ఇద్దరు మాజీ మావోయిస్టుల అరెస్ట్
హాలియా, న్యూస్‌లైన్ :పీఏపల్లి మండలానికి చెందిన ఇద్దరు మాజీ మావోయిస్టులను సోమవారం హాలియా పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచారు. సీఐ ఆనంద్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 15వ తేదీన మండలంలోని అలీనగర్ వద్ద ఎస్ఐ విజయ్‌ప్రకాశ్ ఐడీ పార్టీ సిబ్బందితో కలిసి వాహనాలను తనిఖీ చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. వారిని ఆపి తనిఖీ చేయగా 2 తుపాకులు, 12 రౌండ్ల తూటాలు లభించాయి. వీరిని వెంటనే కస్టడీలోకి తీసుకుని విచారించారు. గుండెబోయిన శ్రీరాములుది పీఏపల్లి మండ లం తిరుమలగిరి కాగా, తోటకూరి శేఖ ర్ది ఘనపురం గ్రామమని, వీరు గతం లో కృష్ణపట్టె దళంలో పని చేసినట్లు సీఐ తెలిపారు.
2004లో ప్రభుత్వం నక్సలైట్లతో చర్చలు జరుపుతున్న సమయంలో ఘనపురం గ్రామానికి చెందిన రవీందర్‌రెడ్డిని కృష్టపట్టె దళం హతమార్చింది. ఈ సంఘటనలో ఈ ఇద్దరూ పాల్గొన్నారు. అదే విధంగా 2010లో నిడమనూరు మండలం బొక్కమంతలపాడుకు చెందిన ఓ వ్యక్తిని నక్సలైట్లమని చెప్పి అతని నుంచి డబ్బులు వసూలు చేసిన కేసులోనూ వీరు నిందితులుగా ఉన్నారు. దళంలో పని చేసే సమయంలో వీరు రెండు తుపాకులను దాచిపెట్టుకున్నారు. దళం నుంచి బయటకు వచ్చిన వీరిద్ద రూ ఇటీవల నక్సలైట్ల పేరుతో డబ్బులు వసూలు చేయాలనే ఉద్దేశంతో గతంలో దాచిన తుపాకులను బయటకు తీశారు. ఈ క్రమంలో ఈ నెల 15న వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు చిక్కారు. చాకచక్యంగా వ్యవహరించి వారిని అదుపులోకి తీసుకున్న ఎస్ఐ విజయ్‌ప్రకాశ్‌ను, ఐడీపార్టీ సిబ్బంది సత్యం, హరినాయక్, కానిస్టేబుల్ ఆంజనేయులును సీఐ అభినందించారు.