ఇదొక ఉద్విగ్న మలుపు
‘దక్షిణాసియాలో చైనా విస్తరణకు ఇంతకాలం పావుగా ఉప యోగపడిన శ్రీలంక అధ్యక్షుడు మహింద రాజపక్స అధ్యక్ష ఎన్నికలలో ఓడిపోయారు. ఇది చైనాకు ఎదురుదెబ్బ. దౌత్యప రంగా భారత్ విజయం. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా జరుపుతున్న భారత పర్యటనకు విశేష ప్రాధా న్యం ఉంద’ని ‘ది జపాన్ టైమ్స్’ పత్రిక వ్యాఖ్యానించింది. ఉప ఖండ దౌత్య సమీకరణలలో రాబోతాయనుకుంటున్న మార్పు లను అంచనా వేస్తూ వెలువడిన వ్యాఖ్య ఇది. ఒబామా పర్య టనకు ఇంతటి ప్రాముఖ్యాన్ని ఇస్తూ ఆ పత్రిక వార్తా కథనం ప్రచురించింది. భారత గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా ఒబామా హాజరు కావడం గురించి ప్రపంచంలో చాలా ప్రముఖ పత్రికలు ఘనమైన అంచనాలతో ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు ఒకరు ఈ ఉత్సవానికి ముఖ్య అతిథిగా హాజరు కావడం ఇదే ప్రథమం. భారత ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని గుర్తించినట్టు చెప్పడమే ఒబామా పర్యటన ఉద్దే శంగా కనిపిస్తున్నదని బీబీసీ అభిప్రాయపడింది. గోధ్రా అల్లర్ల తరువాత మోదీని దేశంలోకి అనుమ తించబోమని అమెరికా ప్రకటించిన సం గతి తెలిసిందే. తొమ్మిదేళ్ల నిషేధం తరువాత గడచిన ఫిబ్రవరిలో నాటి అమెరికా రాయబారి నాన్సీ జె పావెల్ మోదీతో సమావేశమై అమెరికా వైఖరిలో వచ్చిన మార్పును సంకేతించారు.
అమెరికా ప్రభుత్వంలోనే కాదు, అమెరికా పత్రికారంగం లో కూడా మోదీ పట్ల విశేషమైన సానుకూలత కనిపిస్తున్నది. ఇప్పుడు వారి దృష్టిలో మోదీ ‘మాజీ హిందూ యాక్టివిస్ట్’. ఈ మాట ప్రయోగించినది సాక్షాత్తు ‘ది న్యూయార్క్ టైమ్స్’ కావడం విశేషం. కార్నెగి ఇంటర్నేషనల్ శాంతి సంస్థకు చెందిన అష్లే టెల్లిస్ ఈ ఇద్దరు నేతల సమావేశం ఉద్విగ్నతతో కూడిన మలుపు అని, నేటి ప్రపంచ రాజకీయాలలో కనిపించని ఒక కొత్త కోణాన్ని చూపుతున్నారు. హిందూ మహాసముద్రంలో చైనా విస్తరణ వల్ల ఈ ప్రాంతంలో భారత్, అమెరికాల ప్రయో జనాలకు భంగం వాటిల్లే వాతావరణం ఏర్పడింది. చైనా కొమ్ము కాస్తున్న రాజపక్సను మూడోసారి అధ్యక్షునిగా ఎన్నిక కాకుండా నిరోధించడంలో ఎవరిది పెద్ద పాత్ర? భారతదేశా నిదా? అమెరికాదా? ఇప్పుడు ఇది చెప్పడం కష్టమని కూడా న్యూయార్క్ టైమ్స్ నర్మగర్భంగా వ్యాఖ్యానించింది. గడచిన సెప్టెంబర్‌లో మోదీ అమెరికాలో పర్యటించినపుడే నాణ్యమైన విద్యుత్, వాణిజ్యం, రక్షణ అంశాలను గురించి ప్రాథమికంగా చర్చలు జరిపారు. నిజానికి ఈ నేతలిద్దరి మధ్య ఏర్పడిన అను బంధం ఒబామా భారత్ పర్యటన సందర్భంగా జరిపే చర్చల మీద ప్రతిఫలిస్తుందని అష్లేను ఉటంకిస్తూ న్యూయార్క్ టైమ్స్ పేర్కొన్నది. ఒబామా సాధారణంగా ప్రపంచ దేశాల అధినేత లతో కలివిడిగా ప్రవర్తించరని, కానీ మోదీ ఇందుకు మినహా యింపు అని, ఆ ఇద్దరు నాయకుల జీవితానుభవాలలో ఉన్న కొన్ని సారూప్యతలే ఇందుకు కారణమని కూడా ఆ పత్రిక విశ్లేషించింది. చాలా ఒదిగి ఉండే ఒక నేపథ్యంలో ఆ ఇద్దరి జీవితాలు ఆరంభమైనాయని ఆ పత్రిక పేర్కొన్నది.
మోదీ ప్రధాని అయిన తరువాత ప్రపంచంలోని ఆ రెండు పెద్ద ప్రజాస్వామిక దేశాల (భారత్, అమెరికా) అధినేతలు బాగా దగ్గరయ్యారని ఇంగ్లండ్‌కు చెందిన ‘ది గార్డియన్’ పత్రిక వ్యాఖ్యానించింది.