పలు మార్గాల్లో నేడు మెగాబ్లాక్
ముంబై సెంట్రల్, న్యూస్‌లైన్: సెంట్రల్, హార్బర్ రైల్వే మార్గాలపై ఆదివారం ఉదయం 11.00 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు మెగాబ్లాక్ నిర్వహించనున్నారు. ఈ సమయంలో రైల్వే ట్రాక్‌లు, ఓవర్ హెడ్ వైర్ల మరమ్మతు పనులు చేపడతారు.
తత్ఫలితంగా కొన్ని లోకల్ రైళ్ల సేవలను రద్దు చేయగా, మరికొన్నింటిని ఇతర మార్గాల మీదుగా మళ్లిస్తారు. అలాగే కొన్ని ప్రత్యేక రైళ్లను కూడా నడపనున్నారు. ఈ విషయాన్ని శనివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో సెంట్రల్, హార్బర్ రైల్వే ప్రజాసంబంధాల అధికారులు వెల్లడించారు.
సెంట్రల్మార్గంలో...
ములుండ్-మాటుంగా స్టేషన్ల మధ్య అప్ స్లో లైన్లో మెగాబ్లాక్ నిర్వహించనున్నారు. దీంతో ఠాణే తర్వాత రైళ్లను మాటుంగా వరకు ఫాస్ట్ ట్రాక్‌పై మళ్లిస్తారు. ఈ కారణంగా ఈ మార్గంలో ములుండ్, భాండుప్, విక్రోలి, ఘాట్కోపర్, కుర్లా, సైన్ స్టేషన్లలో మాత్రమే రైళ్లు ఆగుతాయి. మాటుంగా తర్వాత మళ్లి స్లో లైన్లో నడుపుతారు. అదేవిధంగా డౌన్ ఫాస్ట్ లైన్లో రైళ్లు ఘాట్కోపర్, విక్రోలి, భాండుప్, ములుండ్ స్టేషన్లలో నిలుపుతారు. అప్ స్లో లైన్లో నాహుర్, కాంజుర్మార్గ్, విద్యావిహార్ స్టేషన్లలో ఆగుతాయి. ఈ రైళ్లన్నీ 15 నిమిషాలమేర ఆలస్యంగా నడుస్తాయి.
హార్బర్మార్గంలో...
హార్బర్ మార్గంలో పన్వెల్-నెరూల్ స్టేషన్ల మధ్య లోకల్ రైలు సేవలను రద్దు చేయనున్నారు. అదేవిధంగా ట్రాన్స్‌హార్బర్ లైన్లో పన్వెల్-నెరూల్ స్టేషన్ల మధ్య కూడా రద్దు చేయనున్నారు. పన్వెల్-అంధేరీ మధ్య సేవలు ఉండవు. అయితే ప్రయాణికులు అసౌకర్యానికి గురికాకూడదనే ఉద్దేశంతో సీఎస్టీ-నెరూల్, ఠాణే-నెరూల్ సెక్షన్ల మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతారు.