కంటి వైద్యుడి నుంచి కర్కశ నియంత దాకా..
బీరూట్: రెండు పుష్కరాల క్రితం అన్యమనస్కంగా అధ్యక్ష పీఠంపై కూర్చున్న అసద్ తదనంతరకాలంలో నిరంకుశ నేతగా ఎదిగిన వైనం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. డమాస్కస్ మెడికల్ కాలేజీలో చదివిన అసద్ తర్వాత ఆప్తమాలజీ చదివేందుకు బ్రిటన్ వెళ్లి అక్కడే స్థిరపడ్డాడు. అసద్ తొలినాళ్లలో లండన్‌లో నేత్ర వైద్యునిగా సేవలందించేవారు. 1971 సంవత్సరం నుంచి సిరియాను తన ఉక్కుపిడికిలి కింద పాలిస్తున్న తన తండ్రి హఫీజ్ మరణంతో 2000 సంవత్సరంలో అసద్ స్వదేశం తిరిగొచ్చాడు. సానుభూతిపరుల మద్దతుతో అయిష్టంగానే అధ్యక్ష పీఠంపై కూర్చున్నారు. అప్పటికి ఆయన వయసు కేవలం 34 సంవత్సరాలు. అధ్యక్ష పదవికి కనీస అర్హత వయసు అయిన 40 ఏళ్లుకూడా నిండకపోవడంతో ఈయన కోసం పార్లమెంట్లో చట్టసవరణ చేశారు. నిజానికి హఫీజ్ తన పెద్ద కుమారుడు బస్సెల్ను తన వారసునిగా చూడాలనుకున్నారు. అయితే 1994లో కారు ప్రమాదంలో బస్సెల్ మరణించడంతో అసద్ అసలైన వారసుడయ్యారు. 2011దాకా అసద్ పాలనపై పెద్దగా విమర్శలు రాలేదు. కానీ అరబ్ విప్లవం మొదలయ్యాక 2011 మార్చిలో అసద్ పాలనను వ్యతిరేకిస్తూ ప్రజలు డమాస్కస్, డేరా నగరాల్లో వీధుల్లోకి వచ్చి ఉద్యమాలు చేశారు. వీటిని అసద్ సర్కార్ ఉక్కుపాదంతో అణచివేసింది. ఆనాటి నుంచి అసద్ నిరంకుశ పాలనకు తెరలేపారు. మానవహక్కుల ఉల్లంఘన, అక్రమ అరెస్ట్‌లు, జనంపైకి రసాయన ఆయుధాల ప్రయోగం, కుర్దులను అణగతొక్కడం, ప్రభుత్వ ఆధ్వర్యంలో కిడ్నాప్‌లు, హత్యలు వంటి అరాచకాలు ఆనాటి నుంచి నిత్యకృత్యమయ్యాయి. ఆ తర్వాతి ఏడాది అలెప్పో సిటీలో ఘర్షణలు పెరిగాయి. తిరుగుబాటుదారులు నగరాన్ని ఆక్రమించుకోగా నాలుగేళ్లు కష్టపడి సైన్యం తిరిగి స్వాధీనంచేసుకుంది. ఆ తర్వాత తూర్పు ఘాతాలో ప్రభుత్వం జరిపిన రసాయన ఆయుధ దాడిలో ఏకంగా వందలాది మంది అమాయక పౌరులు చనిపోయారు. దీంతో ఐసిస్ ఉగ్రసంస్థ విజృంభించి రఖాను స్వాధీనం చేసుకుంది. 2019దాకా ఐసిస్ పట్టుకొనసాగింది. అయితే 2015 సెప్టెంబర్‌లో రష్యా రాకతో అసద్ బలం పుంజుకున్నారు. అయితే 2017 ఏప్రిల్‌లో అసద్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అమెరికా సేనలు పరోక్షంగా రంగ ప్రవేశం చేశాయి. 14 ఏళ్ల అంతర్యుద్ధానికి ముగింపు పలుకుతూ గత నెల 27న ఇడ్లిబ్ సిటీ ఆక్రమణతో మొదలైన తిరుగుబాటుదారుల జైత్రయాత్ర రాజధాని డమాస్కస్దాకా కొనసాగడంతో 59 ఏళ్ల అసద్ పలాయనం చిత్తగించక తప్పలేదు. అసద్ పాలనలో దాదాపు ఐదు లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. అంతర్యుద్ధం కారణంగా 11 లక్షల మంది సిరియాను వదిలి విదేశాలకు శరణార్థులుగా వలసవెళ్లారు. అసద్‌కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.