సర్ప్రైజ్.. ప్రభుత్వ పెద్దలకే తెలియదు!
- విరామం లేకుండా కొత్త నోట్ల ముద్రణ
న్యూఢిల్లీ: పాత కరెన్సీ నోట్ల రద్దు చేస్తున్నట్లు మంగళవారం రాత్రి ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన కొద్ది సేపటికే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ), కేంద్ర ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు ఢిల్లీలో కీలక మీడియా సమావేశం నిర్వహించారు. అవినీతిని రూపుమాపడమే కాక ఆర్థిక స్వావలంబన సాధించేందుకే పాత నోట్లు రద్దుచేసి, కొత్తవాటిని తీసుకొస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ చెప్పారు. నవంబర్ 10(గురువారం) నుంచి కొత్త రూ.500, రూ.2000 నోట్లను ప్రజలకు అందుబాటులోకి తెచ్చే క్రమంలో రిజర్వ్ బ్యాంక్ వర్గాలు తీవ్రంగా కష్టపడుతున్నాయని, క్షణం విశ్రాంతి లేకుండా నోట్లను ముద్రిస్తున్నామని తెలిపారు. పాత నోట్ల రద్దుతో హోల్ సేల్ వ్యాపారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని ఆయన అన్నారు.
సర్ప్రైజ్.. ప్రభుత్వ పెద్దలకే తెలియదు!
పాత నోట్ల రద్దుపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి శక్తికాంత్ దాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆశ్చర్యకరమైన ఈ నిర్ణయం గురించి ప్రధానమంత్రి, ఆర్థిక మంత్రి, ఆర్బీఐలోని అతికొద్ది మంది ముఖ్యులకు తప్ప కనీసం ప్రభుత్వ పెద్దలకు కూడా ఏమీ తెలియదని, నోట్ల రద్దు నిర్ణయాన్ని పకడ్బందీగా వెల్లడించాలనే ఉద్దేశంతోనే సమాచారాన్ని గోప్యంగా ఉంచామని శక్తికాంత అన్నారు.
బ్యాంకులు, పోస్ట్ ఆఫీసుల ద్వారా పాత నోట్లను సేకరిస్తామన్న ఆర్థిక శాఖ కార్యదర్శి.. ఆమేరకు అవసరమైన ఏర్పాట్లపై అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీచేస్తామన్నారు. బుధవారం బ్యాంకులు మూసివేస్తామని, గురువారం నుంచి కొత్త కరెన్సీ నోట్లు అందుబాటులోకి వస్తాయని స్పష్టం చేశారు. అన్ని రాష్ట్రాలకూ హెల్ప్ లైన్స్ ఏర్పాటుచేశామని, సామాన్యులకు ఇబ్బంది కలుగకుండా ప్రక్రియను పూర్తిచేస్తామని తెలిపారు.