తమ్ముడి పరీక్ష రాస్తూ పట్టుబడిన అన్నయ్య
ఇంటర్ ఫస్ట్ఇయర్ ఇంగ్లిష్ పరీక్షకు 94.47 శాతం హాజరు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్లో గట్టెక్కించ్చేందుకు తమ్ముడి పరీక్ష రాసిన అన్నయ్య కటకటాల పాలయ్యాడు. నగరంలోని గోకుల్ జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. చంచల్గూడలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జూనియర్ ఇంటర్ చదువుతున్న జాఫర్ అలీ ఇంగ్లిష్ పరీక్షను గండిపేట్ ఎంబీఐటీలో బీటెక్ చదువుతున్న అస్దర్అలీ రాశాడు. అనుమానం వచ్చిన చీఫ్ సూపరింటెండెంట్ హాల్‌టికెట్‌ను తనఖీ చేశారు. అందులోని ఫొటోకు, పరీక్ష రాస్తున్న అస్దర్కు పోలిక లేకపోవడంతో అతడిని నిలదీశారు.
దీంతో తన తమ్ముడి కోసం పరీక్ష రాసేందుకు వచ్చినట్లు ఒప్పుకున్నాడు. కళాశాల ప్రిన్సిపాల్ ఫిర్యాదు మేరకు సైదాబాద్ పోలీసులు అస్దర్ను అదుపులోకి తీసుకున్నారు. అతడిపై 491, 420 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని, శనివారం రిమాండ్‌కు తరలిస్తామని పోలీసులు తెలిపారు. కాగా, వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న హాల్‌టికెట్ తెచ్చినా పరీక్షకు అనుమతించాలని ఇంటర్‌బోర్డు కార్యదర్శి వారం రోజులుగా మొత్తుకుంటున్నా... క్షేత్ర స్థాయిలో అధికారులు మాత్రం పెడచెవిన పెడుతున్నారు.
కరీంనగర్ జిల్లా ఎన్టీపీసీ జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రంలో వెబ్సైట్ హాల్‌టికెట్ తెచ్చిన ఓ విద్యార్థిని పరీక్షా కేంద్రం అధికారులు లోనికి అనుమతించలేదు. అలాగే.. మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట పరీక్షా కేంద్రంలో ఫర్నిచర్ లేక విద్యార్థులు నేలపైనే కూర్చొని రాయాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇంటర్‌బోర్డు నుంచి వెళ్లిన ప్రత్యేక పరిశీలకులే ఈ దృశ్యం చూసి దిగ్భ్రాంతి చెందారు.
94.47 శాతం హాజరు: శుక్రవారం జరిగిన ఇంటర్మీడియెట్ ఫస్టియర్ ఇంగ్లిష్ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 94.47 శాతం హాజరు నమోదైంది. మొత్తం 5,08,415 మందికి గాను 4,80,312 మంది హాజరయ్యారు. మొత్తం ఐదు మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు.