తమిళనాడుకు భూకంప ముప్పు
భూకంపంపై నిపుణుల హెచ్చరిక
రిక్టర్‌స్కేల్‌పై 6గా అంచనా
అప్రమత్తం కావాలన్న నిపుణులు
నేపాల్‌లో సంభవించిన భూకంపం వేలాది మందిని పొట్టనపెట్టుకోగా తమిళనాడుకు సైతం ఈ భూకంప ఉపద్రవం పొంచి ఉందని నిపుణులు చెబుతున్నారు. భూకంపంపై తమిళనాడు కూడా అంత సురిక్షితమైనది కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. భూకంప దశల్లో తమిళనాడు మూడవ దశగా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
చెన్నై, సాక్షి ప్రతినిధి:భూకంపాన్ని ఐదు దశలుగా నిపుణులు విభజిం చారు. ఇందులో ఐదవ దశ చాలా తీవ్రంగా ఉంటుందని, ఇందులో తమిళనాడు మూడో దశ పరిధిలో ఉందని అంచనా వేశారు. ఈరకంగా మూడవ దశలో తమిళనాడులో సం భవించే భూకంపం రిక్టర్‌స్కేల్‌పై 6వ నంబర్ సూచించే అవకాశం ఉందని అంటున్నారు. రిక్టర్ స్కేల్‌పై 6వ నంబరు సూచించే స్థాయిలో భూకంపం గనుక సంభవిస్తే చెన్నై, కోవై, మదురై, నాగపట్నం, తంజావూరు, పుదుచ్చేరి తదితర నగరాలపై తీవ్రప్రభావం చూపే అవకాశం ఉందని భావిస్తున్నారు. చెన్నై నగరాన్ని పరిశీలిస్తే లెక్కకు మించి పురాతన కట్టడాలు ఉండగా అదే తీవ్రతతో భూకం పం సంభవిస్తే అవన్నీ నేలమట్టం కావడం ఖాయమని హెచ్చరిస్తున్నారు.
అలాగే చెన్నైలో కొత్తగా నిర్మాణం జరుపుకున్న, జరుపుకుంటున్న ఆకాశహార్మ్యాలు సైతం భూకంపాన్ని తట్టుకునేస్థాయిలో లేవని వారు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అన్నా యూనివర్సిటీ మాజీ డీన్ ప్రొఫెసర్ శాంతకుమార్ మీడియాతో మాట్లాడుతూ, చెన్నైలోని కొత్తగా నిర్మించిన అన్ని నిర్మాణాల్లోనూ కార్‌పార్కింగ్ కోసం భూమి అడుగుభాగంలో స్తంభాలతో ఏర్పాటు చేశారని తెలిపారు. భారీ భవంతులను మోస్తున్న ఈ స్థంభాలు భూకంపాన్ని తట్టుకోగలవా అనే సందేహాలు ఉన్నాయని చెప్పారు.
ఇలా నిర్మించే స్థంభాలు కనీసం ఒక అడుగు వైశాల్యంలో ఉండాలని, పది అంతకు మించి అంతస్థులు కట్టినట్లయితే ఒక మీటరు వైశాల్యంలో స్థంభాలు నిర్మించాల్సి ఉందని చెప్పారు. భూకంపాన్ని తట్టుకునేలా స్థంభాలు నిర్మించాలంటే మొత్తం పెట్టుబడిలో 25 శాతం స్థంభాలకే ఖర్చుచేయాలని అన్నారు. చెన్నై నగరంలో రిక్టర్‌స్కేల్‌పై ఆరో నంబర్ స్థాయికి భూకంపం సంభవిస్తే నగర సముద్రతీర ప్రాంతాలైన అడయారు పరిసరాల్లో తీవ్ర నష్టం సంభవిస్తుందని చెప్పారు. ఎందుకంటే అక్కడి భూమిలోపలి మట్టి చాలా వదులుగా ఉందని తెలిపారు.
సముద్రతీరంలోని అన్ని నిర్మాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం లేకపోలేదని ఆయన అన్నారు. ప్రజా పనుల శాఖ సలహాదారు ఎం రాజీ మాట్లాడుతూ, గత 10 ఏళ్ల కాలాన్ని పరిశీలిస్తే ఏడాదికి రూ.1000 కోట్ల విలువైన నిర్మాణాలు సాగుతున్నాయని అన్నారు. ఈ కొత్త నిర్మాణాలన్నీ భూకంపాన్ని తట్టుకునే పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్నాయని తెలిపారు. దేశస్థాయిలో జరిగిన సర్వేలో తమిళనాడులో కావేరీ, వైగై నదీతీరాల్లో , కన్యాకుమారి సముద్రతీరంలో భూకంపం సంభవించే అవకాశాలు ఉన్నాయని తేలిందని చెప్పారు. దేశం మొత్తం మీద 38 నగరాలు భూకంపాన్ని తట్టుకోలేని ప్రమాద స్థితిలో ఉన్నట్లు తేలిందని నిపుణులు చెప్పారు. భూగోళంలో ఏర్పడుతున్న మార్పులు వల్ల భారత భూభాగం ఈశాన్యదిశగా జరుగుతున్న చెబుతున్నారు.
ఈ పరిణామమే ఈశాన్య భారతంలో భూకంపాలకు దారితీస్తున్నదని, 2005లో ఆక్రమిత కశ్మీర్ ప్రాంతంలో ఏర్పడి భూకంపం ధాటికి 80 వేల మంది మృత్యువాత పడిన విషయాన్ని వారు ఉదహరించారు. 2004లో సంభవించిన భూకంపంలో రిక్టర్‌స్కేలుపై నమోదైన 9.3 తీవ్రత వల్ల 14 దేశాల్లో భూమిలోని పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకున్నాయని వారు చెప్పారు. ఆ తరువాతనే భారతదేశంలో శ్రీనగర్, గువాహుటీలు 5వ దశస్థాయిలో భూకంపానికి గురైనాయని అన్నారు. డిల్లీ నాల్గవ స్థాయిలో, చెన్నై, ముంబయి, కోల్కత్తా మూడోదశ స్థాయిలో ఉన్నట్లు వారు అంచనావేశారు. భూమి అడుగుభాగంలో ఏక్షణమైనా కదలికలు ఏర్పడవచ్చని, భూకంపం చోటుచేసుకోవచ్చని వారు హెచ్చరిస్తున్నారు.
37 మంది ఆచూకీ కోసం ఆందోళన:
ఇదిలా ఉండగా, తమిళనాడు నుండి పర్యాటకులుగా నేపాల్ వెళ్లిన 37 మంది ఆచూకీ లభించక ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రం నుండి మొత్తం 387 మంది నేపాల్ వెళ్లగా వీరిలో 158 మంది చెన్నైకి చెందిన వారు. వీరిలో అధికశాతం సురక్షితంగా తమిళనాడుకు చేరుకున్నారు. అయితే మరో 37 మంది ఆచూకీ లేదు. ఫోన్ ద్వారా కూడా వారి సమాచారం అందకపోవడంతో అధికారుల వద్ద బంధువులు బావురుమంటున్నారు.