కొయిరాలా రాజీనామా.. మళ్లీ పోటీకి సై
ఖట్మాండు: నేపాల్ ప్రధానమంత్రి సుశీల్ కొయిరాలా శనివారం తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను రాష్ట్రపతి రాంబరణ్ యాదవ్కు సమర్పించారు. ఆయన రాజీనామాను ఆమోదించిన రాష్ట్రపతి కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యేవరకు అపద్ధర్మ ప్రధానిగా కొనసాగించాలని సూచించారు. ఆదివారం కొత్త ప్రధానిని ఎన్నుకొనేందుకు పార్లమెంటు సమాయత్తం అవుతుండగా... ఇప్పటికీ కొ్తత ప్రధాని ఎవరనే దానిపై ప్రధాన పార్టీలు ఏకాభిప్రాయానికి రాలేదు. ఈ సంక్షోభం ఇలా కొనసాగుతుండగానే మరోవైపు కీలక భారత్ సరిహద్దు వాణిజ్య ఒప్పందంపై దేశమంతటా నిరసనలు, రోడ్డు నిర్బంధాలు కొనసాగుతున్నాయి.
ప్రధాని పదవికి కొయిరాలా రాజీనామా లాంఛనం మాత్రమే. ఆదివారం పార్లమెంటులో జరగబోయే నూతన ప్రధాని ఎన్నికలో ఆయన కూడా ప్రధాన అభ్యర్థిగా బరిలో ఉన్నారు. నేపాలీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన ప్రధాని అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. కోయిరాల ప్రధానంగా సీపీఎన్-యూఎంఎల్ చైర్మన్ కేపీ శర్మ ఓలితో పోటీపడుతున్నారు.