అంచనా. పూర్తిస్థాయి డీపీఆర్ రూపొందించాక స్పష్టత వచ్చే అవకాశముంది. సంగారెడ్డి నుంచి కంది, నవాబ్‌పేట, చేవెళ్ల, షాబాద్, షాద్‌నగర్, ఆమన్‌గల్, మర్రిగూడ, శివన్నగూడ, సంస్థాన్ నారాయణపూర్ మీదుగా చౌటుప్పల్ వరకు నిర్మించే దక్షిణ భాగాన్ని కేంద్రప్రభుత్వం భారత్‌మాల పరియోజన పథకం–2 కింద ఎంపిక చేసింది. -
కడప–రేణిగుంట నాలుగు వరుసల హైవేకు గ్రీన్ సిగ్నల్
సాక్షి, అమరావతి: హైదరాబాద్ నుంచి తిరుపతి, చెన్నైలకు తక్కువ సమయంలోనే వెళ్లేందుకు కడప–రేణిగుంట మధ్య నాలుగు వరుసల హైవేను నిర్మించనున్నారు. రాయలసీమ జిల్లాలకు ముఖ్య రహదారి అయిన ఈ రోడ్డు ప్రస్తుతమున్న రెండు వరుసల నుంచి నాలుగు లేన్లుగా మార్చేందుకు ఎన్హెచ్ఏఐ (నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా) పనులు వేగవంతం చేసింది. త్వరలో టెండర్లు పిలవనున్నారు. ఈ హైవేను కేంద్రం ఇటీవలే గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వేగా గుర్తించింది. ఈ మార్గంలో 3 వంతెనలు, 2 రైల్వే ఓవర్ బ్రిడ్జిలు నిర్మించనున్నారు. రెండో ప్యాకేజీ కింద కడప జిల్లా సిద్ధవటం మండలం మొదలుకుని రైల్వేకోడూరు మండలం వరకు నిర్మించేందుకు అధికారులు నిర్ణయించారు. భూ సేకరణ పనులు వేగవంతంగా సాగుతున్నాయి. గతేడాది అక్టోబర్‌లో ఈ హైవేకు ఎన్‌హెచ్–716 కేటాయించారు. ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి చొరవతో ఎన్హెచ్ఏఐ అలైన్‌మెంట్‌ను ఖరారు చేసింది. కడప వద్ద వైఎస్సార్ టోల్‌ప్లాజా నుంచి రేణిగుంట వరకు 4 లేన్ల నిర్మాణం జరగనుంది. రూ.3 వేల కోట్లతో 133 కి.మీ. మేర నిర్మించనున్న ఈ హైవే నిర్మాణానికి కేంద్రం అంగీకరించడంతో జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు వేగవంతంగా చేస్తోంది. ఒక్క కడప జిల్లాలోనే సుమారు 100 కి.మీ. మేర రహదారి నిర్మించనున్నారు. దీనిని రెండు ప్యాకేజీలుగా విభజించి 1,068 ఎకరాలు సేకరించనున్నారు. వైఎస్సార్ జిల్లా బద్వేలు నుంచి నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టు వరకు 4 లేన్ల రహదారి నిర్మాణానికి డీపీఆర్ సిద్ధమైంది. మొత్తం 138 కి.మీ. మేర రోడ్డు నిర్మాణాన్ని ఎన్హెచ్ఏఐ చేపట్టనుంది. నాలుగేళ్లలో పూర్తి చేస్తాం నాలుగు వరుసల ఈ హైవే టెండర్లను త్వరలోనే పూర్తిచేస్తాం. ఈ ప్రాజెక్టును నాలుగేళ్లలో నిర్మిస్తాం. ఇప్పటికే భూసేకరణ పనులు ప్రారంభించాం. జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. – రామచంద్ర, చీఫ్ ఇంజనీర్, ఎన్‌హెచ్ ప్రాజెక్ట్స్ -
హైకోర్టులో ఏపీ సర్కార్‌కు చుక్కెదురు
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరోసారి హైకోర్టులో చుక్కెదురు అయింది. నేషనల్ హైవే అథార్టీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) తరఫున జరుపుతున్న భూ సేకరణపై న్యాయస్థానం గురువారం స్టే విధించింది. పోరంకి-మచిలీపట్నం జాతీయ రహదారి విస్తరణపై 72మంది బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. ఎన్హెచ్ఏఐ 1956 యాక్ట్ కింద పోరంకి నుంచి మచిలీపట్నం హైవేలో 2009లో భూసేకరణ జరిపి వారికి ఇంతవరకు ఎలాంటి పరిహారం చెల్లించలేదని పిటిషన్ వేశారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఇప్పుడున్న మార్కెట్ వాల్యూ ప్రకారం భూ నిర్వాసితులకు నష్ట పరిహారం చెల్లించాలని పిటిషనర్ తరపు న్యాయవాది రచనా రెడ్డి హైకోర్టును కోరారు. సుమారు ఎనిమిదేళ్లు గడుస్తున్నా ఇంతవరకు ఎలాంటి నష్ట పరిహారం చెల్లించకుండా, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అక్రమంగా అక్కడున్న ఇళ్లన్నీ తొలగించారని పిటిషనర్ పేర్కొన్నారు. కోర్టు తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు ఎలాంటి కూల్చివేతలు, తరలింపు కార్యాక్రమాలు జరపొద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. భూసేకరణకు సంబంధించిన రికార్డులన్నీ సెప్టెంబర్ 5 లోపు ఎన్హెచ్ఏఐ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు హైకోర్టు సమర్పించాలని ఆదేశించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 5కు వాయిదా వేసింది.