Piku
-
లేడీ డాన్‌గా దీపిక
బాలీవుడ్ లో వరుస విజయాలతో స్టార్ హీరోలకు పోటి ఇస్తున్న దీపిక పదుకొణె మరో ఆసక్తికరమైన సినిమాలో నటించనుంది. ముంబైని గడగడలాండించిన లేడీ డాన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలో దీపిక నటించనుంది. 80లలో ముంబయికి చెందిన మాఫియా క్వీన్ సప్నా దీదీ జీవితాధారంగా ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో సప్నా దీదీగా దీపిక నటించనుంది. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు విశాల్ భరద్వాజ్ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. పీకు సినిమాతో సక్సెస్ఫుల్ పెయిర్ అనిపించుకున్న దీపిక పదుకొణె, ఇర్ఫాన్ ఖాన్ లు ఈ బయోపిక్ కోసం మరోసారి జోడికడుతున్నారు. ప్రస్తుతం పద్మావతి ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న దీపిక, ఆ పనులు పూర్తయ్యాక బయోపిక్ షూటింగ్లో పాల్గొననుంది. ఈ సినిమాకు విశాల్ టీంలో చాలా కాలంగా దర్శకత్వ శాఖలో పనిచేస్తున్న హనీ దర్శకత్వం వహించనున్నాడు. -
అమితాబ్ కన్నా ఆమె పారితోషికమే ఎక్కువట..!
ఈ జనరేషన్ హీరోలకు కూడా గట్టి పోటి ఇస్తూ బాలీవుడ్లో మెగాస్టార్ ఇమేజ్ను ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్న సీనియర్ హీరో అమితాబ్ బచ్చన్. అంతర్జాతీయ స్థాయిలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఈ గ్రేట్ యాక్టర్, తను నటించిన ఓ సినిమాకు సంబందించి ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. అమితాబ్ కు మరోసారి జాతీయ ఉత్తమ నటుడు అవార్డ్ అందించిన పీకూ సినిమా పారితోషికంపై అమితాబ్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి. భారతీయ సినీ పరిశ్రమ మేల్ డామినేటెడ్ అన్న టాక్ బలంగా ఉంది. ముఖ్యంగా ఎంతటి గొప్పనటి అయినా.. సరే ఆ సినిమా హీరో కన్నా తక్కువ పారితోషికం తీసుకుంటుందన్న భావన ఉంది. అయితే పీకూ సినిమా విషయంలో అమితాబ్ రెమ్యూనరేషన్ కన్నా ఆ సినిమాలో హీరోయిన్గా నటించిన దీపికా పదుకొనే రెమ్యూనరేషనే ఎక్కువట. ఈ విషయాన్ని అమితాబ్ స్వయంగా ప్రకటించాడు. పీకూ సినిమాలో అమితాబ్ పాత్ర కన్నా దీపిక పాత్ర పెద్దది కావటంతో పాటు దీపికకు హాలీవుడ్లో కూడా మంచి ఫాలోయింగ్ ఉండటంతో భారీ రెమ్యూరేషన్ అందుకుంటోంది. -
'ఓ చిన్న భారతీయ నటుడిని నేను'
ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకుంటున్న బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు బిగ్ బీకి శుభాకాంక్షలు తెలియజేయగా, టాలీవుడ్ హంక్ రానా కూడా తనదైన స్టైల్లో బిగ్ బీపై తన గౌరవాన్ని ప్రకటించాడు. ఈ సందర్భంగా అమితాబ్ జాతీయ అవార్డ్ అందుకున్న ప్రతీసారి తాను కూడా అక్కడే ఉన్నానంటూ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించాడు. అమితాబ్ తొలిసారిగా 'బ్లాక్' చిత్రానికి గాను జాతీయ అవార్డును అందుకున్నారు. అయితే అదే ఏడాది 'బొమ్మలాట' సినిమాను నిర్మించిన రానా, ఆ సినిమాతో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నేషనల్ అవార్డును అందుకున్నారు. ఆ తరువాత 'పా' చిత్రంలో నటనకు గాను బిగ్ బీ, జాతీయ అవార్డ్ సాధించగా, అదే వేడుకల్లో నిర్మాత డి రామానాయుడు గారికి దాదా సాహెబ్ పాల్కే అవార్డును అందించారు. ఈ సందర్భంగా రానా సహా దగ్గుబాటి ఫ్యామిలీ అంతా అక్కడే ఉంది. తాజాగా పీకు సినిమాకు గాను అమితాబ్ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకుంటుండగా, బాహుబలి సినిమాతో రానా మరోసారి అమితాబ్‌తో వేదిక పంచుకోనున్నాడు. ఈ విషయాన్ని తన ట్విట్టర్లో వెల్లడించిన రానా, 'అమితాబ్ బచ్చన్ లాంటి మహానటుడిగా కాలంలో నటించే అదృష్టం దక్కించుకున్న ఓ చిన్న భారతీయ నటుడిని నేను' అంటూ బిగ్ బీపై తన గౌరవాన్ని ప్రకటించాడు రానా. Congratulations to the greatest @SrBachchan Read: https://t.co/wbTtOfsDuy — Rana Daggubati (@RanaDaggubati) 28 March 2016 -
ఫిలింఫేర్లో దుమ్మురేపిన 'బాజీరావు'!
ముంబై: ఊహించినట్టే సంజయ్‌లీలా భన్సాలీ చారిత్రక ప్రేమకథ 'బాజీరావు మస్తానీ' అవార్డుల విషయంలో దుమ్మురేపుతోంది. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఫిలింఫేర్ పురస్కారాల్లో ఈ సినిమా పంట పండింది. శుక్రవారం ముంబైలోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ స్టేడియంలో అట్టహాసంగా జరిగిన ఈ వేడుకల్లో అత్యధిక అవార్డులతో భన్సాలీ తన సత్తా చాట్టాడు. 'బాజీరావు మస్తానీ' ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు సహా మొత్తం తొమ్మిది పురస్కారాలను తన ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత స్థానంలో షుజిత్ సర్కార్ 'పీకూ' సినిమా నిలిచింది. ఉత్తమ కథాకథనాలతో విమర్శకుల ప్రశంసలందుకున్న ఈ సినిమా ఐదు అవార్డులతో తన ప్రతిష్ట నిలబెట్టుకుంది. 'పీకూ' సినిమాలో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న దీపికా పదుకొణ్కు ఉత్తమ నటి అవార్డు లభించింది. మరాఠా యోధుడు 'బాజీరావు' పాత్రను సమర్థంగా పోషించి మెప్పించినందుకు ఆమె చెలికాడు రణ్వీర్ సింగ్‌కు ఉత్తమ నటుడు పురస్కారం దక్కింది. 'బాజీరావు మస్తానీ'లోనూ దీపిక అద్భుతమైన ప్రతిభ కనబర్చినప్పటికీ.. 'పీకూ'లోని ఆమె అభినయానికి న్యాయనిర్ణేతలు ఓటువేశారు. 'పీకూ' సినిమాలో చివరిసారిగా కనిపించిన అలనాటి నటి మౌషుమి చటర్జీకి జీవితకాల సాఫల్య పురస్కారం లభించింది. 61వ బ్రిటానియా ఫిలింఫేర్ అవార్డ్-2015 విజేతలు వీరే ఉత్తమ నటుడు: రణ్వీర్ సింగ్ (బాజీరావ్ మస్తానీ) ఉత్తమ నటి: దీపికా పడుకొనే (పీకూ) ఉత్తమ చిత్రం - బాజీరావ్ మస్తానీ ఉత్తమ దర్శకుడు - సంజయ్ లీలా భన్సాలీ (బాజీరావ్ మస్తానీ) ఉత్తమ తొలిచిత్ర దర్శకుడు - నీరజ్ ఘాయ్వాన్ (మసాన్) ఉత్తమ హీరోయిన్ (తొలిచిత్రం) - భూమి పెడ్నెకర్ (దమ్ లాగాకే హైస్సా ) ఉత్తమ హీరో (తొలిచిత్రం) - సూరజ్ పంచోలి ('హీరో') విమర్శకులు మెచ్చిన ఉత్తమ చిత్రం - పీకూ క్రిటిక్స్ ఛాయిస్ ఉత్తమ నటుడు - అమితాబ్ బచ్చన్ (పీకూ) క్రిటిక్స్ ఛాయిస్ ఉత్తమ నటి - కంగనా రానౌత్ (తను వెడ్స్ మను రిటర్న్స్) సహాయ పాత్రలో ఉత్తమ నటి: ప్రియాంకా చోప్రా (బాజీరావ్ మస్తానీ') సహాయ పాత్రలో ఉత్తమ నటి: అనిల్ కపూర్ (దిల్ దడక్నే దో) జీవితకాల సాఫల్య పురస్కారం - మౌషుమి ఛటర్జీ ఉత్తమ కాస్ట్యూమ్ - అంజు మోడీ, గరిష్ట బసు (బాజీరావ్ మస్తానీ) ఉత్తమ సౌండ్ డిజైన్ - షాజిత్ కోయెరీ (తల్వార్) ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ - సుజీత్ సావంత్, శ్రీరామ్ అయ్యంగార్, సలోని ధాత్రక్ (బాజీరావ్ మస్తానీ) ఉత్తమ నృత్యదర్శకుడు - పండిట్ బిర్జు మహరాజ్ ('బాజీరావ్ మస్తానీ'లో మోహె రంగ్ దో లాల్ పాటకు) ఉత్తమ సినిమాటోగ్రఫీ - మను ఆనంద్ ('దమ్ లాగాకే హైస్సా') ఉత్తమ యాక్షన్ - నకిలీ కౌశల్ (బాజీరావ్ మస్తానీ) ఆర్డీ బర్మన్ అవార్డు - అర్మాన్ మాలిక్ ఉత్తమ నేపథ్య సంగీతం - అనుపమ్ రాయ్ (పీకూ) ఉత్తమ వీఎఫ్ఎక్స్ - ప్రాణ స్టూడియో (బొంబే వెల్వెట్) ఉత్తమ నేపథ్య గాయని - శ్రేయా ఘోషాల్ ('బాజీరావ్ మస్తాని'లో దివానీ మస్తానీ పాట) ఉత్తమ నేపథ్య గాయకుడు - అరిజిత్ సింగ్ ('రాయ్'లో సూరజ్ డుబా హై పాట) ఉత్తమ పాట - ఇర్షాద్ కామిల్ ('తమాషా'లో అగర్ తుమ్ సాత్ హో) ఉత్తమ సంగీతం - అంకిత్ తివారీ, మీట్ బ్రదర్స్ అంజన్, అమాల్ మల్లిక్ (రాయ్) ఉత్తమ స్క్రీన్‌ప్లే - జుహీ చతుర్వేది (పీకూ) ఉత్తమ ఎడిటింగ్ - శ్రీకర్ ప్రసాద్ (తల్వార్) ఉత్తమ కథ - విజయేంద్ర ప్రసాద్ (బజరంరీ భాయ్‌జాన్) ఉత్తమ సంభాషణలు - హిమాన్షు శర్మ (తను వెడ్స్ మను రిటర్న్స్) -
దీపిక పారితోషికం ఎంతో తెలుసా?
ఈ నెల 5వ తేదీతో 30వ వసంతంలోకి అడుగుపెట్టింది బాలీవుడ్ అందాల సుందరి దీపికా పదుకొణ్. ఆమె జన్మదినం సందర్భంగా ఓ ఆసక్తికరమైన వార్త సినీ పరిశ్రమ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అది వరుస విజయాలతో జోరుమీదున్న దీపిక పారితోషికం గురించి. 2015 వరకు ఈ సుందరి సినిమాకు రూ. 10 కోట్ల చొప్పున తీసుకునేదట. కానీ 'బాజీరావు మస్తానీ' సినిమా ఊహించనంత విజయం సాధించడంతో ఈమె పారితోషికాన్ని అమాంతం పెంచేసింది. ఇప్పుడు సినిమాకు రూ. 15 కోట్లు అడుగుతున్నదని సమాచారం. ప్రస్తుతం దేశంలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న అతికొద్ది మంది హీరోయిన్లలో ఒకరిగా దీపిక నిలిచింది. 2015లో దీపిక ప్రేక్షక జనం నుంచే కాదు సినీ విమర్శకుల నుంచి కూడా ప్రశంసలందుకుంది. గత ఏడాది షుజిత్ సర్కార్ తెరకెక్కించిన 'పీకూ' సినిమాలో దీపిక తన అభినయంతో అదరగొట్టింది. చక్కని విజయం సాధించిన 'పీకూ'లో దీపిక తన నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఇక మాజీ బాయ్‌ఫ్రెండ్ రణ్‌బీర్ కపూర్‌తో కలిసి నటించిన 'తమాషా' సినిమా కూడా దీపికకు మంచి పేరునే తీసుకొచ్చింది. ఏడాది చివర్లో వచ్చిన 'బాజీరావు మస్తానీ'లో మస్తానీగా ఈ సొట్టబుగ్గల చిన్నది అభిమానులను కట్టిపడేసింది. ఈ సినిమాలో దీపిక చూపిన అభినయ కౌశల్యంపై విమర్శకుల నుంచీ ప్రశంసల వర్షం కురిసింది. 'బాజీరావు మస్తానీ' విజయంతో నిర్మాతలకు దీపిక మరింత ప్రియంగా మారింది.. ఆమె పారితోషికం కళ్లు చేదిరేస్థాయికి పెరిగిందంటున్నారు బాలీవుడ్ జనాలు. -
స్కూటర్ మీద చక్కర్లు కొట్టిన అమితాబ్!
కోల్‌కతా: దాదాపు ఏడాది కిందట సైకిల్ తొక్కి హల్చల్ చేసిన బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తాజాగా స్కూటర్ నడిపారు. చక్కగా హెల్మెట్ పెట్టుకొని, గళ్ల చొక్కా, ముదురు రంగు ప్యాంటు తొడుక్కొని ఆయన అలా కోల్‌కతా వీధుల్లో స్కూటర్‌పై సవారీ చేశారు. పశ్చిమ బెంగాల్ అధికార కేంద్రానికి చిరునామా అయిన రైటర్స్ బిల్డింగ్ వద్ద శనివారం ఈ దృశ్యం కనిపించింది. రిబూ దాస్‌గుప్తా రూపొందిస్తున్న తాజా చిత్రం 'టీఈ3ఎన్' (Te3N) సినిమా కోసం అమితాబ్ ఇలా స్కూటర్ ఎక్కారు. గతంలో 'పీకూ' సినిమా కోసం అమితాబ్ సైకిల్ తొక్కి.. అభిమానులను అలరించిన సంగతి తెలిసిందే. 'పీకూ'లో దీపికా పదుకొణే తండ్రిగా నటించిన అమితాబ్ తాజాగా రిబూ దాస్‌గుప్తా సినిమాలో విభిన్న పాత్రతో అలరించడానికి సిద్ధమవుతున్నారు. విఖ్యాత సినీ దిగ్గజం సుజయ్ ఘోష్ నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటులు నవాజుద్దీన్ సిద్దిఖీ, విద్యాబాలన్ కూడా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కోసం అమితాబ్ శ్రద్ధగా దర్శకుడి సూచనలు వినడం.. కొన్ని సెకండ్లపాటు కోల్‌కతా వీధుల్లో స్కూటర్ నడుపడం.. అక్కడ పెద్ద ఎత్తున గుమిగూడిన ఆయన అభిమానులు, ప్రజలకు ఎంతో సంతోషం కలిగించింది. T 1154 - 'TE3N' a novel idea and a novel film ... riding in Kolkata .. cycle PIKU .. motor cycle 'TE3N' pic.twitter.com/03sHCOiAvM — Amitabh Bachchan (@SrBachchan) November 28, 2015 -
నా ప్రతీ సినిమా కాపీనే: షూజిత్ సర్కార్
షూజిత్ సర్కార్.. ప్రయోగాత్మక సినిమాలను ఇష్టపడే సినీ అభిమానులకు సుపరిచితమైన పేరు.. సాధారణంగా కమర్షియల్ దర్శకులు కొన్ని కథల జోలికి వెళ్లడానికి కూడా భయపడతారు. అలాంటి కథలతో సంచలనాలు సృష్టించే ఈ దర్శకుడు.. తాజాగా సంచలనాత్మక కామెంట్లతో వార్తల్లో నిలిచాడు. తన ప్రతి సినిమాలో ఏదో ఒక పాయింట్‌ను కాపీ చేస్తానంటూ చెప్పిన షూజిత్.. ఆ విషయం మాత్రం సాధారణ ప్రేక్షకులకు అర్ధం కాకుండా జాగ్రత్త పడతానన్నాడు. లెజెండరీ డైరెక్టర్ సత్యజిత్ రే తీసిన 'పథేర్ పాంచాలి' సినిమా విడుదలై 60 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా కోల్‌కతాలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొన్న షూజిత్ ఈ వ్యాఖ్యలు చేశాడు. తన ప్రతి సినిమాలో ఏదో ఒక పాయింటును 'పథేర్ పాంచాలి' స్ఫూర్తితోనే తెరకెక్కిస్తానని, నిజానికి రే తీసిన ప్రతి సినిమా భారతీయ సినీ పరిశ్రమకు బైబిల్ లాంటిదని అన్నాడు. మద్రాస్ కేఫ్, విక్కీ డోనార్, పికు లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ అందించిన షూజిత్ సర్కార్ ప్రస్తుతం అమితాబ్ ప్రధానపాత్రలో ఓ డాక్యుమెంటరీ తెరకెక్కిస్తున్నారు. దీంతో పాటు మరో రెండు సినిమాలను ప్రకటించి.. వాటికి స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నాడు. -
వాటిని దాచుకున్నా!
మీరు ‘పీకు’ సినిమా చూసే ఉంటారు. అందులో పొడుగు కాళ్ల సుందరి దీపికా పదుకొనే వాడిన చెవిపోగులు గుర్తున్నాయా? ఆమె ఓ సన్నివేశంలో వాటిని అలంకరించుకుంటూ అద్దంలో చూసుకునే సన్నివేశాన్ని ప్రేక్షకులు అంత తొందరగా మర్చిపోలేరు. ఆమె అందాన్ని మరింత రెట్టింపు చేసిన ఆ చెవి పోగులంటే దీపికాకు చాలా ఇష్టమట. దీని గురించి ఆమె చెబుతూ -‘‘ఈ సినిమా నా కెరీర్లో మైలురాయిగా నిలిచిపోవడమే కాకుండా, నా జీవితంలో మరపురాని అనుభూతులను మిగిల్చింది. నా దృష్టిలో ఇది ఒక ప్రత్యేకమైన చిత్రం.అందులో నేను వాడిన చెవిపోగులంటే చాలా ఇష్టం. వాటిని మాత్రం పదిలంగా, ఈ సినిమాకు ఓ గుర్తుగా దాచుకున్నా’’ అని అన్నారు. -
సినిమా చూసిన రాష్ట్రపతి
షూజిత్ సర్కార్ దర్శకత్వంలో రూపొంది, విమర్శకుల ప్రశంసలు అందుకున్న 'పికూ' సినిమాను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చూశారు. ఆయన కోసం ఈ సినిమా ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఆయనకు ఈ సినిమాతో పాటు సినిమాలో బెంగాలీ యాసలో ఉన్న హిందీ కూడా బాగా నచ్చిందని బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ అన్నారు. తండ్రీకూతుళ్ల మధ్య ఉండే చక్కటి అనుబంధాన్ని ఈ సినిమాలో చూపించారు. ఇందులో కూతురి పాత్ర పోషించిన దీపికా పడుకొనే.. తన సొంత జీవితాన్ని సైతం పక్కన పెట్టి, తండ్రి (అమితాబ్) చెప్పే కథలు వింటూ ఉంటుంది. ఇర్ఫాన్ ఖాన్ కూడా ఓ ముఖ్యపాత్రలో నటించిన ఈ సినిమా మే 8వ తేదీన విడుదలైంది. ఆదివారం రాత్రి రాష్ట్రపతి భవన్లో ప్రణబ్ ముఖర్జీ కోసం ఈ సినిమాను ప్రత్యేకంగాప్రదర్శించారు. ఈ విషయాన్ని అమితాబ్ బచ్చన్ తన బ్లాగులో రాశారు. -
పీకూ వైపు వెంకీ చూపు???
-
’పీకూ’ హిట్‌తో జోష్‌మీదున్న దీపికా
-
'నన్ను దత్తత అడుగుతున్నారు'
ముంబై:గత వారం విడుదలైన పీకూ చిత్రం సక్సెస్ తో బాలీవుడ్ నటి దీపికా పదుకునే ఆనందం వ్యక్తం చేస్తోంది. ఆ చిత్రం విడుదలైన అనంతరం చాలా మంది నుంచి తనకు ఫోన్లు వస్తున్నాయని.. అందులో ఎక్కువ శాతం మంది తనను దత్తత తీసుకుంటామని అడుగుతున్నారని దీపికా తెలిపింది. షూజిత్ సర్కార్ దర్శకత్వం వహించిన పీకూ లో బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూతురిగా విభిన్నమైన పాత్రలో కనిపించిన దీపికా నటనపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఒక ప్రక్క ఆఫీస్ పని చేసుకుంటూ మరో ప్రక్క కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండటమే దీపికా పాత్ర. తాజాగా ఐఏఎన్ఎస్ కు ఇచ్చిన ఇంటర్యూలో దీపిక పలు విషయాలను వెల్లడించింది. ఈ చిత్రంలో తండ్రికి కూతురికి మధ్య సంబంధం సహజసిద్ధంగా ఉందని.. ఇది తప్పకుండా ప్రేక్షకులకు చేరవుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. పీకూ విడుదల తరువాత చాలా మంది తనను దత్తత తీసుకోవాలని కోరడం నిజంగా చాలా ఫన్నీగా ఉందని తెలిపింది.. నా సినిమాలకు తన కుటుంబ సభ్యులే సిసలైన విమర్శకులని ఈ సందర్భంగా దీపిక స్పష్టం చేసింది. -
అమితాబ్‌కు వాళ్ళమ్మాయి గుర్తొచ్చింది!
ఇటీవల ఎటుచూసినా నటి దీపికా పదుకొనే కనిపిస్తున్నారు. ‘మై ఛాయిస్’ వీడియో అందుకు ఒక కారణమైతే, ఈ వారంలోనే రానున్న కొత్త సినిమా ‘పీకూ’ మరో కారణం. ‘మై ఛాయిస్’ వీడియో వివాదం గురించి కాసేపు పక్కన పెడితే, శూజిత్ సర్కార్ రూపొందిస్తున్న ‘పీకూ’లో అమితాబ్, దీపిక తండ్రీ కూతుళ్ళుగా నటించారు. అభినయ ప్రధానమైన ఈ సినిమా కేవలం తండ్రీ కూతుళ్ళ మధ్య ప్రేమ మీదే కాక, సర్వసాధారణంగా మనం మన తల్లితండ్రులతో మాట్లాడడానికి వెనుకాడే అంశాల మీదా దృష్టి పెడుతున్నట్లు దీపికా పదుకొనే చెప్పారు. ‘‘ఈ సినిమా కథ చెప్పగానే ఎప్పుడెప్పుడు చేద్దామా అనిపించింది. మునుపెన్నడూ ఏ సినిమా స్క్రిప్ట్‌కూ నాకు ఇలాంటి ఉద్వేగం కలగలేదు’’ అని ఈ ముద్దుగుమ్మ చెప్పారు. ‘‘ఒక స్వతంత్ర మహిళ ఒకపక్కన తన తండ్రి బాగోగులు, ఇంటి విషయాలు చూసుకుంటూ, మరోపక్క ఉద్యోగం చేయడమనే అంశాన్ని ఇందులో బాగా చూపారు. గతంలో అమితాబ్‌తో కలసి ఒక సినిమాలో చేసినందు వల్ల మా మధ్య మంచి బంధం ఉంది’’ అని దీపిక చెప్పారు. ‘‘ప్రతి ఏటా దీపావళికి అమితాబ్ నన్ను వాళ్ళ ఇంటికి పిలుస్తుంటారు. నిజజీవితంలో కూడా అమితాబ్ దంపతులకు నన్ను చూస్తే వాళ్ళమ్మాయి శ్వేత గుర్తొస్తుందట. ఆ మాటే వారిద్దరూ చెబుతుంటారు’’ అని ఈ లలితాంగి గుర్తు చేసుకున్నారు. అమితాబ్‌కు సొంత కూతుర్ని గుర్తుచేస్తున్న దీపిక వెండితెరపై అదే పాత్రను ఎలా పోషించారో చూడాలి! -
స్టార్స్ ఆన్ రోడ్!
ఫస్ట్ ట్రైలర్‌తోనే ఇండస్ట్రీ, అభిమానుల నుంచి ప్రశంసలు అందుకుంది సూజిత్ సర్కార్ రూపొందిస్తున్న ‘పికూ’. లేటెస్ట్గా మరో ట్రైలర్ రిలీజ్ చేశారు నిర్మాతలు. చిత్రంలోని తొలి సాంగ్... ‘జర్నీ’ ఇది. ఈ పాటలో మెగా స్టార్ అమితాబ్ బచన్, సూపర్ హీరోయిన్ దీపికా పడుకొనే, నటుడు ఇర్ఫాన్ ఖాన్లు... దిల్లీ నుంచి కోల్‌కతాకు ప్రయాణిస్తుంటారు. అనుపమ్ రాయ్, శ్రేయ గోశాల్ ఈ పాట ఆలపించారు. ఈ ట్రైలర్‌కు కూడా అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. తండ్రీ కూతుళ్ల చుట్టూ తిరిగే కథ ఇది. అమితాబ్, దీపికా ఈ రోల్స్ ప్లే చేస్తున్నారు. దీపిక అందాల రాసిగా కనిపించడమే కాదు... అద్భుతంగా నటించిందనేది ఇండస్ట్రీ టాక్. ఇక బిగ్ బీ పెర్ఫార్మెన్స్ హైలైట్ అవుతుందట! వీరికి తోడు క్యారెక్టర్లో ఒదిగిపోయే ఇర్ఫాన్‌ఖాన్ ఉండనే ఉన్నాడు. మూవీ మంచి మార్కులు కొట్టేయడం ఖాయమని ఇప్పటి నుంచే బీటౌన్‌లో టాక్! -
'ఈ నగరాన్ని వదిలివెళ్లడం చాలా కష్టం'
షూజిత్ సర్కార్ తీస్తున్న 'పికు' సినిమా షూటింగ్ ముగిసిపోవడంతో కోల్‌కతా నగరాన్ని వదిలి వెళ్లాల్సి రావడం బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌కు చాలా కష్టంగా అనిపిస్తోంది. తన తొలినాళ్లలో ఈ నగరంలోనే గడిపిన ఆయన.. షూటింగ్ జరిగిన నెలరోజులూ నగరంలోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా తిరిగారు. కోల్‌కతాలో ఈ సినిమా షూటింగ్ దాదాపుగా ముగిసిపోవడంతో ఆయన తిరిగి ముంబై వెళ్లడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ''ఇలా వదిలి వెళ్లడం చాలా కష్టమే.. కానీ తప్పదు'' అని ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ సినిమాలో ఆయన దీపికా పడుకొనే తండ్రి పాత్ర పోషిస్తున్నారు. ఇంతకుముందు ప్రకాష్ ఝా తీసిన 'ఆరక్షణ్'లో కూడా ఆయన దీపికకు తండ్రిగానే చేశారు. పికు సినిమాకు అందించిన సహకారం చాలా బాగుందంటూ మమతా బెనర్జీకి దర్శకుడు షూజిత్ సర్కర్ ధన్యవాదాలు తెలిపారు. ఆమె ఆశీర్వాదాలు లేకుండా ఈ షూటింగ్ జరిగేదే కాదన్నారు. అలాగే కోల్‌కతా ప్రజలు కూడా చాలా ప్రేమ కనబరిచారని, దాంతో తాము ఇంట్లో ఉన్నట్లే అనిపించిందని ట్వీట్ చేశారు. కోల్‌కతాలోని ప్రఖ్యాత రైటర్స్ బిల్డింగ్, హౌరా బ్రిడ్జి ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ జరిగింది. ఏప్రిల్ 30వ తేదీన ఇది విడుదల కావచ్చని భావిస్తున్నారు. T 1677 - As the Kolkata schedule closes in to an end, withdrawal symptoms creep in .. shall be a tough leave .. BUT .. we shall be back ! — Amitabh Bachchan (@SrBachchan) November 16, 2014 -
ఫ్యామిలీ ప్యాక్‌తో అమితాబ్
-
అమితాబ్ ఫ్యామిలీ ప్యాక్
ఆరు పలకలు, ఎనిమిది పలకల దేహాలిప్పుడు ఫ్యాషన్. రెండు పదుల వయసున్న నటుల నుంచి ఆరు పదుల వయసున్న వారి వరకూ పాత్ర డిమాండ్ చేస్తే.... ఇలాంటి ప్యాక్‌ల కోసం కసరత్తులు చేస్తున్నారు. ‘పీకూ’ చిత్రంలో అమితాబ్ బచ్చన్ కూడా ప్యాక్‌లో కనిపిస్తారు. కానీ, ఇది సిక్స్ ప్యాక్ కాదు... ‘ఫ్యామిలీ ప్యాక్’. చిరు బొజ్జతో, నెత్తిన వెరైటీ టోపీతో అమితాబ్ కనిపించనున్నారు. మరి.. ఈ సినిమా కోసం అమితాబ్ బొజ్జ పెంచారా? లేక నకిలీదా అనేది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం అమితాబ్ చేస్తున్న పాత్రలన్నీ వినూత్న తరహావే. ‘షమితాబ్’ చిత్రంలో నెరిసిన గడ్డం, జుత్తుతో కనిపించనున్నారు. అలాగే, ‘వాజిర్’ అనే చిత్రంలో చెస్ మాస్టర్‌గా నటిస్తున్నారు. ఇందులో వెరైటీ ఏముంది? అనుకోవచ్చు. కాళ్లు చచ్చుబడిపోయి, చక్రాల కుర్చీకి పరిమితమయ్యే చెస్ మాస్టర్ పాత్ర ఇది. ఏడు పదుల వయసులో అమితాబ్ ఇలా ఒకేసారి ఆహార్యంపరంగా వ్యత్యాసం చూపించే పాత్రలు చేయడం గొప్ప విషయం. ఒకవైపు సినిమాలు చేస్తూ.. మరోవైపు బుల్లితెరపై ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ ప్రోగ్రామ్‌కు హోస్ట్‌గా కనిపించడంతో పాటు ‘యుద్ధ్’ అనే ధారావాహికలో టైటిల్ రోల్ చేస్తున్నారు. ఇలా అలుపు సొలుపూ లేకుండా అమితాబ్ పని చేస్తున్నారు. -
అమితాబ్ కు అస్వస్థత, షూటింగ్ లు రద్దు!
ముంబై: బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ అనారోగ్యానికి గురవ్వడంతో ఆయన నటించే సినిమాల షూటింగ్ లు రద్దు చేశారు. అమితాబ్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నట్టు సమాచారం. షుజిత్ సర్కార్ దర్శకత్వంలో 'పీకూ', షమితాబ్ చిత్రాల షూటింగ్ తో కౌన్ బనేగా కరోడ్ పతి కార్యక్రమంతో అమితాబ్ బిజీగా ఉన్నారు. తాను జ్వరంతో బాధపడుతున్నానని శనివారం అమితాబ్ ట్వీట్ చేశారు. ఇంకా జ్వరంతోనే బాధపడుతున్నాను.. షూటింగ్ రద్దు అవ్వడం బాధగా ఉంది అని ఆదివారం మరో ట్వీట్ చేశారు. -
నాడు ప్రేయసి...నేడు వదిన..!
హిందీ రంగాన్ని ఒకప్పుడు ఉర్రూతలూగించిన తారల్లో మౌసమీ చటర్జీ ఒకరు. చక్కని రూపానికి మంచి అభినయం తోడవ్వడంతో మౌసమీ పదేళ్లకు పైగా హిందీ తెరను ఓ స్థాయిలో ఏలారు. హిందీలో చేసిన తొలి చిత్రం ‘అనురాగ్’లో అంధురాలిగా నటించి, శభాష్ అనిపించుకున్నారామె. ఆ తర్వాత అభినయానికి ఆస్కారం ఉన్న పాత్రలు చాలానే చేశారు. కథానాయికగా ఓ పదిహేనేళ్లు చేసిన తర్వాత, సహాయ పాత్రలు చేయడం మొదలుపెట్టారు మౌసమీ. ఈ మధ్య అడపా దడపా మాత్రమే నటిస్తున్నారామె. ఈ నేపథ్యంలో ‘పీకు’ అనే చిత్రంలో నటించడానికి పచ్చజెండా ఊపారని సమాచారం. సుజిత్ సర్కార్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె, ఇర్ఫాన్‌ఖాన్ ముఖ్యతారలు కాగా, ఇటీవలే మౌసమీని ఎంపిక చేశారు. ఇందులో అమితాబ్‌కి వదినగా నటించనున్నారామె. అమితాబ్ బచ్చన్ సరసన ‘బేనామ్’, ‘మంజిల్’ తదితర చిత్రాల్లో నటించారు మౌసమీ. ఒకప్పుడు బిగ్ బీ సరసన ప్రేయసిగా నటించి, ఇప్పుడు ఆయనకు వదినగా చేయడం అంటే విశేషమే.