'ప్యాంట్ సూట్ పోజ్' తో హిల్లరీకి మద్దతు..
న్యూయార్క్ః అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న హిల్లరీ క్లింటన్ కు రోజురోజుకూ మద్దతు పెరిగిపోతోంది. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఆమెపై పెరుగుతున్న అభిమానాన్ని జనం వీడియోల రూపంలో సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. తాజాగా కొందరు డ్యాన్సర్లు హిల్లరీకి మద్దతుగా చేసిన ఫ్లాష్ మాబ్ డ్యాన్స్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఆకట్టుకున్నారు. 'ప్యాంట్ సూట్ పోజ్' అంటూ హిల్లరీకి మద్దతుగా ప్రదర్శించిన ఫ్లాష్ మాబ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
హిల్లరీ క్లింటన్ మద్దతుదారులు కొందరు న్యూ యార్క్ సిటీ లో ఫ్లాష్ మాబ్ డ్యాన్స్ నిర్వహించారు. డెమొక్రటిక్ అభ్యర్థి హిల్లరీ ట్రేడ్ మార్క్ స్టైల్లో ' ప్యాంట్ సూట్' ఫ్లాష్ మాబ్ డ్యాన్స్ నిర్వహించి ఆమెపై అభిమానాన్ని, మద్దతునూ చాటారు. మొత్తం 150 మందికి పైగా హిల్లరీ అభిమానులు కలర్ ఫుల్ ప్యాంట్ సూట్స్ ధరించి, యూనియన్ స్క్యేర్ ప్రాంతానికి చేరారు. అక్కడ జస్టిన్ టింబర్ లేక్ 'కాంట్ స్టాప్ ద ఫీలింగ్' పాటకు నృత్యాన్ని జోడించారు. తమ ప్రదర్శన వెనుక రాజకీయ కారణాలు కూడా ఉన్నాయని, ఎవరైతే ఈ దేశం డోనాల్డ్ ట్రంప్ పాలనలోకి వెళ్ళకూడదనుకుంటున్నారో వారందరి తరపునా ఈ ఫ్లాష్ మాబ్ ను ప్రదర్శించినట్లు తెలిపారు. కొంత క్రియాశీలకంగా, మరికొంత కళాత్మకంగా హిల్లరీకి తమ మద్దతు తెలిపినట్లు కో కొరియోగ్రాఫర్ క్రిషాన్ జెరోమ్ ఫేస్ బుక్ లో వివరించారు.
జాత్యాహంకారం, అసహ్యం, హోమోఫోబియో, క్లాసిజం, అన్యాయానికి వ్యతిరేకంగా... శాంతి, ప్రేమ, సమానత్వం పక్షాన ఈ డ్యాన్స్ నిర్వహించినట్లు క్రిషాన్ తెలిపారు. తమకు తెలిసిన రీతిలో హిల్లరీకి సహాయం అందించేందుకే ఈ ఫ్లాష్ మాబ్ నిర్వహించినట్లు ఈవెంట్ నిర్వాహకులు కొరియోగ్రాఫర్-చిత్ర నిర్మాత సెలియా రోల్సన్ హాల్, దర్శకుడు మియా లిడోఫ్ స్కై లు తెలిపారు. ర్యాలీలద్వారా ట్రంప్ కు మద్దతు అందుతుంటే.. తమకు తెలిసిన కళాత్మక మార్గంలో హిల్లరీకి మద్దతు తెలిపేందుకు ఈ విభిన్న ప్రయత్నం చేశామని, ఈ ప్రయత్నం ఆమెకు ఎన్నికల్లో విజయాన్ని అందిస్తుందని భావిస్తున్నట్లు రోల్సన్ హాల్ తెలిపారు. ప్రస్తుతం ఈ 'ప్యాంట్ సూట్ పోజ్' వీడియో హిల్లరీకి పెరుగుతున్న అమితమైన అభిమానాన్ని వ్యక్త పరుస్తోంది.