దేశీ రిటైల్‌లోకి ‘బ్లాక్ స్టోన్’!
• నెక్సస్ మాల్స్ పేరిట ఇప్పటికే సొంత సబ్సిడరీ
• నష్టాల్లో ఉన్న మాల్స్‌ను చేజిక్కించుకునే వ్యూహం
• అహ్మదాబాద్, అమృత్‌సర్‌లో భారీ మాల్స్ కొనుగోలు
• ఏడాది చివరికల్లా మరిన్ని కొనుగోళ్లు; త్వరలో ప్రకటన?
ముంబై: ప్రపంచంలో అతిపెద్ద ప్రైవేటు ఈక్విటీ(పీఈ) దిగ్గజం బ్లాక్‌స్టోన్ గ్రూప్ భారత రిటైల్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. భారీ వృద్ధి అవకాశాలున్న దేశీ రిటైల్ మార్కెట్లో అదృష్టాన్ని పరీక్షించుకోవటం కోసం సొంతంగా నెక్సస్ మాల్స్ పేరిట అనుబంధ సంస్థను ఏర్పాటు చేసింది. కష్టాల్లో ఉన్న షాపింగ్ మాల్స్‌ను చేజిక్కించుకుని, మళ్లీ వాటిని లాభాలబాట (టర్న్‌ఎరౌండ్) పట్టించడంపై దృష్టిసారిస్తోంది. ఇప్పటికే అహ్మదాబాద్, అమృత్‌సర్‌లో ‘ఆల్ఫా వన్’ మాల్స్‌ను కొనుగోలు చేసింది. దాదాపు 1.3 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంగల రిటైలింగ్ స్పేస్ ఈ మాల్స్‌కు ఉంది. ఈ ఏడాది చివరికల్లా మరికొన్ని షాపింగ్ సెంటర్లను దక్కించుకోవడం ద్వారా దీన్ని 2.4 మిలియన్ చదరపుటడుగులకు చేర్చాలని బ్లాక్‌స్టోన్ లక్ష్యిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి.
ప్రపంచవ్యాప్తంగా 1000 మాల్స్...
పీఈ ఇన్వెస్ట్మెంట్లలో పేరొందిన బ్లాక్‌స్టోన్ అంతర్జాతీయంగా ఇప్పటికే రిటైల్ బిజినెస్‌లో భారీ పెట్టుబడులు పెట్టింది. అమెరికా, యూరప్, ఆసియా పసిఫిక్ దేశాల్లో ఈ సంస్థకు 1,000కి పైగానే షాపింగ్ మాల్స్ ఉన్నాయి. అమెరికాలో తన అనుబంధ సంస్థ ‘బ్రిక్స్మార్’ సంస్థ ద్వారా రిటైల్ మాల్స్‌ను నడుపుతోంది. ఇక 14 యూరోపియన్ దేశాల్లో ‘మల్టీ’ అనే కంపెనీ ద్వారా వీటిని నిర్వహిస్తోంది. కాగా, భారత్‌లోకి ఎంట్రీని అధికారికంగా త్వరలో బ్లాక్‌స్టోన్ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే దేశంలో ఆఫీస్ స్పేస్‌కు సంబంధించి ఈ సంస్థ దిగ్గజ స్థానంలో ఉంది. ‘బ్లాక్‌స్టోన్ వంటి ఇన్వెస్టర్ రిటైల్ రంగంలోకి రావడం వల్ల ప్రస్తుతం ఉన్న మాల్స్ డెవలపర్లకు తాజా నిధులు అందుబాటులోకి వస్తాయి. దీంతో కొత్త వాణిజ్య సముదాయాలను నిర్మించేందుకు పెట్టుబడులు లభిస్తాయి. అంతేకాదు!! ఇలాంటి పెద్ద సంస్థల రాకతో మాల్ మేనేజ్మెంట్లో నైపుణ్యాలు పెరుగుతాయి’’ అని రియల్టీ పరిశోధన సంస్థ సీబీ రిచర్డ్స్ అండ్ ఎల్లీస్ ఇండియా రిటైల్ సర్వీసెస్ హెడ్ వివేక్ కౌల్ చెప్పారు. ఇతర వర్ధమాన మార్కెట్లతో పోలిస్తే... భారత్‌లో జాతీయ స్థాయిలో గొలుసు కట్టు షాపింగ్ మాల్స్ ఉన్న సంస్థలు తక్కువేనని ఆయన అభిప్రాయపడ్డారు.
భారీగానే డిమాండ్...
భారత సంస్థాగత రిటైల్ రంగంలో డిమాండ్ జోరుగానే కొనసాగుతోందని... ప్రపంచస్థాయి దిగ్గజ సంస్థలైన మాసిమి డుటి, లాంగ్చాంప్, కోల్ హన్, హంకెమాలర్ వంటి రిటైల్ సంస్థలు ఇక్కడ అవుట్లెట్లను ఏర్పాటు చేస్తుండటమే దీనికి నిదర్శనమని సీబీఆర్ఈ తాజా నివేదిక తెలిపింది. మరోపక్క, జారా, హెచ్ అండ్ ఎం, గ్యాప్, మార్క్స్ అండ్ స్పెన్సర్ వంటి దిగ్గజ బ్రాండెడ్ రిటైల్ సంస్థలు కూడా తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నట్లు వెల్లడించింది.
అయితే, గ్లోబల్ రిస్క్ ఇన్వెస్టర్లు ఇక్కడి రిటైల్ అసెట్స్‌లో పెట్టుబడులకు కాస్త వెనుకంజ వేస్తున్నారని సంస్థ తెలియజేసింది. ‘‘భారత్‌లో షాపింగ్ మాల్ కార్యకలాపాల్లో కొత్త ఒరవడిని తీసుకురావడం, వినియోగదారుల వ్యవహారశైలిలో మార్పు తేవటం అనేది నెక్సస్ మాల్స్‌కు కీలకంగా నిలుస్తుంది. ఎందుకంటే వినియోగ వృద్ధి అవకాశాలు భారీగానే ఉన్నప్పటికీ.. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో మాల్స్ నిలదొక్కుకోవడం కష్టతరంగానే ఉంది’’ అని రిటైల్ రంగ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.