బోగస్ బాగోతం
విద్యాశాఖలో రూ.230 కోట్ల దుర్వినియోగం
కర్నూలు(జిల్లా పరిషత్): జిల్లా విద్యాశాఖ అధికారుల తీరు మయసభను తలపిస్తోంది. లేని విద్యార్థులను ఉన్నట్టు చూపి... వారి కోసం మధ్యాహ్న భోజన పథకం, యూనిఫామ్స్, పాఠ్యపుస్తకాల కోసం విడుదల చేసే నిధులను భోంచేస్తున్నారు. ఈ విధంగా జిల్లావ్యాప్తంగా పాఠశాలకే రాని సుమారు లక్ష మంది విద్యార్థులకు విడుదల చేసిన రూ. 230 కోట్ల నిధులను అధికారులు పక్కదారి పట్టించారు.
ఆధార్ సీడింగ్ ప్రక్రియతో ఈ బాగోతం బయటపడింది. అయినప్పటికీ ఇవేవీ తమకు తెలియనట్టు భూప్రపంచం మీద ఎక్కడా లేని లక్ష మంది విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకానికి అవసరమైన నిధులను యథావిధిగా విడుదల చేస్తుండటం గమనార్హం.
ఒక్కో విద్యార్థిపై రూ. 23 వేలు!
రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో విద్యార్థిపై ప్రతి సంవత్సరం రూ.23 వేల దాకా ఖర్చు చేస్తోంది. ఇటీవల చేపట్టిన ఆధార్ సీడింగ్‌లో జిల్లాలో దాదాపు లక్ష మంది విద్యార్థులున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఈ లెక్కన జిల్లాలో ప్రతి యేటా రూ.230 కోట్లు పక్కదారి పడుతున్నాయి. ఈ మొత్తమంతా ఎవరి జేబుల్లోకి వెళ్తుందనేది నేడు ప్రశ్నార్థకంగా మారింది. ఈ విషయమై ప్రతి ఒక్కరూ తేలు కుట్టిన దొంగల్లా వ్యవహరిస్తున్నారు. జిల్లా విద్యాశాఖ, సర్వశిక్ష అభియాన్లలో ఈ విషయం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.
తప్పు మీదంటే మీదంటూ రెండు శాఖలు కారాలు మిరియాలు నూరుతున్నాయి. దీంతో పాటు విద్యార్థుల సంఖ్యపై పూటకో లెక్క చెబుతూ గందరగోళానికి తెరతీస్తున్నారు. బోగస్ విద్యార్థుల ఉదంతాన్ని కప్పి పుచ్చుకోవడానికి ప్రైవేటు యాజమాన్యాల్లోని విద్యార్థులను ప్రభుత్వ యాజమాన్యాల్లోకి చూపిన విషయం ఇటీవల వెలుగులోకి వచ్చిన విషయం విదితమే. ఏటా వందల కోట్ల రూపాయలు దుర్వినియోగం అవుతున్నా ఏ ఒక్క అధికారీ ఈ విషయమై విచారణ చేసిన పాపాన పోలేదు.
జిల్లాలో 53 ప్రభుత్వ, 113 మున్సిపాలిటి, 1,663 మండల పరిషత్, 103 ఎయిడెడ్ పాఠశాలలున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో 3,882, మున్సిపాలిటి పాఠశాలల్లో 10,174, ఎంపీపీ పాఠశాలల్లో 1,50,332 మంది విద్యార్థులు ఉన్నారు. ఇవే గాక 2 ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలల్లో 265 మంది, 11 మున్సిపాలిటి ప్రాథమికోన్నత పాఠశాలల్లో 2,343 మంది, 440 మండల పరిషత్ పాఠశాలల్లో 70,177 మంది, 25 ఎయిడెడ్ పాఠశాలల్లో 4,184 మంది విద్యార్థులు ఉన్నారు.
ఇక 25 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 15,266 మంది, 16 మున్సిపల్ పాఠశాలల్లో 8,688 మంది, 335 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో 1,17,622 మంది, 45 ఎయిడెడ్ పాఠశాలల్లో 10,714 మంది విద్యార్థులు ఉన్నట్లు లెక్కలు తేల్చారు. అంటే ఈ పాఠశాలల్లో మొత్తం విద్యార్థుల సంఖ్య 4,04,296 మంది ఉన్నారు. ఇప్పటిదాకా విద్యార్థుల ఆధార్ సీడింగ్ 85 శాతం వరకు చేర్చారు. ఈ ఆధార్ నెంబర్లను పరిశీలించగా కొన్ని చోట్ల ఒకే నెంబర్‌ను ఇద్దరు, ముగ్గురు విద్యార్థులకు నమోదు చేసినట్లు వెల్లడైంది.
4 లక్షల మంది విద్యార్థుల్లో 15 శాతం విద్యార్థులు ఆధార్ సీడింగ్ చేయలేదంటే 60 వేల మంది విద్యార్థులు ఏమయ్యారో విద్యాధికారులే చెప్పాలి. ఇందులోనూ మరో పది శాతానికి పైగా వెరిఫికేషన్‌లో బోగస్ విద్యార్థులు బయటపడే అవకాశం ఉందని ఓ అధికారి తెలిపారు. దీంతో మొత్తం లక్ష మందికి పైగా జిల్లాలో బోగస్ విద్యార్థులు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
యేటా దుర్వినియోగం
జిల్లాలో ఒక్కో విద్యార్థిపై మధ్యాహ్న బోజనం కోసం పెడుతున్న ఖర్చు దాదాపు రూ.6. ఈ లెక్కన లక్ష మంది విద్యార్థులకు 200 రోజులకు రూ.12 కోట్లు నిధులు దుర్వినియోగం అవుతున్నట్లు తెలుస్తోంది. ఇక యూనిఫాం విషయానికి వస్తే ఒక్కో విద్యార్థికి రూ.400 చొప్పున ఖర్చు పెడుతున్నారు. ఈ లెక్కన లక్ష మంది విద్యార్థులకు రూ.4 కోట్లు, పాఠ్యపుస్తకాల రవాణాకు ఒక్కొక్క విద్యార్థికి రూ.100 చొప్పున రూ.కోటి, విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఇప్పటికే 3 వేలకు పైగా అదనపు తరగతి గదులు ఉన్నట్లు సమాచారం.
ఒక్కో నిర్మించిన అదనపు గదుల్లో ఒక్కో దానికి రూ.6.5 లక్షల చొప్పున తీసుకుంటే దాదాపు రూ.200 కోట్లకు పైగా ఇప్పటికే నిధులు ఖర్చు చేసినట్లు ఈ లెక్కలను బట్టి అర్థమవుతోంది. ఈ లెక్కన ప్రతి యేటా వందల కోట్ల రూపాయలను జిల్లా విద్యాశాఖ, సర్వశిక్ష అభియాన్ అధికారులు, మండల విద్యాధికారులు, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు కలిసి దుర్వినియోగం చేస్తున్నారన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
కర్నూలు మండలంలోనే రూ.5.50 కోట్లు దుర్వినియోగం
కర్నూలు మండలంలోని ప్రభుత్వ, ప్రాథమికోన్నత పాఠశాలల్లో విద్యార్థుల వివరాలను అధికారులు ఆన్లైన్లో ఉంచారు. వారి లెక్కల ప్రకారమే బోగస్ విద్యార్థుల సంఖ్య బహిర్గతమైంది.
గత జులైలో మండల వ్యాప్తంగా యూనిఫాం పొందిన విద్యార్థుల సంఖ్య 15,652.
సెప్టెంబర్ నాటికి యుడైస్లో చూపిన విద్యార్థుల సంఖ్య 12,764.
చైల్డ్ ఇన్ఫోలో పేర్లు నమోదు చేసిన విద్యార్థుల సంఖ్య 10,431
ఆధార్ నెంబర్లతో అనుసంధానం చేసిన విద్యార్థుల సంఖ్య 9,164
ఆధార్ నెంబర్లు వెరిఫికేషన్ చేయగా మిగిలిన విద్యార్థుల సంఖ్య 7,733
అంటే కర్నూలు మండలంలో ప్రస్తుతం అధికారుల లెక్కల ప్రకారం ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 7,919 మంది విద్యార్థులు బోగస్ అని తేలింది.
ఈ లెక్కన 7,919 మంది విద్యార్థులకు రెండు జతల యూనిఫాంకు రూ.400 చొప్పున అయ్యే వృధా ఖర్చు రూ.31,67,600
పాఠ్యపుస్తకాల సరఫరా రవాణాకు అయిన ఖర్చు 7,919 మంది విద్యార్థులకు రూ.100 చొప్పున రూ.7,91,900
మధ్యాహ్న బోజన పథకానికి ఒక్కో విద్యార్థికి యేడాదిలో 200 రోజులకు 7,919 మంది విద్యార్థులకు రూ.6 చొప్పున రూ.95,02,800.
విద్యార్థుల సంఖ్యను చూపి నిర్మించిన అదనపు తరగతి గదులకు అయిన ఖర్చు రూ.4 కోట్లకు పైగానే ఉంది.
ఈ లెక్కన ఒక్క కర్నూలు మండలంలోనే రూ.5.50 కోట్లకు పైగానే నిధులు వృధా అవుతున్నట్లు తేలింది.
దీంతో పాటు విద్యార్థుల సంఖ్యను ఆధారంగా చేసుకుంటే అవసరంలేని ఉపాధ్యాయుల సంఖ్య సరేసరే.