కలుషిత నీటితో 20 మందికి అస్వస్థత
ఆందోళనలో పండూరు ప్రజలు
జన్మభూమిలో వైద్య సిబ్బంది
సరిపడిన మంచాలు లేక
రోగుల అవస్థలు
కాకినాడ రూరల్ : మండలం పండూరులో తాగునీరు కలుషితమై 20 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బుధవారం అర్థరాత్రి నుంచి గ్రామస్తులు ఒక్కొక్కరుగా విరేచనాలు, వాంతులతో ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లగా అది తెరవకపోవడంతో ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించారు. ప్రైవేటు ఆస్పత్రులకు, దూరప్రాంతాలకు వెళ్లలేనివారు స్థానిక మందుల దుకాణంలోని టాబ్లెట్లు వేసుకుని ఉదయమే ఆస్పత్రి బాట పట్టారు. కొందరు ఏఎన్ఎంలు వైద్యం చేసే ప్రయత్నం చేసినప్పటికీ 12 మంది ఒకేసారి ఆస్పత్రికి రావడంతో సిబ్బంది కంగారుపడ్డారు. మండల వైద్యాధికారి ఐ ప్రభాకర్, హెల్త్సూపర్వైజర్లు, సిబ్బంది వాకలపూడిలోని జన్మభూమి– మాఊరు కార్యక్రమంలో ఉన్నారు. ఆస్పత్రిలో ఇద్దరు ఏఎన్ఎంలు ఒక మహిళా వైద్యాధికారి మాత్రమే అస్వస్థులకు వైద్యం చేశారు. బాధితులతో పాటు కుటుంబ సభ్యులు కూడా తరలిరావడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. రోగులకు ఫ్లూయిడ్స్ ఎక్కించేందుకు సరిపడినన్ని మంచాలు లేక ఒకొక్క మంచంపైనా ఇద్దర్ని చొప్పున పడుకోబెట్టి వైద్యం చేశారు. మరికొందర్ని ఆస్పత్రి వరండాలోనే చెక్క బెంచీలపై ఉంచి ఫ్లూయిడ్స్ పెట్టారు. తాగునీరు కలుషితం కావడం వల్లే ఈ సమస్య ఎదురైందని డాక్టర్ కన్యాకుమారి చెబుతున్నారు. వెంటనే పంచాయతీ కార్యదర్శికి, సర్పంచ్‌కు సమాచారం అందజేసినట్లు ఆమె వివరించారు.
పంచాయతీ కార్యదర్శి మహ్మద్ ఉన్నీసా బీబీని వివరణ కోరగా పంచాయతీకి రెండు ఓవర్‌హెడ్ ట్యాంకులు ఉన్నాయని, వాటికి సంబంధించిన మోటార్ పాడవడంతో పి.వెంకటాపురం చెరువుగట్టుపై ఉన్న సూర్యారావుపేట పంపింగ్ స్కీమ్ నుంచి నాలుగు రోజులుగా పండూరు ప్రజలకు తాగునీరు అందజేస్తున్నామన్నారు. గ్రామం అంతా ఇదే నీరు తాగుతున్నారని, ప్రత్యేకంగా ఒకే ప్రాంతానికి చెందిన ప్రజలకు మాత్రమే విరేచనాలు, వాంతులు అయ్యాయంటే తాగునీరు వెళ్లే పైపులైనులో ఎక్కడో పైపు బద్దలై వేరే నీరు కలసి ఉండవచ్చన్నారు. విషయం తెలిసినప్పటి నుంచి పైపులైను తనిఖీ చేయిస్తున్నామన్నారు.
విషయం తెలుసుకున్న ఆర్డబ్ల్యూఎస్ మండల ఏఈ ఎ.శివాజీ, ఉపసర్పంచ్ భావిశెట్టి వెంకటరమణ తదితరులు పీహెచ్‌సీకి వెళ్లి బాధితులను పరామర్శించి డాక్టర్ కన్యాకుమారితో మాట్లాడారు. ప్రమాదం ఏమీ లేదని ఫ్లూయిడ్స్ పెట్టి ఇంటికి పంపినట్టు వివరించారు.
అస్వస్థతకు గురైన వారిలో..
అబ్బన త్రిమూర్తులు, వలవల వెంకటలక్ష్మి, జువ్వల వరాలమ్మ, బర్రే దుర్గాప్రసాద్, బర్రే దేవి, శీలి నూకరాజు, గరగ సుబ్బాలమ్మ, వలవల రఘు, శీలి బుల్లెమ్మ, అల్లవరపు నారాయణరావు, భావిశెట్టి వీరలక్ష్మి, కోనా గంగాభవాని ఉన్నారు.
ఏఈపై అట్రాసిటీ కేసు పెట్టాలి
పండూరులో తాగునీరు కలుషితమైన విషయంలో ఆర్డబ్ల్యూఎస్ ఏఈ ఎ.శివాజీ ఎస్సీలను చులకన చేసి మాట్లాడారంటూ ఆ గ్రామ ఎస్సీ నాయకులు శీలి లక్ష్మణరావు, తాతపూడి దివాకర్ తిమ్మాపురం పోలీస్‌స్టేషన్‌లో గురువారం ఫిర్యాదు చేశారు. బాధితులను పరామర్శించడానికి వచ్చిన సందర్భంగా తాగునీరు కలుషితమైందో లేక ఎస్సీ పేటలో ఏదైనా ఫంక్షన్లో ఫుడ్ పాయిజెన్ అయ్యిందో తెలియాల్సి ఉందన్నారని, ఆ శాఖ తప్పును కప్పిపుచ్చుకునేందుకు తమపై ఆరోపణలు చేయడం దారుణమన్నారు. గత నెల రోజులుగా ఇక్కడ ఎటువంటి ఫంక్షన్లు జరగలేదని, అస్వస్థతకు గురైన వారిలో 12 మంది కాపులని, నలుగురు ఎస్సీలు ఉన్నారని, కాపులంతా ఎస్సీలు చేసుకొనే ఫంక్షన్‌కు వచ్చి భోజనం చేయడం వల్లే అస్వస్థతకు గురైనట్లు ఏఈ శివాజీ పేర్కొన్నట్లు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు. దీనిపై పోలీసులు చర్యలు తీసుకోకపోతే ఆందోళన చేస్తామని లక్ష్మణరావు తెలిపారు.
రక్షిత తాగునీరు అందించండి : కన్నబాబు
పండూరులో తాగునీరు కలుషితమై ప్రజలు అస్వస్థతకు గురి కావడం విచారించదగ్గ విషయం. తక్షణం గ్రామంలో పంపిణీ చేస్తున్న తాగునీటిని నిలిపివేసి రక్షిత నీటిని ట్యాంకర్ల ద్వారా అందించాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు కురసాల కన్నబాబు డిమాండ్ చేశారు. మోటార్లు పాడైపోతే వాటిని మరమ్మతులు చేయించాలని, అలా కాకుండా వాటిని అలాగే వదిలేసి కలుషిత చెరువునీటిని అందించడం దారుణమన్నారు. ప్రజలంతా కోలుకునేవరకూ కాకినాడ నుంచి ట్యాంకర్ల ద్వారా తాగునీటిని అందజేయాలని కన్నబాబు అధికారులకు సూచించారు.