‘ప్రైవేట్’ యజమానులే సూత్రధారులు
♦ పదోతరగతి ఇంగ్లిష్–2 పేపర్ లీక్ ముఠా గుట్టు రట్టు
♦ రెండు విద్యాసంస్థల యజమానులతో సహా 12 మంది రిమాండ్
♦ సెల్‌ఫోన్‌తో ప్రశ్నపత్రం చిత్రీకరించి వాట్సాప్‌లో చేరవేత
హుజూర్నగర్: పదో తరగతి ఇంగ్లిష్–2 ప్రశ్నపత్రం లీక్ చేసిన సూత్రధారుల గుట్టును సూర్యాపేట జిల్లా పోలీసులు రట్టు చేశారు. రెండు ప్రైవేట్ పాఠ శాలల యాజమాన్యాలే సూత్రధారులని పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసులో మొత్తం 12 మంది నిందితులను అరెస్టు చేశామని ఎస్ఐ రంజిత్‌రెడ్డి తెలిపారు. హుజూర్‌నగర్‌కు చెందిన తనూజ (ఓం శాంతినికేతన్), స్కూలు యజమాని ఎస్కె. సైదులు, విజ్ఞాన్ పాఠశాల యజమాని కొత్తా శ్రీనివా సరావు, అదే పాఠశాలకు చెందిన సిబ్బంది పోలె వెంకటేశ్వర్లు, కొమ్ము శ్రీనులు టెన్త్ ఇంగ్లిష్–2 ప్రశ్నపత్రాన్ని లీక్ చేసేందుకు తనూజ పాఠశాలలో పనిచేస్తున్న బాణోతు ప్రసాద్‌ను ఎంపిక చేసుకున్నారు.
వాట్సాప్‌ను ఉపయోగించి...
బాణోతు ప్రసాద్ సోదరుడు పట్టణంలోని వీవీఎం పాఠశాలలో 10వ తరగతి పరీక్షలకు హాజరవుతు న్నాడు. అతడి ద్వారా ప్రశ్నపత్రాన్ని లీక్ చేస్తే ప్రతిఫలంగా కొంత నగదుతో పాటు తమ్ముడు పరీక్ష రాసేందుకు జవాబు పత్రాలు కూడా అంది స్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో తన తమ్ముడు పరీక్ష రాసే గది కిటికీ వద్ద నుంచి ప్రసాద్ సెల్‌తో ప్రశ్నపత్రాన్ని చిత్రీకరించి వాట్సాప్ ద్వారా తనూజ, విజ్ఞాన్ పాఠశాలలకు చేరవేశాడు.
ముఠా సభ్యులు ఎస్కె.సైదులు, గుగులోతు గోపీ నాయక్, భూక్యా ఆంజనేయులు, చిచ్చుల శరత్, బాణోతు సైదా, భూక్యా సాయిరాం, ఎస్కె.ఖలీల్ బాబాలు జవాబు పత్రం తయారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్ఐ తన సిబ్బందితో కలసి తనూజ పాఠశాలపై దాడి చేయడంతో పేపర్ లీకైన విషయం బయటపడింది. జవాబు పత్రాలు తయారు చేస్తున్న వారిని అదుపులోకి తీసుకుని విచారించగా.. విజ్ఞాన్ పాఠశాల యాజమాన్యానికీ ప్రశ్నపత్రం అందిందని తేలడంతో ఆ పాఠశాలపై కూడా దాడి చేశారు. పాఠశాల యజమాని కొత్తా శ్రీనివాసరావు, సిబ్బంది పోలె వెంకటే శ్వర్లు, కొమ్ము శ్రీనులతో పాటు జవాబు పత్రాలు జిరాక్స్‌లు తీస్తూ సహకరిస్తున్న స్థానిక సాయి ప్రభాత్నగర్లోని ఆరూరి రవిని అరెస్ట్ చేశారు.
పరారీలో పేపర్ లీక్ నిందితులు..
వీవీఎం పాఠశాలకు చెందిన మరో ఇద్దరికీ ప్రసాద్ వాట్సాప్ ద్వారా పంపినట్లుగా గుర్తించామని ఎస్ఐ తెలిపారు. ప్రస్తుతం పరారీలో ఉన్న వారిని కూడా త్వరలోనే అదుపు లోకి తీసుకుంటామన్నారు. ప్రశ్నపత్రం లీకేజీ విషయంలో ఇప్పటికే ముగ్గురు ఉపాధ్యాయులను సస్పెండ్ చేశారని, సదరు ఉపాధ్యాయులకు నోటీసులు జారీ చేశామన్నారు.
ఏడుగురు ఉపాధ్యాయులపై సస్పెన్షన్ వేటు
మహబూబాబాద్ అర్బన్: ఇంగ్లిష్ ప్రశ్నపత్రం లీకేజీకి బాధ్యులైన ఏడుగురు ఉపాధ్యాయులను సస్పెండ్ చేసినట్లు పరీక్షల విభాగ అధికారులు వై.అమరేందర్, ఏసీజీ శ్రీనివాస్ తెలిపారు. మహబూబాబాద్ జిల్లాలోని దంతాలపల్లి మం డలం జెడ్పీహెచ్ఎస్లో పరీక్షలు జరుగుతుండ గా శివాని ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం ప్రశ్నపత్రాన్ని వాట్సాప్ ద్వారా పలువురు టీచర్లు లీక్ చేశారన్నారు. సస్పెండ్ అయిన వారిలో ఎ.వెంకట్‌రెడ్డి (ఎస్జీటీ, జెడ్పీహెచ్ఎస్, దంతాలపల్లి), వై.హర్షవర్ధన్‌రెడ్డి (స్కూల్ అసిస్టెంట్, దంతాలపల్లి), కె.సతీష్ (హిందీ పండిట్, దంతాలపల్లి), టి.వెంకటేశ్వర్లు (హెచ్ఎం, కంటాయపాలెం, తొర్రూరు మండలం), ఎ.భిక్షపతి (అవుతాపూర్ పాఠశాల హెచ్ఎం), ఆర్. వెంకన్న (జెడ్పీహెచ్ఎస్ వీరారం), బి.వెంకట్రాం (ఎస్జీటీ, దంతాలపల్లి) ఉన్నారు.