పోలీస్ పెట్రోలింగ్ వాహనాన్ని ఢీకొట్టిన లారీ
హయత్‌నగర్(రంగారెడ్డి): వేగంగా వెళ్తున్న లారీ రోడ్డు పక్కన నిలిపి ఉన్న పోలీస్ మొబైల్ కారును ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు కానిస్టేబుళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం పెద్ద అండర్పేట్ సమీపంలోని ఔటర్ రింగ్‌రోడ్డు పై సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఔటర్ రింగ్‌రోడ్డుపై ముగ్గురు కానిస్టేబుళ్లు విధులు నిర్వర్తిస్తున్న సమయంలో వేగంగా వచ్చిన లారీ కారును ఢీకొట్టింది. దీంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో కానిస్టేబుల్ నాగేశ్వరరావు, హెడ్ కానిస్టేబుల్ శేఖర్లతో పాటు హోంగార్డు వేణు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
క్షతగాత్రులను కామినేని ఆస్పత్రికి తరలించగా..ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో కారు పల్టీలు కొట్టి నుజ్జునుజ్జవడంతో.. పాటు లారీ ముందు చక్రాలు ఊడిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతివేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు అంటున్నారు.