మన్మోహన్ చిరస్థాయిగా నిలిచిపోతారు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉన్నంతకాలం మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ పేరు నిలిచిపోతుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటుకు పార్లమెంట్లో అవసరమైన బలం లేకున్నా ప్రతిపక్షాలను ఒప్పించి నాటి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాం«దీ, ప్రధాని మన్మోహన్ తెలంగాణ బిల్లును ఆమోదింపజేశారని గుర్తు చేసుకున్నారు. సోమవారం శాసనసభ ప్రత్యేక సమావేశంలో మన్మోహన్‌కు నివాళి అర్పిస్తూ ప్రవేశపెట్టిన తీర్మానంపై చర్చలో భట్టి విక్రమార్కతోపాటు మంత్రులు ఉత్తమ్, శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహా, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క తదితరులు మాట్లాడారు. రుణమాఫీకి స్ఫూర్తినిచ్చారు: భట్టి చర్చలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ‘‘ఎందరో పుట్టి మాయం అవుతారు. కొందరు మాత్రమే ఈ భూమిపై మానవీయ పరిమళాలు వెదజల్లుతారు. అందులో మన్మోహన్ ఒకరు. దేశంలో తొలిసారిగా రైతు రుణమాఫీ చేసిన ప్రధాని ఆయనే. నేడు రాష్ట్రంలో రూ.2 లక్షల రుణమాఫీ అమలుకు స్ఫూర్తి ప్రదాత ఆయనే. దేశ ఆర్థిక, సామాజిక స్థితులను అర్థం చేసుకొని సమాచార హక్కు, అటవీ హక్కు, భూసేకరణ, ఉపాధి హామీ వంటి చట్టాలను తీసుకువచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఏర్పడగా... ఉపాధి హామీతో దేశ ప్రజలు ఆర్థిక మాంద్యం బారిన పడకుండా కాపాడగలిగారు..’’అని పేర్కొన్నారు. అణు ఒప్పందం చేసుకున్న ధీశాలి: ఉత్తమ్ దేశానికి రైతు వెన్నెముక అయితే.. దేశ రైతాంగానికి మాజీ ప్రధాని మన్మోహన్ వెన్నెముకగా నిలిచారనని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. యావత్ దేశ రైతాంగానికి ఏకకాలంలో ఋణమాఫీ చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని చెప్పారు. అమెరికాతో అణు ఒప్పందం కుదుర్చుకోవడంతోపాటు ప్రతిపక్షాలు వ్యతిరేకించినా ఉభయసభల్లో బిల్లు పెట్టి ఆమోదింపజేసుకున్న ధీశాలి మన్మోహన్ అని కొనియాడారు. తన రాజకీయ గురువు పీవీ నరసింహారావు జన్మదిన వేడుకలను సంవత్సరం పొడవునా నిర్వహించాలని తమకు సూచించి గురుభక్తిని చాటుకున్నారని చెప్పారు. 114 ప్రెస్మీట్స్ పెట్టినా మౌన ప్రధానిగా విమర్శలు: శ్రీధర్‌బాబు మన్మోహన్ ప్రధానిగా మీడియా, విపక్షాల నుంచి నిరంతరం విమర్శలను ఎదుర్కొన్నారని మంత్రి శ్రీధర్‌బాబు గుర్తు చేసుకున్నారు. ఆయన 114 ప్రెస్మీట్లు పెట్టి మాట్లాడినా.. అన్యాయంగా మౌన ప్రధాని అని విమర్శించారని పేర్కొన్నారు. తెలుగు బిడ్డ పీవీ నాయకత్వంలో ఆర్థిక మంత్రిగా మన్మోహన్ తీసుకొచ్చిన సరళీకృత ఆర్థిక విధానాలే నేడు దేశ ప్రగతికి దోహదపడుతున్నాయని చెప్పారు. మన్మోహన్‌కు గుర్తుగా పార్కు: కోమటిరెడ్డి విగ్రహం ఏర్పాటు మాత్రమే కాకుండా మన్మోహన్ సింగ్‌కు గుర్తుగా మంచి పార్కును రూపొందించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కోరారు. పార్లమెంటు ఎదుట ఎంపీలుగా తాము ధర్నాలో ఉండగా, తమ మధ్య కూర్చుకుని మద్దతు తెలపటాన్ని ఎన్నటికీ మరువలేమన్నారు. ఆయన వల్లే దేశ సుస్థిర ఆర్థిక పురోగతి: దామోదర రాజనర్సింహ దేశం స్థిరమైన ఆర్థిక పురోగతిని సాధించటంలో ఆర్థిక మంత్రిగా, ప్రధానిగా మన్మోహన్ సింగ్ తీసుకున్న నిర్ణయాలే ప్రధాన కారణమని మంత్రి దామోదర రాజనర్సింహ కొనియాడారు. రాబోయే తరాలు కూడా ఆదర్శంగా తీసుకోవాల్సిన గొప్ప వ్యవహార శైలి మన్మోహన్సింగ్దని పేర్కొన్నారు. దేశమంతా మాట్లాడుకునేలా చేశారు: మంత్రి పొన్నం మన్మోహన్సింగ్ ఎక్కువగా మాట్లాడరని అంతా అంటారని, కానీ తాను చేసిన కార్యక్రమాలపై ప్రపంచమంతా మాట్లాడుకునేలా చేసిన గొప్ప వ్యక్తి ఆయన అని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ప్రపంచంలో మరే రాజకీయ నేత సాహసించని రీతిలో ఆయన సమాచార హక్కు చట్టాన్ని తీసుకొచ్చారన్నారు. ఆయన మాట్లాడితే ప్రపంచమంతా వింటుంది: సీతక్క విద్యకు ఒకేసారి రూ.70 వేల కోట్లను బడ్జెట్లో ప్రతిపాదించటమే కాకుండా దేశవ్యాప్తంగా 30 వేల పాఠశాలలను ఏర్పాటు చేశారని మన్మోహన్‌ను మంత్రి సీతక్క కొనియాడారు. మన్మోహన్ మాట్లాడితే ప్రపంచమంతా వింటుందని అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా గొప్పగా చెప్పారని గుర్తు చేశారు.