ఐఎస్ ఉగ్రవాదులు అణు సునామీ సృష్టిస్తారట!
బెర్లిన్: ఇస్లాం రాజ్యస్థాపన పేరిట అరాచకం సృష్టిస్తూ ఇప్పటికీ పాశ్చాత్య ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఐఎస్ఐస్ టెర్రరిస్టులు పాశ్చాత్య దేశాల ప్రజలందరిని మట్టుపెడతారట. ప్రపంచవ్యాప్తంగా ఖలీఫా రాజ్య స్థాపనే లక్ష్యంగా హిందువులు, విగ్రహారాధకులు, నాస్తికులు, యాజిదీలే కాకుండా, షియా ముస్లింలందరిని హతమార్చేందుకు టెర్రరిస్టులు వ్యూహం పన్నుతున్నారట. ఇంతటి మానవ హననానికి బాంబులు, శతఘ్నలు సరిపోవని, అందుకోసం అణ్వాయుధాలను ఉపయోగించుకునేందుకు వారు సమాయత్తమవుతున్నారట. ఈ విషయాలను ఐఎస్ఐఎస్ టెర్రరిస్టులతో పది రోజులు గడిపి, వారితో సుదీర్ఘంగా చర్చలు జరిపి, వారి వ్యూహ ప్రతి వ్యూహాల గురించి క్షున్నంగా తెలసుకున్న మాజీ జర్మన్ ఎంపీ, 75 ఏళ్ల జర్నలిస్ట్ జూర్జెన్ టోడెన్హోఫర్ జర్మన్ టీవీకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
ఐఎస్ఐఎస్ టెర్రరిస్టుల మూలాలను, వారి మనోభావాలను తెలుసుకొని ఓ పుస్తకం రాయడం కోసం టోడెన్హోఫర్ ముందుగా ‘స్కైప్’ ద్వారా వారితో సంబంధాలను నెలకొల్పుకున్నారు. మిడిల్ ఈస్ట్‌లో అమెరికా విధానాలను ఎప్పటికప్పుడు విమర్శిస్తూ మంచి క్రిటిక్‌గా పేరు తెచ్చుకున్నందున టోడెన్హోఫర్ను టెర్రరిస్టులు తమ వద్దకు ఆహ్వానించారు. వారితో పాటు ఇరాక్‌లోని మోసుల్ నగరంలో, పరిసర గ్రామాల్లో పది రోజుల పాటు గడిపారు.
ఇరాక్‌లోని సున్నీలంతా అక్కడి టెర్రరిస్టులకు మద్దతు ఇస్తున్నారని, అంతకుముందు పాలనలో వారు తీవ్రమైన అణచివేతకు గురవడమే అందుకు కారణం కావచ్చని టోడెన్ తెలిపారు. పట్టుబడిన వారిని అతి దారుణంగా చంపి, వాటిని వీడియోలుగా తీయడాన్ని తాను ప్రత్యక్షంగా చూశానని, ప్రజల్లో భీతావహాన్ని సృష్టించడం ద్వారానే వారు ఇరాక్‌లోని పలు నగరాలను, సిరియా ప్రాంతాలను తమ స్వాధీనంలోకి తెచ్చుకోగలిగారని ఆయన చెప్పారు. తాను బ్యాక్ ప్యాక్, స్లీపింగ్ బ్యాగ్‌తో వారివద్దకు వెళ్లానని, తన వద్దనున్న సెల్‌ఫోన్‌ను వారు లాగేసుకున్నారని తెలిపారు. ఈ పది రోజులు నేలపైనే స్లీపింగ్ బ్యాగ్‌లో పడుకున్నానని చెప్పారు. ఐఎస్ఐఎస్ నుంచి పొంచి వున్న ముప్పును పాశ్చాత్య దేశాలు తక్కువగా అంచనా వేస్తున్నారని, వారేమో 50 కోట్ల మందిని చంపడం గురించి ఆలోచిస్తున్నారని అన్నారు.
ఖలీఫా రాజ్యం కోసం వారు పన్నుతున్న వ్యూహాలు భయానకంగా ఉన్నాయని, అణు సునామీని సృష్టించి ప్రపంచాన్ని శవాల దిబ్బగా మార్చడమే వారి లక్ష్యంగా కనిపిస్తోందని 75 ఏళ్ల టోడెన్ తెలిపారు. వారి మనోభావాలనుగానీ, మానసిక పరిస్థితిలోగానీ మార్పులు వచ్చే అవకాశాలు ఏ మాత్రం తనకు కనిపించలేదని అన్నారు. చివరకు వారి వద్ద నుంచి తాను తీవ్ర నిరాశ నిస్పృహలతో వెనక్కి రావాల్సి వచ్చిందని చెప్పారు. మానవ చరిత్రలో ఊహకందని విపత్తును చూడాల్సి వస్తోందన్న భయం కలుగుతోందని అన్నారు. ఆయన అక్కడ గడిపిన పది రోజుల అనుభవాలను వివరిస్తూ ‘ఇన్సైడ్ ఐఎస్-టెన్ డేస్ ఇన్ ది ఇస్లామిక్ స్టేట్’ పేరిట పుస్తకం రాశారు.