పోలీసులకు దాతల సహకారం
పోలీసులకు దాతల సహకారం
మెరుగైన సేవలు అందించేందుకు సహకరించాలని పరకాల పోలీసులు కోరగానే దాతలు ముందుకు వస్తున్నారు. అడగ్గానే కాదనలేకనో.. ఏమోకానీ దాతలు పోలీస్ సేవలకు అవసరమైన వాటిని సమకూర్చుతున్నారు. ‘పరకాల పోలీస్‌స్టేషన్’ బోర్డు నుంచి స్టాపర్స్ (ట్రాఫిక్ బారికేడ్లు) వరకు అందజేస్తున్నారు. పోలీసులు పట్టణంలోని వ్యాపారులు, విద్యా సంస్థల నిర్వాహకులు, దాతల సహకారం కోరుతున్నారు. కొందరు తమ రక్షణ కోసమే కదా అని భావిస్తుండగా.. మరికొందరు సాయం చేస్తే ప్రచారం దక్కుతుందని ముందుకు వస్తున్నారు.
పద్నాలుగు సీసీ కెమెరాలు
పట్టణంలో దొంగతనాలను అరికట్టేందుకు, అపరిచిత వ్యక్తులను గుర్తించేందుకు సీసీ కెమెరాలను నెలరోజుల క్రితం ఏర్పాటు చేశారు. వ్యాపారులు ఒక కమిటీగా ఏర్పడి విరాళాలు జమ చేశారు. సుమారు *2లక్షలతో పద్నాలుగు సీసీ కెమెరాలను కొనుగోలు చేయగా పోలీసులు పట్టణంలో ఏర్పాటు చేశారు. జనం ద్దీగా ఉండే ప్రాంతాల్లో, ప్రధాన రహదారి వెంట ఏర్పాటు చేసి పోలీస్‌స్టేషన్‌లోని టీవీకి అనుసంధానం చేశారు. సీసీ కెమెరాల ద్వారా నిఘా పెట్టారు.
స్టాపర్లు అందించిన విద్యాసంస్థలు
ప్రైవేటు విద్యా సంస్థలు స్టాపర్లు తయారు చేయించారు. పట్టణంలో రోజుకురోజుకు పెరిగిపోతున్న ట్రాఫిక్ నియంత్రణకు స్టాపర్లు ఎంతగానో ఉపయోగపడతాయి. వీటి అవసరాన్ని గుర్తించి కోరిన పోలీసులకు ప్రైవేటు విద్యా సంస్థలు తమ సంపూర్ణ సహకారం అందించాయి. ఒక్కో స్టాపర్‌కు *8వేల చొప్పున ఖర్చు చేసి ఆరు తయూరు చేరుుంచారు. వీటిని ప్రధాన రహదారిలో పెట్టి పోలీసులు ట్రాఫిక్ నియంత్రిస్తున్నారు.
స్టేషన్ బోర్డుపై.. వొడా ఫోన్ ప్రచారం
పోలీస్‌స్టేషన్ బోర్డును మొబైల్ కంపెనీ ఏర్పాటు చేసింది. రోడ్డు విస్తరణలో భాగంగా పోలీస్‌స్టేషన్ పాత ప్రహరీని తొలగించి వెనక్కి మరో గోడను నిర్మించారు. దీంతో నూతన బోర్డును వొడాఫోన్ కంపెనీ వారు విద్యుత్‌లైట్లతో ఏర్పాటు చేశారు.
ప్రబోధ్ కేంద్రానికి జూనియర్ కళాశాల గది
నిరుద్యోగ యువతకు, విద్యార్థులకు కెరీర్ గెడైన్స్ ఇచ్చేందుకు పోలీసుల ఆధ్వర్యంలో ప్రబోధ్ కేంద్రాన్ని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల గదిలో ఏర్పాటు చేశారు. జనవరి 22న ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. పోటీ పరీక్షలకు ఉపయోగపడే పుస్తకాలు, గెడైన్స్ చేసే రిటైర్డ్ ఉపాధ్యాయుడితో ఆ గదిని వాడుకుంటున్నారు.