పాఠంలో పాత మ్యాపే!
తొమ్మిదో తరగతి పాఠ్యపుస్తకంలో తెలంగాణ లేకుండానే దేశ పటం
సాక్షి, నిజామాబాద్: తెలంగాణ ఆవిర్భవించి మూడేళ్లు దాటినా ప్రత్యేక రాష్ట్రంగా గుర్తించడంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు నిర్లక్ష్యం చేయడం విమర్శలకు దారి తీస్తోంది. తొమ్మిదో తరగతి సెంట్రల్ సిలబస్ సోషల్ సైన్స్ పుస్తకంలోని భారతదేశ పటంలో తెలంగాణను రాష్ట్రంగా ముద్రించలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్నే ముద్రించారు.
తొమ్మిదో తరగతి కాంటెంపరరీ ఇండియా–1 (జియోగ్రఫీ) పుస్తకంలో ఐదో పేజీలో ఇండియా అండ్ ఎడ్జేసేంట్ కంట్రీస్ పటం ఉంది. ఇందులో తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా చూపలేదు. ఎన్సీఈఆర్టీ 2006లో మొదటిసారిగా ఈ పుస్తకాన్ని ముద్రించింది. 2016లో పదోసారి రీప్రింట్ సమయంలో పుస్తకంలోని పటాల్లో తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఎన్సీఈఆర్టీ చూపకపోవడం పట్ల విద్యావేత్తలు పెదవి విరుస్తున్నారు.