కండోమ్‌లు మందులు కావు!
కండోమ్‌లు మందులు కావా? కావనే మద్రాస్ హైకోర్టు చెబుతోంది. ఢిల్లీ హైకోర్టు ఈ విషయంలో గతంలో ఇచ్చిన ఉత్తర్వులను ప్రాతిపదికగా తీసుకుంటే అవి మందులు కావని, అందువల్ల వాటికి ఔషధ ధరల నియంత్రణ ఉత్తర్వుల కింద గరిష్ఠ ధరను ప్రభుత్వం నిర్ణయించలేదని కోర్టు చెప్పింది. టీటీకే ప్రొటెక్టివ్ డివైజెస్ లిమిటెడ్ దాఖలుచేసిన పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ టీఎస్ శివలింగంలతో కూడిన బెంచి విచారించింది. జాతీయ ఔషధ ధరల సంస్థ కండోమ్‌లకు గరిష్ఠ ధర నిర్ణయించడానికి వీల్లేదని తెలిపింది. కేవలం నిర్ధారిత ఫార్ములేషన్లు, డోసేజిలతో కూడిన మందులకు మాత్రమే ఎన్పీపీఏ ధరలు నిర్ణయించగలదన్న విషయం చట్టంలో స్పష్టంగా ఉందని గతంలో ఢిల్లీ హైకోర్టు తెలిపింది. అందువల్ల కండోమ్‌లకు డోసేజి అంటూ ఏమీ ఉండదు కాబట్టి.. వాటి ధరను నిర్ణయించడానికి వీల్లేదని చెప్పింది.
ఎన్పీపీఏ ఇచ్చిన ఉత్తర్వులను పలు కండోమ్ తయారీ సంస్థలు కోర్టులో సవాలు చేశాయి. అందులో భాగంగానే చెన్నైకి చెందిన టీటీకే సంస్థ మద్రాసు హైకోర్టులో కేసు వేసింది. గతంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ప్రస్తావిస్తూ మద్రాసు హైకోర్టు కూడా కండోమ్‌లకు ధర నిర్ణయించే అధికారం ఎన్‌పీపీఏకు లేదని స్పష్టం చేసింది. గరిష్ఠ ధర నిర్ణయించడం వల్ల వాటి ఉత్పత్తిపై దుష్ప్రభావం పడుతుందని, దానివల్ల జనాభా నియంత్రణకు కూడా ఇబ్బంది అవుతుందని కంపెనీలు వాదిస్తున్నాయి. బేసిక్, యుటిలిటీ కండోమ్‌లకు ఒకే ధర సీలింగ్ నిర్ణయిస్తే తమకు చాలా సమస్య తలెత్తుతుందని అన్నాయి.