ఇక ఎన్టీఆర్ కూపన్లు
నరసన్నపేట రూరల్ : కొత్త ప్రభుత్వం కొలవుదీరింది ఇంకేముంది ఇప్పటి వరకు అందని రేషన్ కార్డులు అందేస్తారుులే అని ఎదురు చూసిన లబ్దిదారులకు నిరాశే ఎదురవుతోంది. పాత ప్రభుత్వ విధానంలోనే కొత్తగా ఎన్టీఆర్ ప్రజాపంపిణీ పేరుతో కూపన్లు ప్రభుత్వం సరఫరా చేస్తోంది. పథకం పేరు మార్చి ఆరు నెలలకు సరిపడా కొత్త కూపన్లు అందిస్తుడడంతో లబ్దిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రచ్చబండ వన్లో కూపన్లు అందించిన వారికి ఇప్పటి వరకు కొత్త కార్డులు జారీ కాలేదు.
కుటుంబ సభ్యుల గ్రూపు ఫొటో, ఆధార్ కార్డులతో డిక్లరేషన్ సమర్పించినప్పటికీ హైదరాబాద్ నుంచి కార్డుల ప్రింటింగ్ కాలేదని చెబుతూ వీరికి కార్డులు అందించలేదు. ఈ విధంగానే నరసన్నపేట నియోజకవర్గంలో 3 వేల మంది వరకూ లబ్దిదారులు ఉన్నారు.కొత్తగా కార్డుల కోసం మరో 6 వేల దరఖాస్తులు నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్నాయి. ప్రస్తుతం ప్రతి పనికి రేషన్ కార్డు జిరాక్స్ తప్పనిసరి కావడంతో కొత్త కార్డులు అందించాల్సిందే అంటూ లబ్దిదారులు ఆందోళన చెందుతున్నారు.
అయితే బియ్యం, ఇతర నిత్యవసర సరుకులు ఇస్తున్నాం కదా కార్డు కోసం అంత తొందర ఎందుకు అని రెవెన్యూ సిబ్బంది అంటున్నారు. కార్డుల్లేకపోవడంతో సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకోలేకపోతున్నామని లబ్దిదారులు వాపోతున్నారు. కాగా గత నెలలో నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో 3 వేల మంది లబ్దిదారులకు కూపన్లు అందించారు. డిసెంబర్ వరకూ సరిపడా కూపన్లు లబ్దిదారులకు మంజూరు చేశారు. ఆగష్టు నుంచి ఈ కూపన్లు వినియోగంలోకి వచ్చాయి. కాగా రచ్చబండ -3లో వచ్చిన దరఖాస్తులు పరిశీలన అనంతరం కార్డులు మంజూరు చేయాల్సి ఉంది.
ఈ దశలో మళ్లీ కూపన్లు మాత్రమే సరఫరా చేయడంతో లబ్దిదారులు నిరశన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందంచి కూపన్లు స్థానంలో కార్డులు మంజూరు చేయాలని వినియోగదారులు కోరుతున్నారు.