‘గోవాడ’ను బాబు అమ్మజూశారు
వైఎస్ జీవం పోశారు
వడ్డాదిలో వైఎస్ విజయమ్మ
చోడవరం, న్యూస్‌లైన్: గోవాడ సుగర్ ప్యాక్టరీని చంద్రబాబు అమ్మేయాలని ప్రయత్నించారని వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. బుచ్చెయ్యపేట మండలం వడ్డాది శనివారం జరిగిన ప్రచార సభలో ఆమె మాట్లాడారు. తొమ్మిదేళ్ల పాలనలో చంద్రబాబు రైతులను పూర్తిగా విస్మరించారని, ఇప్పుడు వారిపై మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆరోపించారు. సహకార సుగర్ ఫ్యాక్టరీలను చంద్రబాబు నిర్వీర్యం చేశారని ధ్వజమెత్తారు.
రాజశేఖరరెడ్డి వచ్చి ఫ్యాక్టరీలకు జీవం పోశారని చెప్పారు. జగన్‌బాబు కూడా తండ్రి ఆశయ సాధనలో రైతులకు అండగా ఉంటారన్నారు. ఎంపీ అభ్యర్థి గుడివాడ అమర్ మాట్లాడుతూ ప్రజలకు అండగా ఉండే జగనన్నను ముఖ్యమంత్రిని చేయాలన్నారు. రాష్ట్రాన్ని ముక్కలు చేయడంలో కీలకపాత్ర పోషించిన టీడీపీ నాయకులు ఇప్పుడు జిల్లాను ముక్కలు చేస్తానని ప్రకటనలు చేస్తున్నారని పరోక్షంగా అవంతి శ్రీనివాస్‌పై ధ్వజమెత్తారు.
చోడవరం అభ్యర్థి ధర్మశ్రీ మాట్లాడుతూ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయకుండా సొంత ప్రయోజనాల కోసమే పాకులాడిన టీడీపీ నాయకులను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. మాజీ మంత్రి బలిరెడ్డి సత్యారావు మాట్లాడుతూ మహానేత తనయుడ్ని ముఖ్యమంత్రిని చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మాజీ ఎమ్మెల్యే గూనూరు మిలట్రీనాయుడు మాట్లాడుతూ ప్రజలను మోసం చేయడమే బాబు ధ్యేయమన్నారు. అనంతరం విజయమ్మ సమక్షంలో చోడవరం మండలం శ్రీరాంపట్నం సర్పంచ్ పండూరి సత్యవతి వైఎస్సార్సీపీలో చేరారు.
వైఎస్సార్ సీపీ అభ్యర్థులను గెలిపించండి
దేవరాపల్లి సభలో విజయమ్మ మాట్లాడుతూ అనకాపల్లి ఎంపీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ను, మాడుగుల నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి బూడి ముత్యాలునాయుడును గెలిపించి రాజ న్న రాజ్యాన్ని తిరిగి తీసుకురావాలని కోరారు.