‘యాంటీ’ ముసుగు.. పైరసీ లొసుగు
♦ బాహుబలి–2 పైరసీ ముఠా నాయకుడి వ్యవహారం ఇదీ
♦ ఢిల్లీలో యాంటీ పైరసీ వింగ్ అంటూ కార్యాలయం
♦ అక్కడి నుంచే పైరసీ సినిమాల దందా, బెదిరింపులు
♦ త్వరలో సినీ రంగంతో సీసీఎస్ పోలీసుల సమావేశం
సాక్షి, హైదరాబాద్: బాహుబలి–2 చిత్రాన్ని పైరసీ చేయడమే కాదు.. నిర్మాతలకు ‘సిని మా’చూపించిన ముఠా నాయకుడి స్టైలే వేరు. ఢిల్లీ కేంద్రంగా పైరసీకి వ్యతిరేకంగా పోరాడే ఏజెన్సీ ఏర్పాటు చేసి.. దాని ముసుగులోనే అనేక చిత్రాలను పైరసీ చేయడంతో పాటు విక్రయించి, నిర్మాతల్ని బెదిరించి సొమ్ము చేసుకుంటున్నాడని సైబర్ క్రైమ్ పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ ముఠాను సోమవారం అరెస్టు చేసిన పోలీసులు.. విచారణలో అనేక కీలకాంశాలను గుర్తించారు.
ప్రీతంపురలో ఆఫీస్ ఏర్పాటు చేసి..
ఢిల్లీకి చెందిన రాహుల్ మెహతా ప్రీతంపురలో కార్యాలయం ఏర్పాటు చేసి.. జితేందర్కుమా ర్ మెహతా, తౌఫీఖ్, మహ్మద్ అలీతో పాటు మరికొందరిని ఉద్యోగులుగా తీసుకున్నాడు. తమది సినిమా పైరసీకి వ్యతిరేకంగా పనిచేసే యాంటీ పైరసీ వింగ్ అని ప్రచారం చేసుకు న్నాడు. దీని ముసుగులోనే కొత్త చిత్రాల పైరసీని ప్రోత్సహించడం ప్రారంభించాడు. యాంటీ పైరసీ వింగ్ కావడంతో బాలీవుడ్‌తో నూ పరిచయాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యం లోనే బాహుబలి–2 పైరసీ సీడీ చేతికి వచ్చిన వెంటనే రాహుల్ బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్‌నే సంప్రదించగలిగాడు.
ఎక్కడా నేరుగా పాల్గొనడు..
పైరసీ సినిమాల విక్రయం, ఆ సీడీలు చూపిం చి నిర్మాతల్ని బెదిరించి డబ్బు గుంజడంతో దిట్టగా పేరున్న రాహుల్ మెహతా ఏ సంద ర్భంలోనూ నేరుగా పైరసీ చేయడు. తన అను చరులతో చేయించడమో, పైరసీ సీడీలను చేజిక్కించుకుని దందాలకు దిగడమో చేస్తుం టాడు. 2015లో బాహుబలి చిత్రాన్ని సైతం ఈ ముఠా పైరసీ చేసింది. మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ కేంద్రంగా తన అనుచరులతో ఈ పని చేయించి.. నెట్లో పెట్టి సొమ్ము చేసుకు న్నాడు. అయితే బాహుబలి–2 పైరసీ ఎలా చేశారనే విషయాన్ని రాహుల్ పట్టించుకోలే దు. సీడీ తన చేతికి రాగానే బేరసారాలకు దిగాడు.
పటిష్ట సెక్షన్ల కింద కేసు నమోదు..
సాధారణంగా పైరసీకి సంబంధించి కాపీ రైట్ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తారు. దీంతో నిందితులు తేలిగ్గా బెయిల్ పొంది బయటకు వస్తున్నారు. దీన్నే ఆసరాగా చేసుకున్న రాహు ల్ గ్యాంగ్ దాదాపు 30 హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ చిత్రాలను పైరసీ చేసింది. దీన్ని గమనించిన సీసీఎస్ పోలీసులు.. బాహు బలి–2 ఉదంతంలో డిస్ట్రిబ్యూటర్ను మోసం చేయడం, అంతా కలసి కుట్రపన్నడం, నిర్మాతలను బెదిరించడం.. ఎపిసోడ్లను పరిగణనలోకి తీసుకుని ఆయా సెక్షన్లనూ జోడించి కేసు నమోదు చేశారు. దీంతో నిందితులకు తేలిగ్గా బెయిల్ లభించదని, నేరం నిరూపణ అయితే ఎక్కువకాలం శిక్ష పడుతుందని అధికారులు చెప్తున్నారు.