క్యాంపస్ అంబాసిడర్స్ - పల్లా హర్షవర్ధన్
ఐఐటీ -ఖరగ్‌పూర్.. ఏ మాత్రం పరిచయం అక్కర్లేని పేరు. ఇంజనీరింగ్ విద్యలో దేశానికి నిష్ణాతులైన విద్యార్థులను అందిస్తున్న ఈ సంస్థ పశ్చిమబెంగాల్లోని ఖరగ్‌పూర్‌లో కొలువుదీరింది. ఇక్కడ బీటెక్+ఎంటెక్ (డ్యుయెల్ డిగ్రీ) కెమికల్ ఇంజనీరింగ్ మూడో ఏడాది చదువుతున్నారు పల్లా హర్షవర్థన్. క్యాంపస్ తనకెంతో నచ్చిందంటున్న హర్ష క్యాంపస్ కబుర్లు..
దేశంలో మొట్టమొదటి ఐఐటీ.. ఖరగ్‌పూర్
ఐఐటీ ఖరగ్‌పూర్ క్యాంపస్ కొన్ని వందల ఎకరాల్లో ఉంటుంది. క్యాంపస్‌లో ర్యాగింగ్ లేదు. సబ్జెక్టులు, పరీక్షలు, ఇతర అన్ని విషయా ల్లో సీనియర్లు సహాయం చేస్తారు. ప్రవేశం లభించిన ప్రతి విద్యార్థికీ హాస్టల్ వసతి కల్పిస్తారు. క్యాంటీన్లో దక్షిణాది వంటకాలన్నీ లభిస్తాయి. కూరలు మాత్రం కొంచెం తియ్యగా ఉంటాయి. ఇక.. క్యాంపస్ అంతా వై-ఫై ఉంది. లైబ్రరీ, ఆడిటోరియం, లేబొరేటరీలు, ప్లే గ్రౌండ్స అత్యుత్తమ స్థాయిలో ఉంటాయి.
నిపుణులైన ఫ్యాకల్టీ: సాధారణంగా ఉదయం 7.30 గంటల నుంచి సాయం త్రం 5 గంటల వరకు క్లాసులుంటాయి. ఈ సమయంలో కోర్సును బట్టి, షెడ్యూల్‌ను బట్టి తరగతులకు హాజరు కావాలి. ఫ్యాకల్టీ చాలా బాగా బోధిస్తారు. పవర్‌పాయింట్ ప్రజెంటేషన్స్ కూడా ఉంటా యి. ఏవైనా సందేహాలు వస్తే వెంటనే నివృత్తి చేస్తారు. మెయిల్ ద్వారా వారిని సంప్రదించే అవకాశం ఉంది. ఆన్లైన్లో కూడా కొన్ని కోర్సులను చేస్తాం. శని, ఆదివారాలు సెలవు. ఇంజనీరింగ్ కోర్సులతోపాటే హ్యుమానిటీస్ సబ్జెక్టులను కూడా అధ్యయనం చేయాలి. సైకాలజీ, ఎకనామిక్స్, ఆంత్రోపాలజీ వంటివి అందుబాటులో ఉన్నాయి. ఒక్కో సెమిస్టర్లో 4 కోర్సులు, 1 ల్యాబ్ కోర్సు, 1 హ్యుమానిటీస్ కోర్సుపై పరీక్షలు నిర్వహిస్తారు. ప్రతి సెమిస్టర్లో మిడ్ సెమిస్టర్, ఎండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉంటాయి. నేను పరీక్షలో ఇప్పటివరకు పదికి 7.2 సీజీపీఏ సాధించాను. మూడో ఏడాది వేసవిలో రెండు నెలలపాటు ఇంటర్న్‌షిప్ చేయాలి. ఇందుకోసం వివిధ కంపెనీలు క్యాంపస్‌కు వస్తాయి. అకడమిక్ రికార్డ్, బృంద చర్చలు, మౌఖిక పరీక్షల ద్వారా ఇంటర్న్‌షిప్‌కు ఎంపిక చేస్తారు.
40 శాతం తెలుగు విద్యార్థులే: క్యాంపస్‌లో తెలుగు విద్యార్థులే ఎక్కువ. తెలుగు విద్యార్థుల సొసైటీ ఆధ్వర్యంలో ఉగాది, శ్రీరామనవమి, దీపావళి, వినాయకచవితి వంటి పండుగలను బాగా చేస్తాం. ప్రతి ఏటా టెక్నికల్ ఫెస్ట్, కల్చరల్ ఫెస్ట్‌లను కూడా విద్యార్థులే కమిటీలుగా ఏర్పడి నిర్వహిస్తారు. టెక్నికల్ ఫెస్ట్‌లో భాగంగా వివిధ పోటీలు, గెస్ట్ లెక్చర్స్ వంటివి ఉంటాయి. దేశ,విదేశాల్లోని ప్రఖ్యాత విద్యా సంస్థల నుంచి ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలు, వివిధ కంపెనీల హెడ్లు, స్టార్టప్స్ సీఈవోలు క్యాంపస్‌కు విచ్చేస్తారు. కల్చరల్ ఫెస్ట్‌లో భాగంగా సంగీత, నృత్య కార్యక్రమాలు ఉంటాయి. డిపార్ట్మెంటల్ కాంపిటీషన్స్ కూడా ఉంటాయి. మా హాస్టల్లో మొత్తం 550 మంది విద్యార్థులు ఉంటారు. వారందరికీ నేను జనరల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్నాను. అంతేకాకుండా స్పోర్ట్స్ సెక్రటరీ బాధ్యతలు కూడా చేపట్టాను.
క్యాట్ రాస్తా: ప్రాంగణ నియామకాల్లో ఏడాదికి కనీసం రూ.6.5 లక్షలు, గరిష్టం రూ.36 లక్షల వరకు అందుతు న్నాయి. నా కోర్సు పూర్తయ్యాక మంచి ఉద్యోగం సాధించి.. పెట్రోలియం కం పెనీల్లో రెండేళ్లపాటు పనిచేయాలను కుంటున్నా. ఆ తర్వాత కామన్ అడ్మిషన్ టెస్ట్ రాసి.. ఐఐఎంల్లో ఎంబీఏ చేస్తా.