బీడీ ఆకు కొనేవారు కరువు
డిమాండు లేక గిడ్డంగుల్లో మగ్గుతున్న వైనం
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా బీడీ ఆకు(తునికాకు)కు గిరాకీ పడిపోయింది. గిరిజనుల ద్వారా సేకరించిన ఈ ఆకును విక్రయించేందుకు అటవీ శాఖ టెండర్లు చేపట్టినా కొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. 2012లో అప్సెట్ ధర కంటే కొందరు వ్యాపారులు 200 శాతం అధిక ధరకు టెండరు కోట్ చేశారు. అయితే మార్కెట్లో ధర పడిపోవడంతో టెండరు వేసినవారు కూడా సరుకు కొనకుండా వదిలేశారు. దీంతో 2012, 2013 సీజన్లలో సేకరించిన దానిలో మూడు లక్షలకుపైగా స్టాండర్డ్ బ్యాగు(ఎస్బీ) గిడ్డంగుల్లో మగ్గుతున్నాయి. ఇదిలావుంటే, రానున్న సీజన్లో సేకరించే ఆకును ఎక్కడ నిల్వ చేయాలో తెలియని పరిస్థితి అటవీశాఖను వేధిస్తోంది.
ఈ ఏడాది మొత్తం 339 యూనిట్ల తునికాకు విక్రయించేందుకు ఇప్పటి వరకూ నాలుగు సార్లు టెండర్లు నిర్వహించగా కేవలం 21 యూనిట్లు(పది శాతం కన్నా తక్కువ) మాత్రమే అమ్ముడయ్యాయి. అయిదోసారి నిర్వహించిన సేల్స్ టెండర్లలో 62 యూనిట్ల విక్రయానికి సంబంధించిన కొటేషన్లను అటవీశాఖ అధికారులు ఆమోదించి ఇప్పటికే ప్రభుత్వానికి సిఫార్సు చేశారు.
కాగా, వ్యాపారుల మధ్య పోటీ ఉన్నప్పటికీ దేశవ్యాప్తంగా డిమాండు పడిపోయిన కారణంగా ఆకును ఎవరూ కొనడంలేదని అధికారులు తెలిపారు. మరోపక్క డిమాండు లేమిని సాకుగా చూపించి కిందిస్థాయి అటవీ సిబ్బంది వ్యాపారులతో కుమ్మక్కై తక్కువ ధరకే సరుకును కట్టబెట్టేందుకు యత్నిస్తున్నారనే విమర్శలు వస్తుండడం గమనార్హం.